కొత్తగా 5 లక్షల మందికి
ABN , First Publish Date - 2023-06-26T02:35:25+05:30 IST
రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు! రైతుబంధు పథకం కింద వానాకాలానికి (ఖరీఫ్) సంబంధించి పెట్టుబడి సాయం సోమవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో పడనుంది. ఈ సీజన్‌లో కొత్తగా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందనుడటం
రైతుబంధు!
వీరిలో 1.5 లక్షల మంది పోడు రైతులు
నేటి నుంచి రైతులకు పెట్టుబడి సాయం
ఎప్పటిలాగే తక్కువ విస్తీర్ణం గల
రైతుల నుంచే మొదలు
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు! రైతుబంధు పథకం కింద వానాకాలానికి (ఖరీఫ్) సంబంధించి పెట్టుబడి సాయం సోమవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో పడనుంది. ఈ సీజన్‌లో కొత్తగా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందనుడటం గమనార్హం. వీరిని కలుపుకొని మొత్తంగా 1.54 కోట్ల ఎకరాలకు సంబంధించి 70 లక్షల మంది రైతులకు ఈ సీజన్‌లో రైతుబంధు కింద నగదు బదిలీ చేయనున్నారు. ఇందుకుగాను రూ. 7720.29 కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. కొత్త లబ్ధిదారుల్లో 1.50 లక్షల మంది పోడు రైతులు కూడా ఉన్నారు. వీరికి సంబంధించిన నాలుగు లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాయం అందజేసే క్రమంలో గతంలో మాదిరిగానే ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ రైతుల ఖాతాకు నగదు బదిలీ చేయనున్నారు. కాగా గడిచిన పది విడతల్లో రైతులకు రూ. 65,190 కోట్లు పంపిణీ అయ్యాయి. 11వ విడతలో పంపిణీచేసే రూ. 7,720 కోట్లతో కలిపితే రైతుబంధు పథకంలో ఈ సీజన్ వరకు రూ. 72,910 కోట్లు చెల్లించినట్లవుతుంది.
ఏకైక రాష్ట్రం తెలంగాణనే: నిరంజన్ రెడ్డి
దేశంలో ఏడాదికి రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులు, వ్యవసాయం పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆప్యాయతకు రైతుబంఽధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి పథకాలే నిదర్శనమని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయటం, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించటంతో సాగునీటి లభ్యత పెరిగిందని, తద్వారా సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి పెరిగిందని ఆయన చెప్పారు.