Gujarat Titans: వార్‌ వన్‌సైడ్‌!

ABN , First Publish Date - 2023-05-06T02:54:04+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకెళ్తోంది. టాపార్డర్‌ బ్యాటర్లు దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌లో శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది.

Gujarat Titans: వార్‌ వన్‌సైడ్‌!

జైపూర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకెళ్తోంది. టాపార్డర్‌ బ్యాటర్లు దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌లో శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 17.5 ఓవర్లలో 118 పరుగులకు కుప్పకూలింది. శాంసన్‌ (30), ట్రెంట్‌ బౌల్ట్‌ (15) టాప్‌ స్కోరర్లు. రషీద్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ 13.5 ఓవర్లలో 119/1 స్కోరు చేసి అలవోకగా ఛేదించింది. పాండ్యా (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్‌), సాహా (34 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (35 బంతుల్లో 6 ఫోర్లతో 36) ధాటిగా ఆడారు. మిగిలి ఉన్న బంతుల పరంగా ఈ సీజన్‌లో గుజరాత్‌ అతిపెద్ద గెలుపును నమోదు చేయగా.. గత ఐదు మ్యాచ్‌ల్లో రాయల్స్‌కు ఇది నాలుగో ఓటమి. రషీద్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 గెలిచిన టైటాన్స్‌ 14 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. 10 మ్యాచ్‌ల్లో 5 నెగ్గిన రాజస్థాన్‌ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

ఊదేశారు..: రాజస్థాన్‌ బ్యాటర్లు విఫలమైన చోటు గుజరాత్‌ ఆటగాళ్లు అదరగొట్టారు. ఓపెనర్లు సాహా, గిల్‌ నిలకడైన ఆరంభాన్ని అందించడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ కోల్పోకుండా 49 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే సాహా రెండు బౌండ్రీలతో జోరు చూపగా.. గిల్‌ నెమ్మదిగా బ్యాట్‌ ఝుళిపించాడు. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు జంపా, చాహల్‌ ఎంట్రీతో పరుగుల వేగం మందగించింది. 10వ ఓవర్‌లో ఊరించే బంతితో గిల్‌ను చాహల్‌ స్టంపౌట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే, హార్దిక్‌ వస్తూనే టాప్‌ గేర్‌ వేశాడు. జంపా వేసిన 11వ ఓవర్‌లో పాండ్యా 3 సిక్స్‌లు, ఫోర్‌తో 24 పరుగులు పిండుకోవడంతో.. టీమ్‌ స్కోరు సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత నింపాదిగా ఆడిన వీరిద్దరూ 37 బంతులు మిగిలుండగానే గెలిపించారు.

పెవిలియన్‌కు క్యూ: గుజరాత్‌ స్పిన్నర్లు రషీద్‌, నూర్‌ అహ్మద్‌ ఉచ్చులో చిక్కుకొన్న రాజస్థాన్‌ విలవిల్లాడింది. క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొన్న రాయల్స్‌ పూర్తి ఓవర్లు కూడా ఆడలేక పోయింది. ఆరుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకొన్న రాజస్థాన్‌ వ్యూహం ఆదిలోనే బెడిసికొట్టింది. 2 ఫోర్లతో దూకుడుగా కనిపించిన ఓపెనర్‌ బట్లర్‌ (8)ను హార్దిక్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. అయితే, మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (14), శాంసన్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. మూడో ఓవర్‌లో షమి బౌలింగ్‌లో జైస్వాల్‌ 6,4తో బ్యాట్‌ ఝుళిపించగా.. ఆ తర్వాతి ఓవర్‌లో శాంసన్‌ 4,6తో ఎదురుదాడి ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు 36 పరుగులతో వీరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో జైస్వాల్‌ రనౌట్‌ కావడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్‌ 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. జోరుమీదున్న శాంసన్‌ను లిటిల్‌ బోల్తా కొట్టించడంతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఇక, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు రషీద్‌, నూర్‌ పకడ్బందీగా బౌల్‌ చేస్తూ రాయల్స్‌ వెన్నువిరిచారు. అశ్విన్‌ (2), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌ (4)ను రషీద్‌ వెనక్కి పంపడంతో 10 ఓవర్లకు రాజస్థాన్‌ 72/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. పడిక్కళ్‌ (12), ధ్రువ్‌ జురెల్‌ (9)ను నూర్‌ అహ్మద్‌ అవుట్‌ చేయగా.. 15వ ఓవర్‌లో హెట్‌ మయర్‌ (9)ను రషీద్‌ వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే, టెయిలెండర్లు బౌల్ట్‌, జంపా (7) అతికష్టమ్మీద టీమ్‌ స్కోరును సెంచరీ మార్క్‌ దాటించారు.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (రనౌట్‌) 14, బట్లర్‌ (సి) మోహిత్‌ (బి) హార్దిక్‌ 8, శాంసన్‌ (సి) హార్దిక్‌ (బి) లిటిల్‌ 30, పడిక్కళ్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 12, అశ్విన్‌ (బి) రషీద్‌ 2, రియాన్‌ (ఎల్బీ) రషీద్‌ 4, హెట్‌మయెర్‌ (ఎల్బీ) రషీద్‌ 7, జురెల్‌ (ఎల్బీ) నూర్‌ అహ్మద్‌ 9, బౌల్ట్‌ (బి) షమి 15, జంపా (రనౌట్‌) 7, సందీప్‌ శర్మ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.5 ఓవర్లలో 118 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-47, 3-60, 4-63, 5-69, 6-77, 7-87, 8-96, 9-112; బౌలింగ్‌: షమి 4-0-27-1, హార్దిక్‌ 2-0-22-1, రషీద్‌ ఖాన్‌ 4-0-14-3, లిటిల్‌ 4-0-24-1, నూర్‌ అహ్మద్‌ 3-0-25-2, మోహిత్‌ 0.5-0-5-0.

గుజరాత్‌: సాహా (నాటౌట్‌) 41, గిల్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) చాహల్‌ 36, హార్దిక్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 13.5 ఓవర్లలో 119/1; వికెట్ల పతనం: 1-71; బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-28-0, సందీప్‌ 3-0-19-0, జంపా 3-0-40-0, చాహల్‌ 3.5-0-22-1, అశ్విన్‌ 1-0-8-0.

Updated Date - 2023-05-06T07:24:17+05:30 IST