Women's T20 World Cup: యువ జట్టే ఆదర్శం

ABN , First Publish Date - 2023-02-07T02:50:40+05:30 IST

అండర్‌-19 విభాగంలో జరిగిన తొలి టీ20 ప్రపంచక్‌పలో భారత అమ్మాయిల విజృంభణ అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిన ఈ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది.

Women's T20 World Cup: యువ జట్టే ఆదర్శం

షఫాలీ వర్మ కీలకం

భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌

టీ 20 వరల్డ్‌ కప్‌ మరో 3 రోజుల్లో

న్యూఢిల్లీ: అండర్‌-19 విభాగంలో జరిగిన తొలి టీ20 ప్రపంచక్‌పలో భారత అమ్మాయిల విజృంభణ అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిన ఈ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. ఇక శుక్రవారం నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్‌ జరుగబోతోంది. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్‌ వశం చేసుకోవాలన్న కసితో ఉంది. 2020 టోర్నీ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమి ఇంకా జట్టును వెంటాడుతూనే ఉంది. అందుకే అండర్‌-19 జట్టు విజయం తమలో స్ఫూర్తి రగిల్చిందని, వారిని ఆదర్శంగా తీసుకుని బరిలోకి దిగుతామంటున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ పలు అంశాలపై మాట్లాడింది..

Untitled-2.jpg

షఫాలీ దూకుడు లాభిస్తుంది:

భారత మహిళల జట్టులో షఫాలీ వర్మ అత్యంత కీలక ప్లేయర్‌. తను శుభారంభం అందించిన ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టు ఆధిక్యంలో ఉం టుంది. షఫాలీని సహజశైలిలో ఆడేందుకు ప్రోత్సహిస్తుంటాం. సహచర ఆటగాళ్ల నుంచి కూడా విశేష మద్దతు లభిస్తుంటుంది. 15 ఏళ్ల వయస్సులోనే షఫాలీ జట్టులో చేరింది. 2020 టోర్నీలో డాషింగ్‌ ఆటతీరుతో జట్టును ఫైనల్‌కు చేర్చగలిగింది. ఇప్పుడు అండర్‌-19 జట్టును గెలిపించిన కెప్టెన్‌ కూడా అయ్యింది. షఫాలీ మెరుపు ఆరంభాలు సీనియర్‌ జట్టును విజేతగా నిలిపేందుకు దోహదపడతాయని భావిస్తున్నా.

మా దృష్టంతా పాక్‌పైనే..:

ఈనెల 12న మేం తొలి మ్యాచ్‌లో పాక్‌ జట్టుతో తలపడబోతున్నాం. ఆ మర్నాడే మహిళల ఐపీఎల్‌ వేలం ఉంది. అయినా వేలం కన్నా మాకు పాక్‌తో మ్యాచే ముఖ్యం. ఈ విషయంలో ఏకాగ్రతగా ఎలా ఉండాలో మాకు తెలుసు. రానున్న రెండు, మూడు నెలలు మహిళల క్రికెట్‌కు ఎంతో కీలకం. రాబోయే మహిళల ఐపీఎల్‌ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నా.

అది చాలా పెద్ద నిర్ణయం:

పురుషుల క్రికెటర్లతో పాటు మహిళలకు కూడా సమాన మ్యాచ్‌ ఫీజులివ్వడం బీసీసీఐ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. మహిళా క్రికెట్‌లో ఇది పెనుమార్పునకు దారి తీస్తుంది. ఎందుకంటే దేశంలో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

గంగూలీ, ధోనీ కెప్టెన్సీ అద్భుతం:

కెప్టెన్సీ విషయంలో గంగూలీ, ఎంఎస్‌ ధోనీలను ఆదర్శంగా తీసుకుంటాను. దాదా హయాంలో భారత జట్టు అట్టడుగు నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగింది. యువ ఆటగాళ్లపై నమ్మకముంచి వారిని కీలకంగా మార్చాడు. ఇక ధోనీ మైదానంలో ఎలాంటి వ్యూహకర్తో అందరికీ తెలిసిందే. ఆయనలాగే నేను కూడా ఉత్కంఠ పరిస్థితిలో ఒత్తిడికి లోను కాకుండా చూసుకుంటాను. మహీ పాత వీడియోలు చూసినా చాలు. అందుకే కెప్టెన్‌గా ఎలా ఉండాలో ఈ ఇద్దరినీ చూసి నేర్చుకున్నాను.

Updated Date - 2023-02-07T03:45:03+05:30 IST