IPL RR vs KKR : ‘జై’స్వాల్‌ విధ్వంసం

ABN , First Publish Date - 2023-05-12T04:05:40+05:30 IST

6,6,4,4,2,4.. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్‌) సాగించిన విధ్వంసమిది. 150 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన

IPL RR vs KKR : ‘జై’స్వాల్‌ విధ్వంసం

13 బంతుల్లోనే అర్ధ సెంచరీతో రికార్డు

చాహల్‌కు 4 వికెట్లు

కోల్‌కతాపై రాజస్థాన్‌ ఘనవిజయం

కోల్‌కతా: 6,6,4,4,2,4.. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్‌) సాగించిన విధ్వంసమిది. 150 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఆ ఆరు బంతుల్లోనే ఫలితమేమిటో చెప్పేసింది. అంతేకాకుండా.. మూడు ఓవర్లలోపే జైస్వాల్‌ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అదీ కేవలం 13 బంతుల్లో.. దీంతో ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డు కూడా అతని ఖాతాలోనే చేరింది. ఫలితంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 9 వికెట్లతో రాజస్థాన్‌ రాయ ల్స్‌ చిత్తుగా ఓడించింది. అటు హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత గెలిచిన రాజస్థాన్‌ అద్భుత రన్‌రేట్‌తో ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌లో ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (57) మాత్రమే రాణించాడు. చాహల్‌కు 4, బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్‌ 13.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 151 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 నాటౌట్‌) చెలరేగాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా యశస్వీ జైస్వాల్‌ నిలిచాడు.

బాదుడుతో షురూ: ఓ మాదిరి ఛేదనే అయినా రాజస్థాన్‌ మాత్రం కోల్‌కతాకు దిమ్మ తిరిగేలా ఆరంభించింది. యువ ఓపెనర్‌ జైస్వాల్‌ తొలి ఓవర్‌లోనే వీరంగం ప్రదర్శిస్తూ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ నరైన్‌ను కాదని బంతి చేతబట్టిన నితీశ్‌ రాణా ఈ బాదుడుకు బలయ్యాడు. రెండో ఓవర్‌లో మరో ఓపెనర్‌ బట్లర్‌ (0) రనౌటైనా చివరి రెండు బంతులను యశస్వీ సిక్సర్లుగా మలిచాడు. ఇక శార్దూల్‌ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో విజృంభించడంతో జైస్వాల్‌ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి జట్టు ఆడింది మూడు ఓవర్లే. అటు శాంసన్‌ కూడా జత కలవడంతో పవర్‌ప్లేలో రాయల్స్‌ 78 రన్స్‌ సాధించింది. అప్పటికే మ్యాచ్‌ ఫలితంపై అందరికీ అంచనా ఏర్పడింది. ఆ తర్వాత స్పిన్నర్లు నరైన్‌, సుయాశ్‌ కట్టుదిట్టం చేసినప్పటికీ చేయాల్సిన రన్‌రేట్‌ ఐదు లోపే ఉండడంతో రాజస్థాన్‌కు ఇబ్బందేమీ లేకపోయింది. 11వ ఓవర్‌లో శాంసన్‌ 3 సిక్సర్లు బాది 20 రన్స్‌ చేయడంతో జట్టు విజయానికి మరో 23 పరుగులే అవసరమయ్యాయి. అప్పటికి జైస్వాల్‌ సెంచరీకి 17 రన్స్‌ దూరంలోనే ఉన్నాడు. కానీ శాంసన్‌ వేగంగా ఆడడంతో అతను సెంచరీ మిస్స య్యాడు. అయితే 94 స్కోరు దగ్గర శతకం చేసే అవకాశం వచ్చినప్పటికీ జైస్వాల్‌ ఆ బంతిని సిక్సర్‌ కాకుండా ఫోర్‌గా మలచి మ్యాచ్‌ను ముగించాడు.

చాహల్‌ మాయ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను రాజస్థాన్‌ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. వెంకటేశ్‌ అయ్యర్‌ మాత్రం కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా.. మరో ఎండ్‌లో స్పిన్నర్‌ చాహల్‌ వరుస వికెట్లతో దెబ్బతీశాడు. ఆరంభంలో పేసర్‌ బౌల్ట్‌ తన స్థాయికి తగ్గట్టుగా చెలరేగడంతో కేకేఆర్‌ తొలి ఐదు ఓవర్లలో ఓపెనర్లు రాయ్‌ (10), గుర్బాజ్‌ (18) వికెట్లను కోల్పోయింది. ఈ సీజన్‌లో రాణా సేన 10 మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలోనే కనీసం రెండు వికెట్లు కోల్పోవడం గమనార్హం. అటు వెంకటేశ్‌ ఆరంభంలో పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డాడు. ఓ దశలో 12 బంతుల్లో అతడు రెండు పరుగులే చేయగలిగాడు. చివరికి పదో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదగా అటు కెప్టెన్‌ నితీశ్‌ రాణా (22) ఫోర్‌తో 18 పరుగులు సమకూరాయి. కానీ తర్వాతి ఓవర్‌లోనే రాణా వికెట్‌ను చాహల్‌ తీశాడు. ఇక నెమ్మదిగా ట్రాక్‌లోకి వచ్చిన అయ్యర్‌ 6,4,4తో 15 రన్స్‌ రాబట్టడంతో జట్టు స్కోరు 13 ఓవర్లలో వందకి చేరింది. రస్సెల్‌ (10) త్వరగానే నిష్క్రమించగా.. అర్ధసెంచరీ పూర్తి చేసిన అయ్యర్‌ను, శార్దూల్‌ (1)లను చాహల్‌ ఒకే ఓవర్‌లో దెబ్బతీశాడు. చివరి రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసిన కేకేఆర్‌.. రింకూ (16), నరైన్‌ (6) వికెట్లను సైతం కోల్పోయింది.


ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు (187) తీసిన బౌలర్‌గా చాహల్‌ రికార్డు పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు (25) కోల్పోయిన జట్టుగా ఢిల్లీతో సమానంగా నిలిచిన కోల్‌కతా

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రాయ్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) బౌల్ట్‌ 10, గుర్బాజ్‌ (సి) సందీప్‌ (బి) బౌల్ట్‌ 18, వెంకటేశ్‌ (సి) బౌల్ట్‌ (బి) చాహల్‌ 57, నితీశ్‌ రాణా (సి) హెట్‌మయెర్‌ (బి) చాహల్‌ 22, రస్సెల్‌ (సి) అశ్విన్‌ (బి) ఆసిఫ్‌ 10, రింకూ (సి) రూట్‌ (బి) చాహల్‌ 16, శార్దూల్‌ (ఎల్బీ) చాహల్‌ 1, అనుకూల్‌ (నాటౌట్‌) 6, నరైన్‌ (సి) రూట్‌ (బి) సందీప్‌ 6, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 149/8; వికెట్ల పతనం: 1–14, 2–29, 3–77, 4–107, 5–127, 6–129, 7–140, 8–149; బౌలింగ్‌: బౌల్ట్‌ 3–0–15–2, సందీప్‌ 4–0–34–1, అశ్విన్‌ 4–0–32–0, రూట్‌ 2–0–14–0, చాహల్‌ 4–0–25–4, ఆసిఫ్‌ 3–0–27–1.

రాజస్థాన్‌ రాయల్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 98, బట్లర్‌ (రనౌట్‌) 0, శాంసన్‌ (నాటౌట్‌) 48, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 13.1 ఓవర్లలో 151/1; వికెట్‌ పతనం: 1–30; బౌలింగ్‌: నితీశ్‌ 1–0–26–0, హర్షిత్‌ 2–0–22–0, శార్దూల్‌ 1.1–0–18–0, వరుణ్‌ 3–0–28–0, నరైన్‌ 2–0–13–0, సుయాశ్‌ 3–0–22–0, అనుకూల్‌ 1–0–20–0.

నేడు హుస్సామ్‌ సెమీస్‌ బౌట్‌

యశస్వీ జైస్వాల్‌ (47 బంతుల్లో 98 నాటౌట్‌)

150+ స్కోరును అత్యంత వేగంగా (41 బంతులుండగానే) ఛేదించిన రెండో జట్టుగా రాజస్థాన్‌. డెక్కన్‌ చార్జర్స్‌ (2008లో 48 బంతులుండగా) టాప్‌లో ఉంది.

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ (13 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తి చేసిన జైస్వాల్‌. రాహుల్‌, కమిన్స్‌ (14)ల రికార్డు బద్దలైంది.

Updated Date - 2023-05-12T04:05:40+05:30 IST