Share News

విక్టరీ..హిస్టరీ

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:45 AM

నాలుగు రోజుల టెస్టు.. కానీ మనోళ్ల అద్భుత ప్రదర్శనకు రెండున్నర రోజుల్లోనే ముగిసింది.

విక్టరీ..హిస్టరీ

‘136’కే కుప్పకూలిన ఇంగ్లండ్‌

మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో హర్మన్‌ సేన రికార్డు

347 పరుగులతో భారత్‌ ఘన విజయం

మన మహిళలు సాధించారు..

స్వదేశంలో ఇంగ్లండ్‌పై 15 మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకు టెస్ట్టు విజయం సొంతం చేసుకున్నారు..అలా ఇలాకాదు ఏకంగా 347 పరుగులతో ప్రత్యర్థిని చిత్తు చేశారు..తద్వారా మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించారు..

బౌలర్లు, బ్యాటర్లు సమష్టి ప్రదర్శనతో దక్కించుకున్న ఈ అపురూప విజయంలో ఆఫ్‌స్పిన్నర్‌ దీప్తిశర్మ పాత్ర అనన్య సామాన్యం.. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ, ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆమె ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది..ఈ విజయం వచ్చేవారం ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు మ్యాచ్‌కు హర్మన్‌ప్రీత్‌ సేనకు ఎంతో ఆత్మవిశ్వాసం ఇస్తుందనడంలో సందేహం లేదు.

1 . మహిళల టెస్టుల్లో అత్యధిక రన్స్‌ తేడాతో గెలిచిన జట్టుగా శ్రీలంక పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును భారత్‌ తిరగరాసింది. 1998లో

కొలంబోలో

పాకిస్థాన్‌పై లంక 309 పరుగులతో నెగ్గింది.

నవీ ముంబై: నాలుగు రోజుల టెస్టు.. కానీ మనోళ్ల అద్భుత ప్రదర్శనకు రెండున్నర రోజుల్లోనే ముగిసింది..ఏడు సెషన్లు సాగిన మ్యాచ్‌లో బలమైన పర్యాటక జట్టుపై భారత్‌ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది.. ఫలితం చారిత్రక విజయం.. 479 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు భారత పేసర్లు, స్పిన్నర్ల ధాటికి తాళలేక 131 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 347 పరుగుల భారీ తేడాతో హర్మన్‌సేన విజయం సాధించింది. కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (21), డీన్‌ (20 నాటౌట్‌), బౌమాంట్‌ (17) ఒకింత ఆడారుకానీ..లేదంటే ఇంగ్లండ్‌ మరింత ఘోరంగా ఓడేది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 186/6తోనే భారత్‌ తన ఇన్నింగ్స్‌ ముగిసినట్టు ప్రకటించింది.

పేసర్లు, స్పిన్నర్లు భళా: శనివారం, మూడో రోజు ఉదయం ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఏడో ఓవర్లోనే పేసర్‌ రేణుక ఝలకిచ్చింది. కళ్లు చెదిరే బంతితో బౌమాంట్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి టీమిండియాకు తొలి బ్రేక్‌ ఇచ్చింది. ఇక తన మొదటి ఓవర్లోనే వరుస బంతుల్లో డంక్లీ (15), బ్రంట్‌ (0)ను పేసర్‌ పూజా వస్త్రాకర్‌ పెవిలియన్‌ చేర్చడంతో 37/3తో ఇంగ్లండ్‌ కుదేలైంది. మూడో బంతిని వయట్‌ బౌండరీకి తరలించడంతో పూజ హ్యాట్రిక్‌ మిస్సయింది. మూడు ఫోర్లతో దూకుడు కనబరిచిన కెప్టెన్‌ నైట్‌కు ఇన్నింగ్స్‌కు కూడా వస్త్రాకర్‌ చెక్‌ పెట్టింది. వయట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఆమె నెలకొల్పిన 31 పరుగులే పర్యాటక టీమ్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఈ దశనుంచి దీప్తి ఇంగ్లండ్‌ పనిపట్టింది. ఆమెకు మరో స్పిన్నర్‌ రాజేశ్వరి తోడవడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లోనే ఆలౌటైంది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 428; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 136;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 186/6 డిక్లేర్డ్‌;

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: డంక్లీ (సి/సబ్‌) హర్లీన్‌ (బి) వస్త్రాకర్‌ 15, బౌమాంట్‌ (బి) రేణుక 17, నైట్‌ (సి) భాటియా (బి) వస్త్రాకర్‌ 21, బ్రంట్‌ (బి) వస్త్రాకర్‌ 0, వయట్‌ (సి) రాణా (బి) దీప్తిశర్మ 12, జోన్స్‌ (సి) షఫాలీ (బి) దీప్తిశర్మ 5, ఎకెల్‌స్టోన్‌ (బి) రాజేశ్వరి 10, చార్లీ డీన్‌ (నాటౌట్‌) 20, కేట్‌ క్రాస్‌ (బి) దీప్తిశర్మ 16, లారెన్‌ ఫైలర్‌ (బి) దీప్తిశర్మ 0, లారెన్‌ బెల్‌ (సి) జెమీమా (బి) రాజేశ్వరి 8, ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: 27.3 ఓవర్లలో 131 ఆలౌట్‌; వికెట్లపతనం: 1/27, 2/37, 3/3/37, 4/68, 5/68, 6/83, 7/83, 8/108, 9/108; బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 6-1-30-1, స్నేహ్‌ రాణా 4-0-19-0, పూజా వస్త్రాకర్‌ 4-1-23-3, దీప్తిశర్మ 8-2-32-4, రాజేశ్వరీ గైక్వాడ్‌ 5.3-1-20-2.

Updated Date - Dec 17 , 2023 | 05:45 AM