‘డైనమిక్’ స్పీడ్‌తో 108 సేవలు
ABN , First Publish Date - 2023-08-02T03:06:33+05:30 IST
ఆపదలో ఉన్న వారి ప్రాణాలను నిలబెడుతున్న 108 అంబులెన్స్‌లు ఇక నుంచి మరింత వేగంగా బాధితుల వద్దకు చేరుకోనున్నాయి.
సరికొత్త విధానంలో అంబులెన్స్‌ల నిర్వహణ
ప్రమాదాలు ఎక్కువ జరిగే చోటే మోహరింపు
సత్వరమే బాధితుల వద్దకు చేరేలా ప్రణాళిక
కొత్తగా కొన్న వాహనాల్లో జీపీఎస్
ఫోన్ చేసిన వారు 108ను ట్రేస్ చేసేలా ఫీచర్
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న వారి ప్రాణాలను నిలబెడుతున్న 108 అంబులెన్స్‌లు ఇక నుంచి మరింత వేగంగా బాధితుల వద్దకు చేరుకోనున్నాయి. ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సరికొత్త విధానాలతో ఈ వాహనాలు వీలైనంత త్వరగా బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లే వెసులుబాటు కలగనుంది. ప్రమాదాలు జరిగినపుడు సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని నివారించాలని భావించిన వైద్య ఆరోగ్య శాఖ ఇక నుంచి 108 అంబులెన్స్‌లను డైనమిక్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని బుధవారం నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. దీని వల్ల బాధితులకు తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. ముఖ్యంగా ఈ విధానం వల్ల సమయం బాగా ఆదా అవుతుందని, సకాలంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లగలుగుతామని వైద్య శాఖ అంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 465 అంబులెన్స్‌లు(108) ఉన్నాయి. వాటిలో 60 అంబులెన్స్‌లను డైనమిక్ విధానం కోసం వినియోగించాలని నిర్ణయించారు.
ఏమిటీ డైనమిక్ విధానం..?
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున ప్రతీ నియోజకవర్గంలో రెండేసి 108 అంబులెన్స్‌లున్నాయి. ఇప్పటి దాకా లక్ష మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ప్రస్తుతం అంబులెన్స్‌ల సంఖ్యను పెంచడంతో ప్రతీ 75 వేల మందికి ఒకటి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ అంబులెన్స్‌కు కాల్ చేస్తే సగటున 30 నిమిషాలకు వాహనం వచ్చేది. ప్రస్తుతం దాన్ని 15 నిమిషాలకు తగ్గించగలిగారు. అయినా కొన్ని చోట్ల 108 అంబులెన్స్ వచ్చే లోగానే బాధితులు చనిపోతున్నారు. కొన్నిసార్లు ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే విలువైన సమయం వృథా అయిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ డైనమిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించింది. అందుకోసం 3 నెలలుగా రోడ్డు రవాణా శాఖ, పోలీసుల నుంచి ప్రమాదాల గణాంకాలను సేకరించింది. డైనమిక్ విధానంలో ఆ బ్లాక్ స్పాట్ల సమీపంలో 108 అంబులెన్స్‌లను ఉంచాలని నిర్ణయించింది. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
108 ఎక్కడుందో తెలిసిపోతుంది..
కొత్తగా కొనుగోలు చేసిన 108వాహనాల్లో జీపీఎ్‌సను అమర్చారు. 108కు కాల్ రాగానే ఘటన జరిగిన ప్రదేశానికి రూట్ మ్యాప్ చూపెడుతుంది. దాంతో త్వరగా అక్కడికి వెళ్లేందుకు ఆస్కారం లభిస్తుంది. అలాగే వారం పది రోజుల్లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాన్నునట్లు జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ చెబుతోంది. ఇప్పటి దాకా బాధితులు కాల్ చేయడం వరకే పరిమితం అయ్యేవారు. కానీ, ఈ ఫీచర్‌తో.. కాల్‌చేసిన తర్వాత కొన్ని సెకన్లలోనే వారి సెల్‌ఫోన్‌కు 108 అంబులెన్స్ లొకేషన్ వస్తుంది. ఆ లోకేషన్‌ను ట్రేస్ చేయడం ద్వారా అది ఎక్కడ ఉందో..? ఎక్కడి దాకా వచ్చిందో..? ఇంకా ఎంత సమయం పడుతుందో..? తేలిగ్గా తెలిసిపోతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు నెలకు రూ.1.60 లక్షలు ఇస్తోంది. ఒక్కో అంబులెన్స్ రోజుకు సగటున 150-250 కి.మీ. తిరుగుతోంది. గ్రామీణప్రాంతాల్లో అంబులెన్స్‌లు ఎక్కువ దూరం తిరుగుతుండగా, పట్టణ ప్రాంతాల్లో(గ్రేటర్ హైదరాబాద్) తక్కువ దూరం తిరుగుతున్నాయి. నగర ప్రాంతాల్లో సమీపంలోనే ఆస్పత్రులుండటం వల్ల తక్కువ దూరం వెళుతున్నాయి. అలాగే 108 వాహనం 5 లక్షల కి.మీ. తిరిగితే దాని స్థానంలో కొత్తది తీసుకురావాలని నిర్వహణ సంస్థకు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 108 వాహనాల ద్వారా రోజుకు సగటున 1,500 మందికి అత్యవసర వైద్య సేవలందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.