66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్లు!
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:20 AM
మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో మాజీ సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా చేశారని..
మళ్లీ గెలుస్తాననుకొని కొన్న కేసీఆర్
వాటిని విజయవాడలో దాచిపెట్టారు
సీఎం అయిన 10 రోజుల దాకా నాకు
ఆ వాహనాలు ఉన్న విషయమే తెలీదు
ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నిరుడు ఏప్రిల్-మే నెలల్లో దశలవారీగా
విజయవాడకు పంపిన బీఆర్‌ఎస్ సర్కార్
బుల్లెట్‌ప్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు
సంతరించుకుని డెలివరీకి సిద్ధమైన కార్లు
హైదరాబాద్, విజయవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో మాజీ సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా చేశారని.. అధికారంలోకి రాగానే కాన్వాయ్‌ని మార్చడానికి రూ.66 కోట్ల ఖర్చుతో 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వాహనాల గురించి చెప్పారు. ‘‘కాన్వాయ్ కోసం కొత్త వాహనాలు కొనొద్దని, ఖర్చు పెట్టొద్దని చెప్పిన. కానీ అంతకుముందే 22 ల్యాండ్ క్రూయిజర్లు కొత్తవి కొనుగోలుచేసి దాచిపెట్టిండ్లు. నేను సీఎం అయినంక పది రోజుల వరకూ నాకే దెల్వదు. పాత బండ్లు అడ్జెస్ట్ చేయండని నేను చెబుతుంటే.. చిన్నగ ఓ అధికారి వచ్చి.. ‘పోయిన సారే 22 ల్యాండ్ క్రూయిజర్లు కొన్నాడు. అన్నీ విజయవాడలో దాచిపెట్టినం. కొత్తప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయగానే అన్నీ తెద్దామనుకున్నాం సార్. ఆయన నెత్తిమీద దరిద్రం ఉండి ఇంటికిపోయిండు.’ అని చెవిలో చెప్పిండు. అన్ని వందల వేల వాహనాలు ఉన్నపుడు అవి కొనే అవసరం ఎందుకు వచ్చింది? ఒక్కో వాహనానికి రూ.3 కోట్ల చొప్పున అవుతుంది. మరి బుల్లెట్‌ప్రూఫ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా అవుతుంది. మూడోసారి కూడా వస్తాననుకొని ఆయనకు, ఆయన వందిమాగధులకు చెప్పాపెట్టకుండా కొని దాచిపెట్టిండయ్యా కేసీఆర్. ఇలాంటివే ఆయన సృష్టించిన సంపద!’’ అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా తన కాన్వాయ్ కోసం ముచ్చటపడి కొనుగోలు చేసిన ఈ వాహనాల్లో 20 కార్లు.. బులెట్‌ప్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకుని డెలివరీకి సిద్ధమయ్యాయి. ఈ వాహనాలను భద్రతాపరంగా దుర్భేద్యంగా తీర్చిదిద్దడం కోసం అప్పటి కేసీఆర్ సర్కారు.. గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో దశలవారీగా ప్రత్యేక కార్గో విమానం ద్వారా విజయవాడ సమీపంలోని వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్ పార్క్‌కు పంపించింది. ఆ ఇండస్ర్టియల్ పార్క్‌లోని త్రిహాయని ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో ‘మిత్రా - క్యూకుటో’ పేరుతో ఉండేది. జపాన్ భాగస్వామ్యంతో పనిచేసేది) సంస్థ.. వాటిని తీర్చిదిద్దే బాధ్యతలను చేపట్టింది. భారత సైన్యం ఉపయోగించే అనేక వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ పనులు చేసిన సంస్థ అది. అందుకే కేసీఆర్ కొత్తగా కొన్న ల్యాండ్ క్రూయిజర్లను ఆ సంస్థకు పంపారు. బుల్లెట్‌ప్రూఫ్ పనులతోపాటు.. ఉపగ్రహ ఆధారిత సాంకేతిక వ్యవస్థను వాటిలో ఏర్పాటు చేశారు. కారు చుట్టు పక్కల పరిసరాలలో ఏమి జరుగుతుందో కూడా లోపల అమర్చిన స్ర్కీన్లపై చూసి తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ వాహన శ్రేణి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే సిద్ధం కావాల్సి ఉంది. కానీ.. జాయింట్ వెంచర్ అయిన ఈ సంస్థ నుంచి జపాన్ వైదొలగడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఫలితంగా ఎన్నికల నాటికి పనులు పూర్తి కాలేదు. మళ్లీ సంస్థ పరిస్థితి గాడినపడ్డాక పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ సొమ్ముతో కొన్న వాహనాలు కాబట్టి.. డెలివరీకి సిద్ధమైన ఈ వాహనాలను రేవంత్ సర్కారు తీసుకోవాల్సి ఉంది. అయితే.. భద్రతా కట్టుదిట్టాలకు దూరంగా,ప్రజలకు దగ్గరగా ఉండాలనుకునే రేవంత్ రెడ్డి ఈ కాన్వాయ్‌ను ఉపయోగిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.