60 శాతమున్న బీసీలకు 20 శాతమా?
ABN , First Publish Date - 2023-08-22T04:17:36+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్‌ఎస్‌పై బీసీ సంఘాల ఆగ్రహం
కేసీఆర్‌ను ఇక బీసీలు నమ్మరు..
త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం: జాజుల
27న ఓరుగల్లులో ‘బీసీ గర్జన’: దాసు సురేశ్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించలేదని, అగ్రకులాలకే అధిక సీట్లు కేటాయించారని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం న్యాయమంటూ ఆ పార్టీని నిలదీస్తున్నాయి. ‘‘జనాభాలో 10 శాతమున్న అగ్రకులాలకు 50 శాతం, 60 శాతమున్న బీసీలకు 20 శాతమే బీఆర్‌ఎస్ సీట్లు కేటాయించింది. 115 మందితో ఉన్న జంబో జాబితాలో ఓసీలే 58 మంది ఉన్నారు. జనాభాలో 5-6 శాతం మేర ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఇందులో 40 సీట్లు లభించాయి. ఇక 4 శాతమున్న కమ్మ సామాజిక వర్గానికి 5, అతి తక్కువ శాతమున్న వెలమలకు 11 స్థానాల్లో టికెట్లు కేటాయించారు. అయితే గతంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 39 మంది ఉండగా, ఈసారి పాలేరు నుంచి కందాళ ఉపేందర్ రెడ్డికి అవకాశమివ్వడంతో ఆ సంఖ్య 40కి పెరిగింది. బీసీల్లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి 11, గౌడ 4, యాదవ 5, పద్మశాలి 1, బెస్త 1, వంజరి 1.. మొత్తం 23 సీట్లే కేటాయించారు. ముస్లింలకు 2 సీట్లు, మహిళలకు 7 సీట్లు లభించాయి. బ్రాహ్మణ 1, వైశ్య 1, ఎస్సీ సామాజిక వర్గం నుంచి 20 మందికి, ఎస్టీల్లో 12 మందికి సీట్లు కేటాయించారు..’’ అని బీసీ సంఘాలు తెలిపాయి.
బీసీల చెవిలో ‘గులాబీ’ పువ్వు: దాసు సురేశ్
బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ‘‘బీఆర్‌ఎస్ బీసీల చెవిలో ‘గులాబీ’ పువ్వు పెట్టింది. బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించకుండా అవమానపరిచింది. బీసీ ప్రాతినిధ్య స్థానాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతాం. బీసీలను పరిగణనలోకి తీసుకోకపోవడం భవిష్యత్‌లో వారికే ప్రమాదం. వచ్చే ఎన్నికల్లో పోటీనే లక్ష్యంగా ఈ నెల 27న ఓరుగల్లులో ‘బీసీ రాజ్యాఽధికార గర్జన’ నిర్వహిస్తాం’’ అని ప్రకటించారు.
బీఆర్‌ఎస్ బీసీల ద్రోహి..: జాజుల
టికెట్ల కేటాయింపులో బీసీలకు బీఆర్‌ఎస్ అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం, జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ‘‘బీఆర్‌ఎస్ బీసీల ద్రోహిగా మారింది. అరశాతం ఉన్న వెలమలకు 11 స్థానాలు, 5-6 శాతమున్న రెడ్లకు 40 స్థానాలు కేటాయించడం ఎంతవరకు సమంజసం. కేసీఆర్‌ను బీసీలు ఎప్పటికీ నమ్మరు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు బీసీలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ రెడ్ల, వెలమల సమితిగా మారింది. రాష్ట్ర సాధన కోసం జీవితాలను పణంగా పెట్టిన వారిని కూడా పక్కనబెట్టారు. త్వరలోనే టికెట్లు దక్కని బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ పార్టీకి బుద్ధి చెప్పేలా కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని వెల్లడించారు.