లక్ష్మీ బ్యారేజీకి 1.09 లక్షల క్యూసెక్కుల వరద

ABN , First Publish Date - 2023-07-18T04:51:35+05:30 IST

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజీ నిండు కుండను తలపిస్తోంది.

లక్ష్మీ బ్యారేజీకి 1.09 లక్షల క్యూసెక్కుల వరద

శ్రీరాంసాగర్‌కు 19,680 క్యూసెక్కులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజీ నిండు కుండను తలపిస్తోంది. సోమవారం ప్రాణహిత నది ద్వారా బ్యారేజీలోకి 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా 35 గేట్లను ఎత్తివేసి 87,690 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.60 టీఎంసీలకు చేరింది. సోమవారం పెద్దపల్లి జిల్లా సరస్వతీ పంప్‌హౌస్‌ నుంచి 3 మోటార్ల ద్వారా 8,793 క్యూసెక్కుల నీటిని పార్వతీ బ్యారేజీలోకి, పార్వతీ పంప్‌హౌస్‌ నుంచి 7,830 క్యూసెక్కుల నీటిని శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నందిమేడారంలో గల నంది పంప్‌హౌ్‌సకు 9,450 క్యూసెక్కుల నీళ్లు వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని కరీంనగర్‌ జిల్లా లక్ష్మిపూర్‌లో గల గాయత్రి పంప్‌హౌ్‌సకు తరలిస్తున్నారు. కాగా, నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 19,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. దీంతో నీటిమట్టం 1070.60 అడుగులకు చేరుకుంది. ఇక, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 517 అడుగులతో నిలకడగా ఉంది.

Updated Date - 2023-07-18T04:51:35+05:30 IST