111 జీవో ఏరియాలో భూమార్పులు
ABN , First Publish Date - 2023-09-05T04:13:37+05:30 IST
111జీవో ఏరియా పరిధిలో బయో కన్జర్వేషన్ జోన్ క్రమంగా తొలగిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, మల్టీపర్పస్ జోన్... ఇలా భూయజమాని తనకు నచ్చిన జోన్‌లోకి మార్పుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా 111జీవో ఏరియా పరిధిలోని
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): 111జీవో ఏరియా పరిధిలో బయో కన్జర్వేషన్ జోన్ క్రమంగా తొలగిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, మల్టీపర్పస్ జోన్... ఇలా భూయజమాని తనకు నచ్చిన జోన్‌లోకి మార్పుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా 111జీవో ఏరియా పరిధిలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లి గ్రామంలోని కొన్ని భూములను జోన్ మార్పు చేయడానికి ఈపీటీఆర్‌ఐ నివేదికను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. గ్రామంలో పెద్దఎత్తున భూములున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు తమ భూముల జోన్ మార్పు చేయడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో సంబంధిత వ్యక్తులకు చెందిన భూములను మార్పు చేయాలంటూ హెచ్‌ఎండీఏకు ఆదేశాలిచ్చింది. వట్టినాగులపల్లిలో 25ఏళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలను ఈపీటీఆర్‌ఐ నివేదిక ఆధారంగా సడలింపు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గండిపేట (ఉస్మాన్‌సాగర్)కు క్యాచ్‌మెంట్ ఏరియాగా వట్టి నాగులపల్లిని గుర్తించారు. ఈ గ్రామంలో ఎలాంటి లేఅవుట్లకుగానీ, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతి లేదు. ఈ గ్రామం నుంచే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇంకోవైపు ఐటీ కారిడార్‌లోని ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్‌కు ఆనుకొని ఉండడంతో ఆ గ్రామంలోని భూములన్నీ పెద్దల చేతుల్లోకి ఎప్పుడో చేరాయి. అయితే గ్రామం మొత్తం బయో కన్జర్వేషన్ జోన్ కొనసాగుతున్నా గ్రామ పరిధిలో అనధికారికంగా బహుళ అంతస్తుల భవనాలు పెద్దఎత్తున వెలుస్తున్నాయి. ఆ వైపు అధికారులు కన్నెత్తి చూసేది లేదు. తాజాగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి, లేఅవుట్లను ఏర్పాటు చేసుకోవడానికి పలు సర్వే నంబర్లలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్‌కు అనుకొని ఉన్న పలు సర్వే నంబర్లను చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలను ఆరంభించింది. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 173లో 16.24ఎకరాల వరకు ఉండగా, అందులో కొంత భూమిని బయో కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టీపర్పస్ యూజ్ జోన్‌లోకి మార్పు చేయడానికి ఇటీవల హెచ్‌ఎండీఏ పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ నీటి పరివాహకంపై ఇప్పటికే ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ) నివేదికను ఇచ్చిందని, ఈ ల్యాండ్ పార్సిల్ డ్రైనేజీ ప్రవాహం మొత్తం ఉస్మాన్‌సాగర్ దిగువన గల మూసీనదిలోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇదే తరహాలో వట్టి నాగులపల్లిలో గల పలు సర్వే నంబర్లలో ఉన్న సుమారు 150ఎకరాలను 111జీవో నిర్ణయించిన బయో కన్జర్వేషన్ జోన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూములన్నీ పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లకు చెందినవే. ఈ భూములను మార్పు చేయడం వెనుక పలుకుబడి ఉన్న రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈపీటీఆర్‌ఐ రిపోర్టు ఆధారంగా బయోకన్జర్వేషన్ జోన్‌ను తొలగించాలంటూ నేరుగా హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. కాగా ఈపీటీఆర్‌ఐ రిపోర్టు ఆధారంగానే వట్టి నాగులపల్లిలోని భూములను బయో కన్జర్వేషన్ జోన్ నుంచి ఇతర జోన్లలోకి మార్పు చేస్తున్నట్లుగా నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొనగా.. ఈ రిపోర్టు ఏ మేరకు ప్రామాణికమనేది అధికారులు స్పష్టతనివ్వడం లేదు. ఈ రిపోర్టును బహిర్గతం చేయడం లేదు. 111జీవో ఏరియాలోని వివిధ ప్రాంతాల్లో బయోకన్జర్వేషన్ జోన్‌ను తొలగింపుపై గడిచిన ఐదేళ్లకాలంలో ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని, గతంలో ఏమైనా ఇచ్చిందేమో ఆరా తీస్తామంటూ ఈపీటీఆర్‌ఐకి చెందిన ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి తెలిపారు.