మరో 8 వైద్య కళాశాలలు

ABN , First Publish Date - 2023-09-17T05:03:38+05:30 IST

జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

మరో 8  వైద్య కళాశాలలు

పాలనా అనుమతులు మంజూరు

హైదరాబాద్‌/సంగారెడ్డి టౌన్‌/పుల్‌కల్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ. 1447 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబ్‌లు, సెమినార్‌ హాళ్లు, అనుబంధ ఆస్పత్రి భవనాలు, హాస్టల్‌ భవనాల నిర్మాణం, ఇతర వసతులను కల్పించనున్నారు. గద్వాల, నర్సంపేట (వరంగల్‌), యాదాద్రిలో నిర్మించే కాలేజీలకు రూ.183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్‌ (మేడ్చల్‌ మల్కాజిగిరి)కు రూ.182 కోట్లు, నారాయణ్‌ పేట్‌, ములుగు, మెదక్‌లో నిర్మించే కాలేజీలకు రూ.180 కోట్ల చొప్పున, మహేశ్వరంలో నిర్మించే కాలేజీకి రూ.176 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి ఆరోగ్య, ఆర్‌ అండ్‌ బి శాఖల అధికారులు అధ్యయనం చేసి కాలేజీల నిర్మాణానికి రూ.1447 కోట్ల అంచనా ప్రతిపాదనలు సమర్పించగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎనిమిది వైద్య కళాశాలల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ ధన్యవాదాలు తెలిపారు. కాగా, తెలంగాణలో సీడబ్య్లూసీ పేరుతో కాంగ్రెస్‌.. విమోచన దినోత్సవాలంటూ బీజేపీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పఽథకాలు దేశానికే దిక్సూచీగా నిలిచాయనిన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, కంది, సంగారెడ్డి, పుల్‌కల్‌ మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో మాట్లాడుతూ.. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

Updated Date - 2023-09-17T05:03:38+05:30 IST