Share News

రెండో రోజు 8,12,862

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:52 AM

ఆరుగ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తు స్వీకరణ సదస్సులకు విశేష స్పందన లభిస్తుంది.

రెండో రోజు 8,12,862

‘ప్రజాపాలన ’కు వచ్చిన దరఖాస్తులు

రెండ్రోజుల్లోనే 15.59 లక్షలు..

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆరుగ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తు స్వీకరణ సదస్సులకు విశేష స్పందన లభిస్తుంది. ప్రజాపాలన రెండో రోజైన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి 8,12,862 దరఖాస్తులు అందినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ సహా పట్టణ ప్రాంతాల నుంచి 4.89 లక్షలు, గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862 దరఖాస్తులు అందాయని చెప్పారు. తొలిరోజైన గురువారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి 7,46,414 దరఖాస్తులు అందాయి. అంటే.. సదస్సులు ప్రారంభమైన రెండ్రోజుల్లోనే 15,59,276 దరఖాస్తులొచ్చాయి. డిసెంబరు 6వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణ సదస్సులు కొనసాగనున్న సంగతి తెలిసిందే. దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబరు 6 నాటికి భారీగా దరఖాస్తులొచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడండి: జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫిరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడారు. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. మొదటి రోజున సదస్సుల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నందుకు కలెక్టర్లను అభినందించారు. అభయ హస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్‌ ఏర్పాటు చేయాలని, పురుషులకు, మహిళలకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. షామియానా, బారికేడింగ్‌, తాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా తయారు చేసిన గ్రామ సభల షెడ్యూల్‌ను ప్రెస్‌, మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేవిధంగా జిల్లా అధికారులందరు కృషి చేయాలన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 02:53 AM