Share News

వచ్చే ఏడాది 27 సాధారణ సెలవులు

ABN , First Publish Date - 2023-12-13T04:06:11+05:30 IST

వచ్చే సంవత్సరంలో వర్తించే సాధారణ సెలవులు, ఐచ్ఛిక(ఆప్షనల్‌) సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వచ్చే ఏడాది 27 సాధారణ సెలవులు

మరో 25 ఐచ్ఛిక సెలవులు.. సాధారణ జాబితాలో జనవరి 1

దానికి బదులుగా ఫిబ్రవరి 2న రెండో శనివారం పనిదినం

ఏప్రిల్‌ 1, మేడే సెలవుదినాలు.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు వాడుకోకూడదు

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వచ్చే సంవత్సరంలో వర్తించే సాధారణ సెలవులు, ఐచ్ఛిక(ఆప్షనల్‌) సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే 2024 సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఎప్పటిలాగానే నెలలో ప్రతి రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. అయితే.. జనవరి 1న (సోమవారం) నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందున దానికి బదులుగా ఫిబ్రవరి 2 (రెండో శనివారం) పనిదినంగా వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరంలో ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులను వినియోగించుకోరాదని తెలిపింది. చంద్రుడి దర్శనాన్ని అనుసరించి ఈద్‌-ఉల్‌ ఫితర్‌, ఈద్‌-ఉల్‌-అఝా, మొహర్రం, ఈద్‌-ఎ-మిలాద్‌ వంటివాటి తేదీలకు సంబంధించి.. అప్పటికప్పుడు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మార్పులు చేసుకో వచ్చని తెలిపింది. ‘నెగోషియేబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌-1881’ కింద యాన్యువల్‌ క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ డే సందర్భంగా ఏప్రిల్‌ 1, మేడేను పురస్కరించుకుని మే 1న సెలవులు ఉంటాయని వివరించింది.

Updated Date - 2023-12-13T04:06:12+05:30 IST