WINE SHOPS : 40% కొత్త వారికి వైన్ షాపులు
ABN , First Publish Date - 2023-08-22T04:50:26+05:30 IST
రాష్ట్రంలోని మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రాలు తీశారు. కలెక్టర్లు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు.
5% ఏపీ వారికి దక్కిన మద్యం టెండర్లు
నేటి నుంచి మొదటి విడత ఫీజు వసూలు
నవంబరు 30 నుంచి మద్యం సరఫరా
డిసెంబరు నుంచి కొత్తషాపుల్లో సేల్స్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రాలు తీశారు. కలెక్టర్లు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను నిర్వహించారు. రాష్ట్రంలోని 2,620 వైన్ షాపులకు 1,31,490 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఎక్కువగా రాజకీయ నాయకులు, వారి తనయులు, బంధువులు, అనుచరులు దరఖాస్తులు వేశారు. దీంతో వారిదే పైచేయిగా నిలిచింది. విచిత్రమేమిటంటే ఈసారి 40ు కొత్త వారికి షాపులు దక్కాయి. సాధారణంగా 20ు కొత్త వారికి షాపులు దక్కుతుంటాయి. పాతవారు ఒక్కో షాపునకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వేయడం, ఎక్కువ షాపులకు దరఖాస్తు చేయడం జరుగుతుంటుంది. అందులో ఏదో ఒక దరఖాస్తుకు డ్రా తగులుతుంది. ఈసారి కొత్తవారు కూడా అదే సూత్రాన్ని పాటించారు. ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుండటంతో తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల షాపులకు ఏపీ వ్యాపారులు ఈసారి దరఖాస్తు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, హుజూర్‌నగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వీరి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 5ు మంది షాపులు దక్కించుకున్నట్టు తెలిసింది.
నేటి నుంచి లైసెన్సు ఫీజు స్వీకరణ..
లక్కీ డ్రాలో వైన్ షాపులు దక్కిన వారు మంగళవారం నుంచి లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఫీజు మొత్తంలో మొదటి వాయిదా సొమ్మును చెల్లించాలి. ఇప్పటికే జనాభా ఆధారంగా ఆరు శ్లాబుల లైసెన్సు ఫీజు(ఎక్సైజ్ ట్యాక్స్)ను ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 5వేల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లోని వైన్ షాపునకు రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లోని షాపులకు రూ.55 లక్షలు.. 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల షాపులకు రూ.60 లక్షలు.. లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల షాపులకు రూ.65 లక్షలు.. 5 నుంచి 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల షాపులకు రూ.85 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని షాపులకు రూ.1.10 కోట్ల చొప్పున లైసెన్సు ఫీజులగా నిర్ణయించారు. షాపులు దక్కించుకున్న వారు ఈ వార్షిక ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మొదటి వాయిదా సొమ్మును ఈ నెల 22 నుంచి చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించినవారికి ఎక్సైజ్ శాఖ ప్రొవిజనల్ లైసెన్సులను జారీ చేస్తుంది. నవంబరు 30 నుంచి షాపులకు మద్యం, బీరును సరఫరా చేస్తారు. డిసెంబరు 1 నుంచి కొత్త షాపులను తెరుచుకునే అవకాశం కల్పిస్తారు. నవంబరు 30తో పాత షాపుల గడువు ముగుస్తుంది. ఆ షాపులన్నింటినీ బంద్ చేయాల్సిందే.
ఏపీ సర్పంచ్‌కు హైదరాబాద్‌లో మద్యం షాపు..
అల్లవరం: ఏపీలోని కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు సర్పంచ్‌కు హైదరాబాద్‌లో వైన్ షాపు దక్కింది. సర్పంచ్ రాయుడు విష్ణుత్రిమూర్తులు తన భార్య పేరిట రెండు టెండర్లు వేశారు. లక్కీ డ్రాలో అమీర్‌పేటలోని ఓ షాపు దక్కించుకున్నారు.