WTC Australia WIN: పోరాటమే లేకుండా..

ABN , First Publish Date - 2023-06-12T02:48:50+05:30 IST

వరుసగా రెండో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ టీమిండియా నిరాశపరిచింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్‌ సేనకు..

WTC Australia WIN: పోరాటమే లేకుండా..

209 రన్స్‌ తేడాతో టీమిండియా చిత్తు

● నిరాశపర్చిన బ్యాటర్లు

● ఆసీస్‌దే డబ్ల్యూటీసీ ట్రోఫీ

ఎలాంటి అద్భుతమూ జరుగలేదు.. పేరు గొప్ప స్టార్ల నుంచి కోట్లాది క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆశించినప్పటికీ ఆసీస్‌ బౌలర్ల ముందు బ్యాట్లెత్తేశారు. ఐపీఎల్‌లోనే తమ శక్తినంతా ధారబోసిన ఈ మిలియనీర్స్‌ క్రికెటర్లు ఏదో యథాలాపంగా ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అడుగుపెట్టినట్టుగా ఉంది. ఐదో రోజు ఏడు వికెట్లు చేతిలో ఉన్న వేళ కచ్చితంగా పోరాడతారనే అందరి అంచనా ఘోరంగా తప్పింది. కేవలం ఒక్క సెషన్‌లోనే అంతా వెనుదిరగడం భారత క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో తొలి రోజు నుంచే అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లోనూ అదరగొట్టిన ఆస్ట్రేలియా సిసలైన చాంపియన్‌గా నిలిచింది.

ఐసీసీకి సంబంధించిన అన్ని ట్రోఫీ (టీ20, వన్డే, టెస్టు, చాంపియన్స్‌ ట్రోఫీ)లను గెలుచుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

లండన్‌: వరుసగా రెండో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ టీమిండియా నిరాశపరిచింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్‌ సేనకు.. ఆఖరి రోజు 280 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో ఉన్న విరాట్‌ (49), రహానె (46)లపై భారీ ఆశలే పెట్టుకున్నా ఆ ఇద్దరూ ఉసూరుమనిపించారు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి మిగతా వికెట్లు కూడా టపటపా నేలకూలడంతో భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 63.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. ఇంత భారీ ఛేదనలో కనీసం ఒక్క బ్యాటర్‌ నుంచి కూడా అర్ధసెంచరీ రాకపోవడం గమనార్హం. దీంతో 209 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా.. సగర్వంగా ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ గదను అందుకుంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 469, రెండో ఇన్నింగ్స్‌లో 270/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేయగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 రన్స్‌ సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ట్రావిస్‌ హెడ్‌ నిలిచాడు.

ఒక్క సెషన్‌లోనే..: మూడు సెషన్లు.. ఏడు వికెట్లు.. 280 పరుగులు. ఆదివారం ఐదో రోజు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగడానికి ముందున్న సమీకరణమిది. విజయం వీలు కాకుంటే, కనీసం డ్రా కోసమై నా చివరి వరకు పోరాడగలరని అంతా భావించారు. కానీ ఆసీస్‌ బౌలర్ల ధాటికి వీరంతా అవుటయ్యేందుకు రెండు గంటలు కూడా పట్టలేదు. వాస్తవానికి పిచ్‌ ప్రమాదకరంగా కనిపించకపోగా.. క్రీజులో ఉన్న విరాట్‌, రహానె కూడా ఆరంభంలో ఇబ్బందిలేకుండా ఆడారు. కానీ తొలి ఆరు ఓవర్ల తర్వాతే సీన్‌ మారింది. ముందుగా 47వ ఓవర్లో పేసర్‌ బోలాండ్‌ ఝలక్‌ ఇస్తూ విరాట్‌ను దెబ్బతీశాడు. ఆఫ్‌సైడ్‌కు ఆవలగా వెళ్తున్న బంతిని టచ్‌ చేయగా దాన్ని రెండో స్లిప్‌లో ఉన్న స్మిత్‌ ఎడమ వైపునకు డైవ్‌ చేస్తూ రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో బంతి వ్యవధిలోనే జడేజా డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా రహానెతో పాటు భరత్‌, ఓవల్‌లో వరుస హాఫ్‌ సెంచరీలు చేసిన శార్దూల్‌ కూడా ఉండడంతో కనీసం డ్రా ఫలితం కోసమైనా అభిమానుల్లో ఆశలు కనిపించాయి. కానీ కాసేపటికే రహానెను స్టార్క్‌, శార్దూల్‌ను లియాన్‌ డకౌట్‌ చేయడంతో ఇక ఓటమి ఖాయమని తేలింది.

బెస్ట్‌ ఆఫ్‌ త్రీ ఫైనల్స్‌ ఉండాలి

తొలి ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు మెరుగ్గానే రాణించారు. కానీ హెడ్‌, స్మిత్‌ భాగస్వామ్యంతోనే మ్యాచ్‌లో పట్టు కోల్పోయాం. అయినా గత నాలుగేళ్లలో రెండు ఫైనల్స్‌ ఆడడం మా ఘనతే. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమయ్యేందుకు మాకు సమయం లేకపోయింది. ఈ ఫైనల్‌ను ఫిబ్రవరి, మార్చిలో కాకుండా జూన్‌లో ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇంగ్లండ్‌లోనే కాకుండా ఎక్కడైనా ఈ టెస్టును జరిపించవచ్చు. ఫైనల్‌ కూడా 3 మ్యాచ్‌ల సిరీస్‌ అయితే బావుంటుంది. గిల్‌ క్యాచ్‌ విషయంలోనూ అసంతృప్తి ఉంది. ఐపీఎల్‌లో పది కెమెరా యాంగిల్స్‌ చూపిస్తున్నప్పుడు.. అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు యాంగిల్స్‌ మాత్రమే చూపించడమేమిటి?

– రోహిత్‌ శర్మ

స్కోరు బోర్డు

స్కోరు బోర్డు ఆసీస్‌ తొలి ఇన్నింగ్

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 469;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296;

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 270/8 డిక్లేర్‌.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) లియాన్‌ 43; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) బోలాండ్‌ 18; పుజార (సి) క్యారీ (బి) కమిన్స్‌ 27; కోహ్లీ (సి) స్మిత్‌ (బి) బోలాండ్‌ 49; రహానె (సి) క్యారీ (బి) స్టార్క్‌ 46; జడేజా (సి) క్యారీ (బి) బోలాండ్‌ 0; భరత్‌ (సి అండ్‌ బి) లియాన్‌ 23; శార్దూల్‌ (ఎల్బీ) లియాన్‌ 0; ఉమేశ్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 1; షమి (నాటౌట్‌) 13; సిరాజ్‌ (సి) బోలాండ్‌ (బి) లియాన్‌ 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 63.3 ఓవర్లలో 234 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93, 4–179, 5–179, 6–212, 7–213, 8–220, 9–224, 10–234. బౌలింగ్‌: కమిన్స్‌ 13–1–55–1; బోలాండ్‌ 16–2–46–3; స్టార్క్‌ 14–1–77–2; గ్రీన్‌ 5–0–13–0; లియాన్‌ 15.3–2–42–4.

Updated Date - 2023-06-12T04:31:54+05:30 IST