83,543 కోట్లు
ABN , First Publish Date - 2023-09-04T03:55:02+05:30 IST
తెలంగాణలో రూ.83,543 కోట్ల అంచనాతో కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో మెగా రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం
15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్లు.. 12 వేల కోట్లతో ఔటర్ రింగ్ రైల్
సర్వేకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఇది చరిత్రాత్మక నిర్ణయం: కిషన్ రెడ్డి
రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతో నిలిచిన 700 కి.మీ. పనులు: కేంద్ర మంత్రి విమర్శ
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రూ.83,543 కోట్ల అంచనాతో కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. 15 కొత్త ప్రాజెక్టులు, మరో 15 అదనపు లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి లభించిందని తెలిపారు. ఇందులో 8 డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లు ఉన్నాయని, సర్వే కోసం నిధులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. సర్వే పూర్తికాగానే డీపీఆర్‌ల పనులు ప్రారంభిస్తారని కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సహాయ నిరాకరణ వల్ల 700 కి.మీ. మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ముఖ్యంగా, రాష్ట్ర సర్కారు వాటా నిధులు విడుదల చేయకపోవడంతో పాటు భూ సేకరణలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆదివారం సీజీవో టవర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి కొత్త రైల్వే ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు: ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది. ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్‌తోనూ, ముంబైతోనూ.. అటు నాగపూర్ మీదుగా ఢిల్లీతో కలుపుతుంది. ప్రాజెక్టు పొడవు 317కి.మీ. అంచనా వ్యయం రూ.5,706 కోట్లు.
దక్షిణ తెలంగాణను కలిపే లైన్: డోర్నకల్ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు ఈ ప్రాజెక్టు రానుంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ దీని ద్వారా అనుసంధానమవుతాయి. పత్తి ఎగుమతి, బియ్యం రవాణా, గ్రానైట్ తరలింపునకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలను కలపడం ద్వారా వాణిజ్య అవసరాలకు మేలు. ప్రాజెక్టు పొడవు 296 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.5,330 కోట్లు.
కాచిగూడ(ఉందానగర్)-జగ్గయ్యపేట లైన్: రంగారెడ్డి జిల్లా మీదుగా చిట్యాల, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, జగ్గయ్యపేట నియోజకర్గాలను ఈ లైన్ అనుసంధానం చేస్తుంది. 65వ నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైదరాబాద్, అమరావతిని కలిపే అతి తక్కువ దూరం కలిగిన రైల్వే మార్గం ఇదే కాబోతున్నది. ఈ ప్రాంతంలో ప్రజా రవాణా, వాణిజ్య అవసరాలకు ముఖ్యంగా సిమెంట్ ప్లాంట్లకు లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు పొడవు 228 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.4,104 కోట్లు.
కరీంనగర్-హసన్‌పర్తి లైన్: మానకొండూరు, హుజూరాబాద్‌లను హైదరాబాద్‌తో కలుపుతుంది. గ్రానైట్ ఉత్పత్తులను నేరుగా కాకినాడ ఓడరేవుకు పంపేందుకు ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు పొడవు 62 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.1,116 కోట్లు.
భూపాలపల్లి-కాజీపేట కొత్త లైన్: భూపాలపల్లి, జగదల్‌పేట, మర్రిపల్లిని మెయిన్ ట్రంక్‌తో అనుసంధానం చేస్తుంది. మేడారం వేళ్లే భక్తులకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గును పవర్ ప్లాంట్లకు తరలించేందుకు, లేటరైట్, డోలమైట్, నల్ల గ్రానైట్, సున్నపురాయి తదితర సహజ వనరులను తీసుకెళ్లేందుకు ఉపయోగం. ప్రాజెక్టు పొడవు 64 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.1,152 కోట్లు.
వికారాబాద్-కృష్ణా లైన్: పరిగి, కొడంగల్, హుస్నాబాద్, దౌల్తాబాద్, మక్తల్, నారాయణపేట వంటి ప్రాంతాలను కలుపుతుంది. వికారాబాద్, తాండూరు ప్రాంతం నుంచి ప్రజా రవాణా, సిమెంట్ క్లస్టర్ కోసం సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది. హుబ్లీ, కొల్హాపూర్ (మహాలక్ష్మి ఆలయం), గోవా వెళ్లేందుకు సులభమైన మార్గం. ప్రాజెక్టు పొడవు 122 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.2196 కోట్లు.
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు: ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు ఇది. 40ు తెలంగాణ ప్రాంతం కవర్ అవుతుంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్ వంటి పట్టణాలను అనుసంధానం చేస్తుంది. ప్రాజెక్టు పొడవు 564 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.12,408 కోట్లు.
ఎంఎంటీఎ్‌స-ఫేజ్ 2: ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు పొడిగింపు. యాదాద్రిని ఎంఎంటీఎ్‌సతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస సహకారం అందిచలేదు. దీంతో కేంద్రమే ఖర్చులు భరించి పూర్తిచేయాలని నిర్ణయించింది. ఘట్‌కేసర్ నుంచి వంగపల్లి వరకు క్వాడ్రపుల్ పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం. ఈ మార్గం పొడవు: 40 కి.మీ. అంచనా వ్యయం సుమారు రూ.980 కోట్లు.
మణుగూరు-రామగుండం లైన్:భూపాలపల్లి ప్రాంతంలోని సింగరేణి గనులను.. ఛత్తీ్‌సగఢ్, ఒడిశాలోని గనులతో అనుసంధానం చేసే లైన్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి అనుసంధానమవడంతో పర్యాటకులకు ఎంతో ఉపయోగకరం. లైన్ పొడవు 200 కి.మీ. ఖర్చు సుమారు రూ.3,600 కోట్లు.
డోర్నకల్-మిర్యాలగూడ లైన్: నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌లను కలుపుతుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీలతో కనెక్టివిటీ పెరుగుతుంది. లైన్ పొడవు 120 కి.మీ. వ్యయం సుమారు రూ.2,160 కోట్లు.
భద్రాచలం-మల్కన్‌గి లైన్: దక్షిణ అయోధ్య భద్రాచలానికి ఇంతవరకు రైలు మార్గం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్, ఢిల్లీ-చెన్నై ప్రధాన రైల్వే లైన్‌కు ఈ మార్గం అనుసంధానమవుతుంది. ఒడిశా, తెలంగాణలోని గనులను కాకినాడ రేవుతో అనుసంధానం చేస్తుంది. ప్రాజెక్టు పొడవు 186 కి.మీ. అంచనా రూ.3,592 కోట్లు.
తాండూరు సిమెంట్ క్లస్టర్-జహీరాబాద్ లైన్: దీంతో తాండూరు, వికారాబాద్, జహీరాబాద్ మధ్య 65 కి.మీ. దూరం తగ్గుతుంది. సికింద్రాబాద్, వాడి మధ్యలో సిమెంట్ క్లస్టర్ నుంచి సరుకును పుణె, ముంబై తరలించేందుకు మార్గం సుగమం అవుతుంది. లైన్ పొడవు 75 కి.మీ. అంచనా వ్యయం రూ.1,350 కోట్లు.
డబ్లింగ్ ప్రాజెక్టులు: డోర్నకల్-భద్రాచలం రోడ్, మోటుమర్రి-విష్ణుపురం, నిజామాబాద్-పెద్దపల్లి, వికారాబాద్-పర్లి వైద్యనాథ్, మౌలాలీ- సనత్ నగర్, ముద్-ఖేడ్-ఆదిలాబాద్-పిపంల్ కుట్ట.
ట్రిప్లింగ్ ప్రాజెక్టులు: డోర్నకల్-మణుగూరు వయా కొత్తగూడెం, సికింద్రాబాద్-కాజీపేట, సికింద్రాబాద్-వాడి.
క్వాడ్రప్లింగ్ ప్రాజెక్టులు: కాజీపేట-సికింద్రాబాద్, కాజీపేట-బల్లార్షా, కాజీపేట-విజయవాడ, సికింద్రాబాద్-వాడి.
ఆదిలాబాద్‌ను మహారాష్ట్రలోని గడ్-చందూర్ ప్రాంతంతో అనుసంధానించేందుకు సుమారు రూ.1,278కోట్లతో ప్రాజెక్టును చేపట్టనున్నారు. 71 కి.మీ ఈ మార్గం ద్వారా గడ్-చందూర్ ప్రాంతంలోని బొగ్గును పర్లి, హోటగి, కూడగీ పవర్ ప్లాంట్లకు తరలించేందుకు వీలవుతుంది.
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లోని గనులు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే 180 కి.మీ కొత్తగూడెం-హుట్గి-కిరండోల్ లైన్ కోసం కేంద్రం రూ.3,240 కోట్లను వెచ్చించనుంది.
ఉత్తర తెలంగాణను మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పంఢార్‌పూర్, పర్లిలకు అనుసంధానించే బోధన్-లాతూర్ కొత్త లైన్ కోసం (135 కి.మీ) రూ. 2,430 కోట్లతో రైల్వే శాఖ అంచనాలను సిద్ధం చేస్తోంది.