Share News

టాస్‌ పడకుండానే..

ABN , First Publish Date - 2023-12-11T04:53:46+05:30 IST

భారత్‌-దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణమైంది. ఆదివారం రాత్రి 7.30కు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. అంతకంటే ముందు నుంచే భారీ వర్షం...

టాస్‌ పడకుండానే..

భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టీ20 రద్దు

కరుణించని వరుణుడు

డర్బన్‌: భారత్‌-దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణమైంది. ఆదివారం రాత్రి 7.30కు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా.. అంతకంటే ముందు నుంచే భారీ వర్షం ఆరంభమైంది. దీంతో కనీసం టాస్‌ వేయడానికి కూడా వాతావరణం సహకరించలేదు. వర్షం తగ్గితే ఓవర్లు కుదించైనా ఆటను నిర్వహించాలని అధికారులు భావించినా.. వరుణుడు ఏమాత్రం కరుణించలేదు. ఏకధాటిగా కురిసిన వర్షంతో మైదానం పూర్తి చిత్తడిగా మారింది. కనీసం మైదానం సమీక్షించేందుకు కూడా అంపైర్లకు అవకాశం చిక్కలేదు. అటు ఇరు జట్ల ఆటగాళ్లు చేసేదేమీ లేక డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. చివరకు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.25కి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మంగళవారం రెండో మ్యాచ్‌ జరుగుతుంది. దక్షిణాసియా జనాభా అధికంగా ఉండే డర్బన్‌లో ఈ మ్యాచ్‌ కోసం నెల ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. అయినా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

సిరీ్‌సకు దీపక్‌ దూరం!

న్యూఢిల్లీ: భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీ్‌సకు దూరమయ్యే అవకాశం ఉంది. అతనింకా జట్టుతో కలవనేలేదు. అందుకే ఆదివారం వర్షంతో రద్దయిన తొలి మ్యాచ్‌కు కూడా దీపక్‌ అందుబాటులో లేడు. కుటుంబసభ్యుల్లో ఒకరు అనారోగ్యంతో ఉండడంతో దీపక్‌ భారత్‌లోనే ఉండిపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌కు కూడా ఇదే కారణంతో దూరమై ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం మెరుగైతేనే అతను దక్షిణాఫ్రికాకు వెళతాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపాడు. దీంతో తాజా మూడు టీ20ల సిరీ్‌సలో దీపక్‌ ఆడేది సందేహంగానే మారింది.

Updated Date - 2023-12-11T04:53:49+05:30 IST