25కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:12 AM
గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టుచేసి వారినుంచి రూ.5లక్షల విలువైన 25కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో మరొకరు
సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఘటన
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ
సూర్యాపేట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టుచేసి వారినుంచి రూ.5లక్షల విలువైన 25కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు వివరించారు. సూర్యాపేటలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద అనుమానాస్పదంగా ఆపి ఉన్న రెండు కార్లను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది వాటిని తనిఖీ చేయగా, ఒక కారులో 24కిలోల గంజాయి, మరో కారులో కిలో గంజాయి ఉంది. గంజాయి రవాణా చేస్తున్న వారిని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామానికి చెందిన చారకొండ ప్రకాష్, మిర్యాలగూడలోని శాంతినగర్‌కు చెందిన తాళ్ల సుమంత్‌గా గుర్తించారు. ఐదేళ్ల నుంచి ప్రకాష్, సుమంత్ స్నేహితులు కాగా, నాగర్‌కర్నూల్‌కు చెందిన ప్రకాష్ స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. మిర్యాలగూడకు చెందిన సుమంత్‌కు గంజాయి పీల్చే అలవాటు ఉంది. గంజాయిని సాగు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సుమంత్ చెప్పటంతో ప్రకా్‌ష తన స్వగ్రామంలో గంజాయి సాగు చేశాడు. నెల రోజుల క్రితం పంటను కోసినట్లు సుమంత్‌కు సమాచారం ఇవ్వటంతో ఈ నెల 27వ తేదీన వటవర్లపల్లికి వెళ్లి గంజాయిని తన అత్తగారి ఊరైన సూర్యాపేటకు తీసుకువచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన మిత్రుడు భార్గవ్‌రామ్‌కు ఫోన్‌చేసి గంజాయి కావాలంటే సూర్యాపేటకు రావాలని చెప్పాడు. గురువారం ఉదయం భార్గవ్‌రామ్ కారులో సూర్యాపేటలోని ఎన్టీఆర్ పార్కు వద్దకు చేరుకుని సుమంత్, ప్రకాష్‌ల నుంచి కిలో గంజాయిని కొనుగోలు చేసి కారులో దాచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారి వాహనాలు తనిఖీలు చేసి ప్రకాష్, సుమంత్‌ను అరెస్టు చేసి 24కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన భార్గవ్‌రామ్ తన కారును అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ కారుతో పాటు కారులో ఉన్న కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్న సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్‌లు సైదులు, రవీందర్‌ను అదనపు ఎస్పీ అభినందించారు.