ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకానికి 45 రోజులు
ABN , First Publish Date - 2023-08-02T04:03:28+05:30 IST
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి 45 రోజుల గడువు ఇస్తున్నామని.. సెప్టెంబర్ 15న వారి నియామక ఉత్తర్వులను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సెప్టెంబరు 15న నియామక ఉత్తర్వులతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి 45 రోజుల గడువు ఇస్తున్నామని.. సెప్టెంబర్ 15న వారి నియామక ఉత్తర్వులను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేయట్లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ మంగళవారం మరోసారి చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని.. తము సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీనికి ధర్మాసనం.. ‘‘చివరిసారిగా ఎంత సమయం కావాలో మీరే చెప్పండి.. కేసు ఎప్పుడు లిస్ట్ చేయాలో చెప్పండి’’ అని ప్రశ్నించింది. ఆరువారాల సమయం ఇవ్వాలని.. సెప్టెంబర్ 15న కేసు లిస్ట్ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో సెప్టెంబర్ 15కు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం.. ఆరోజు నియామక ఉత్తర్వులతో రావాలని ఆదేశాలు జారీచేసింది.