WTC Final : ఈసారైనా దక్కేనా?

ABN , First Publish Date - 2023-06-07T06:23:49+05:30 IST

ఐపీఎల్‌లో ధనాధన్‌ క్రికెట్‌తో మైమరిచిన అభిమానుల ముందుకు మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌.. సుదీర్ఘ ఫార్మాట్‌లో సమున్నతంగా నిలిచే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం సర్వం సిద్ధమైంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లోనే

 WTC Final : ఈసారైనా దక్కేనా?

  • మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

  • ఆసీ్‌సతో ఆఖరి సమరానికి భారత్‌ సై

  • డబ్ల్యూటీసీ ఫైనల్‌ నేటినుంచే

ఐపీఎల్‌లో ధనాధన్‌ క్రికెట్‌తో మైమరిచిన అభిమానుల ముందుకు మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌.. సుదీర్ఘ ఫార్మాట్‌లో సమున్నతంగా నిలిచే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం సర్వం సిద్ధమైంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లోనే కాదు.. దశాబ్దకాలంగా టెస్టుల్లో ఆధిపత్యానికి సై అంటే సై అంటూ పోటీ పడుతున్న భారత్‌–ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచే ఆఖరి సమరం.వరుసగా రెండోసారి టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. మరోవైపు కంగారూలు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టారు. ఎవరు గెలిచినా తొలిసారిగా ఈ టెస్టు గదను దక్కించుకున్నట్టవుతుంది. ఇక ఈ సమవుజ్జీల సమరం కోసం క్రికెట్‌ ప్రేమికులు కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లండన్‌: ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ ద్వారా చివరిసారిగా ఐసీసీ టోర్నీ సాధించింది. అప్పటి నుంచి దశాబ్దకాలంగా టీమిండియాకు ఫార్మాట్‌ ఏదైనా మరో మెగా టోర్నీ ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు రోహిత్‌ సేన ముందు మరో సువర్ణావకాశం. నేటి మధ్యాహ్నం నుంచి ఇక్కడి ఓవల్‌ మైదానంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరంభం కాబోతోంది. స్టార్లతో కూడిన ఆస్ట్రేలియా ఈసారి ప్రత్యర్థి. కఠిన సవాల్‌ ఎదురుగా ఉన్నా ఎట్టి పరిస్థితిల్లోనూ ఈసారి టెస్టు గదను చేజారనీయొద్దనే కసితో భారత జట్టు ఉంది. అటు తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేకపోయిన ఆస్ట్రేలియా పట్టు వదలకుండా ఈసారి స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించి అనుకున్నది సాధించింది. మరోవైపు ఐపీఎల్‌ ముందు ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2–1తో గెలిచిన విషయం తెలిసిందే. అదే జోష్‌తో ఈ కీలక పోరులోనూ ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకుంటోంది. కానీ ఇంగ్లండ్‌లోని పరిస్థితులు తమకే లాభిస్తాయనే అంచనాతో కమిన్స్‌ సేన ఉత్సాహంతో ఉంది. అందుకే టీమిండియాను దెబ్బతీసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది.

ప్రతీకారం కోసం..

భారత్‌లో జరిగిన బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో సిరీస్‌ ఓటమికి ఆసీస్‌ బదులు తీర్చుకోవాలనుకుంటోంది. అదే జరిగితే వారి ఖాతాలో డబ్ల్యూటీసీ ట్రోఫీ కూడా వచ్చి చేరుతుంది. అందుకే అత్యుత్తమ జట్టుతో టీమిండియాకు ముకుతాడు వేయాలనుకుంటోంది. ఓవల్‌లో స్టీవ్‌ స్మిత్‌కు అద్భుత రికార్డు ఉండడం వారికి కలిసివచ్చే అంశం. ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనే తను 97.75 సగటుతో 391 పరుగులు సాధించడం భారత బౌలర్లకు ఆందోళన కలిగించే విషయం. వార్నర్‌ ఫామ్‌లో లేకపోయినా ఖవాజా, లబుషేన్‌లను టెస్టుల్లో కట్టడి చేయడం సులువు కాదు. మిడిలార్డర్‌లో హెడ్‌, గ్రీన్‌ దూకుడుగా ఆడుతుంటారు. బౌలింగ్‌లో పేసర్‌ హాజిల్‌వుడ్‌ లేకపోవడంతో బోలాండ్‌ను ఆడించనున్నారు. ఏకైక స్పిన్నర్‌గా లియోన్‌కు చాన్సుంది.

అశ్విన్‌ వర్సెస్‌ జడేజా

తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగి దెబ్బతింది. కానీ ఈసారి పక్కా వ్యూహంతో పిచ్‌ స్పందనను బట్టి స్పిన్నర్లపై నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. జడేజా, అశ్విన్‌లలో ఒకరినే ఆడించి నలుగురు పేసర్లతో ముందుకెళ్లాలా? లేక ఇద్దరు స్పిన్నర్లతో దిగాలా? అనే సందిగ్ధంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. 2021–23 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌ తరఫున అశ్విన్‌ 61 వికెట్లతో టాప్‌లో ఉండగా.. బుమ్రా (45), జడేజా (43) ఆ తర్వాత ఉన్నారు. క్రితంసారి ఇక్కడ ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్‌లో అశ్విన్‌ పూర్తిగా బెంచీకే పరిమితమయ్యాడు. ఇప్పుడు కూడా మెరుగైన ఆల్‌రౌండర్‌ కారణంగా జడ్డూనే ఆడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నా.. బుధవారం ఉదయం పిచ్‌ను చూశాకే స్పిన్నర్ల ఎంపిక ఉంటుందని కెప్టెన్‌ రోహిత్‌ స్పష్టం చేశాడు. ఇక కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌లలో ఎవరికి కీపింగ్‌ బాధ్యతలు ఇవ్వనున్నారనేది కూడా ఆసక్తి రేపుతోంది. పంత్‌ లేకపోవడంతో మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్‌ కావాలనుకుంటే ఇషాన్‌ వైపు మొగ్గుచూపొచ్చు. ఇద్దరు స్పిన్నర్లతో దిగితే స్పెషలిస్ట్‌ కీపర్‌ భరత్‌ను ఆడించాలని రవిశాస్త్రి తదితరులు అంటున్నారు. ఇక బౌలింగ్‌లో నలుగురు పేసర్లు బరిలోకి దిగితే షమి, సిరాజ్‌లకు తోడు శార్దూల్‌, ఉమేశ్‌ ఆడవచ్చు. మరోవైపు గిల్‌, రోహిత్‌, పుజార, కోహ్లీ, రహానెలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ అత్యంత పటిష్ఠంగా కనిపిస్తుండడం సానుకూలాంశం కానుంది. అయితే వీరంతా ఐపీఎల్‌ స్టయిల్‌ నుంచి వీలైనంత త్వరగా బయటికి రావాల్సి ఉంటుంది.

ఏ టీమ్‌ గెలిచినా అన్ని ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌, రోహిత్‌ (కెప్టెన్‌), పుజార, కోహ్లీ, రహానె, జడేజా, భరత్‌/ఇషాన్‌, అశ్విన్‌/శార్దూల్‌, ఉమేశ్‌, షమి, సిరాజ్‌.

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఖవాజా, లబుషేన్‌, స్మిత్‌, హెడ్‌, గ్రీన్‌, క్యారీ, కమిన్స్‌ (కెప్టెన్‌), స్టార్క్‌, లియోన్‌, బోలాండ్‌.

పిచ్‌, వాతావరణం

వల్‌ పిచ్‌పై మొత్తంగా స్పిన్నర్లదే ఆధిపత్యం. అయితే ఇక్కడ టెస్టులు ఆగస్టు, సెప్టెంబరులో జరగడంతో ఆ సమయంలో వాతావరణ పరిస్థితుల దృష్టా వారు లాభపడ్డారు. కానీ ఈసారి జూన్‌ ఆరంభంలోనే మ్యాచ్‌ జరుగనుంది. ప్రస్తుతం పిచ్‌ పచ్చికతో కళకళలాడుతున్నా.. మ్యాచ్‌ రోజు ఉపరితలాన్ని కత్తిరించనున్నారు. బౌన్సీ పిచ్‌ ఉంటుందని క్యూరేటర్‌ చెబుతున్నాడు. అలాగే తొలి మూడు రోజులపాటు వరుణుడి నుంచి ఎలాంటి అంతరాయం లేదు.

ఆసీస్‌తో జరిగిన చివరి నాలుగు టెస్టు సిరీస్‌లను సైతం భారత్‌ 2–1తోనే గెలుచుకోవడం విశేషం.

143 ఏళ్ల ది ఓవల్‌ మైదాన చరిత్రలో జూన్‌లో ఓ టెస్టు జరగడం ఇదే తొలిసారి

ఓవల్‌లో జరిగిన చివరి ఐదు టెస్టుల్లో నాలుగింట్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. ఇందులో పేసర్లు 141, స్పిన్నర్లు 41 వికెట్లు తీశారు.

రోహిత్‌కు గాయం

బ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కెప్టెన్‌ రోహిత్‌ ఎడమ బొటనవేలికి గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా బంతి బలంగా చేతికి తాకింది. వెంటనే ఫిజియో కమలేశ్‌ వచ్చి నెట్స్‌ నుంచి తీసుకెళ్లడంతో తిరిగి ప్రాక్టీస్‌ కొనసాగించలేకపోయాడు. అయితే రోహిత్‌ గాయం అంత సీరియస్‌ కాదని బీసీసీఐ వర్గాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2023-06-07T06:32:58+05:30 IST