ఢిల్లీ కమాల్‌

ABN , First Publish Date - 2023-04-25T00:56:45+05:30 IST

145 పరుగుల స్వల్ప లక్ష్యం.. పైగా సొంత మైదానం. ఇంకేముంది తమదే విజయమనుకున్న సన్‌రైజర్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు దిమ్మ తిరిగే ఇచ్చారు.

ఢిల్లీ కమాల్‌

స్వల్ప లక్ష్యాన్ని కాపాడిన బౌలర్లు

7 రన్స్‌తో సన్‌రైజర్స్‌ చిత్తు

అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ షో

హౖదరాబాద్‌: 145 పరుగుల స్వల్ప లక్ష్యం.. పైగా సొంత మైదానం. ఇంకేముంది తమదే విజయమనుకున్న సన్‌రైజర్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు దిమ్మ తిరిగే ఇచ్చారు. వీరి మూకుమ్మడి దాడితో ఒక్కో పరుగు కోసం చెమటోడ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ చివరికి 7 పరుగులతో ఓటమిపాలైంది. అక్షర్‌ పటేల్‌ (34; 2/21) ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ మాత్రమే నమోదైంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (34) ఆకట్టుకున్నాడు. సుందర్‌కు 3, భువనేశ్వర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడింది. మయాంక్‌ అగర్వాల్‌ (49), క్లాసెన్‌ (31), వాషింగ్టన్‌ సుందర్‌ (24 నాటౌట్‌) మాత్రమే రాణించారు. నోకియా, అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అక్షర్‌ నిలిచాడు.

చేజేతులా..: స్వల్ప ఛేదన అయినా సన్‌రైజర్స్‌ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. అటు పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఢిల్లీ బౌలర్లు మాత్రం ఆరంభం నుంచే పట్టు బిగించారు. పవర్‌ప్లేలో రైజర్స్‌ అతికష్టంగా 36 పరుగులే చేయడంతో ఆ తర్వాత ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ 17వ ఓవర్‌లో రావడం గమనార్హం. తొలి ఓవర్‌ నాలుగో బంతికే ఓపెనర్‌ మయాంక్‌ క్యాచ్‌ను మిచ్‌ మార్ష్‌ వదిలేయడంతో బతికిపోయాడు. ఇక మరో ఓపెనర్‌ హ్యారీ బ్రూక్‌ ఆడిన 14 బంతుల్లో ఏడు పరుగులే చేసి నోకియా చేతిలో బౌల్డయ్యాడు. పవర్‌ప్లే తర్వాత మయాంక్‌-త్రిపాఠి (15) జోడీ భారీ షాట్లకు వెళ్లకపోవడంతో ఐదు ఓవర్లలో ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. రెండో వికెట్‌కు 38 పరుగులు జత చేరాక రైజర్స్‌ ఒక్కసారిగా తడబడింది. స్పిన్నర్ల హవాతో వరుస ఓవర్లలో మయాంక్‌, త్రిపాఠి, అభిషేక్‌ (5), కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (3) వికెట్లను కోల్పోయి 85/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్‌-సుందర్‌ జోడీ ఓపిగ్గా ఆడుతూ పరుగులు రాబట్టింది. అయితే ఉత్కంఠ పెరిగిన దశలో 17, 18వ ఓవర్లలో కలిపి 28 రన్స్‌ రావడంతో రైజర్స్‌ తిరిగి రేసులోకి వచ్చింది. కానీ సమీకరణం 12 బంతుల్లో 23 పరుగులకు చేరిన వేళ క్లాసెన్‌ అవుట్‌ కావడం దెబ్బతీసింది. ఆఖరి ఓవర్‌లో 13 రన్స్‌ కావాల్సిన వేళ.. ముకేశ్‌ అద్భుత బౌలింగ్‌తో కేవలం 5 పరుగులే ఇవ్వడంతో రైజర్స్‌కు నిరాశే మిగిలింది.

సుందర్‌ దెబ్బకు..:టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని రైజర్స్‌ బౌలర్లు ఆటాడించారు. వీరి ధాటికి బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క వికెట్‌ తీయని స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఒకే ఓవర్లో ముగ్గుర్ని అవుట్‌చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. అటు వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ పొదుపుగా బౌలింగ్‌ వేశాడు. చివరి మూడు ఓవర్లలో 16 రన్స్‌ మాత్రమే చేసిన డీసీ నాలుగు వికెట్లను కోల్పోయింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ పృథ్వీ షాను ఈ మ్యాచ్‌కు దూరం పెట్టగా.. అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌ సాల్ట్‌ (0)ను ఆడిస్తే అతను మొదటి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన మిచెల్‌ మార్ష్‌ (25).. రెండో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో సత్తా చాటాడు. అటు వార్నర్‌ (21) నాలుగో ఓవర్‌లో ఫోర్‌తో పాటు ఈ సీజన్‌లో తొలి సిక్సర్‌తో మురిపించాడు. అయితే ఊపు మీద కనిపించిన మార్ష్‌ను ఐదో ఓవర్‌లో నటరాజన్‌ ఎల్బీ చేశాడు. దీనికి తోడు పవర్‌ప్లేలో 49/2 స్కోరుతో ఉన్న ఈ జట్టుకు ఎనిమిదో ఓవర్‌లో గట్టి దెబ్బ పడింది. సుందర్‌ వేసిన ఈ ఓవర్‌లో వార్నర్‌, సర్ఫరాజ్‌ (10), అమన్‌ హకీమ్‌ (4) ఐదు బంతుల వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరడంతో డీసీ 57/2 నుంచి ఒక్కసారిగా 62/5 స్కోరుకు పడిపోయింది. ఈ దెబ్బకు మనీశ్‌, అక్షర్‌ జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. నెమ్మదిగా ఆడినా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అటు 9-13 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ మాత్రమే నమోదైంది. 17వ ఓవర్‌లో అక్షర్‌ జోరు పెంచి హ్యాట్రిక్‌ ఫోర్లతో 15 రన్స్‌ సాధించగా స్కోరులో కదలిక వచ్చింది. కానీ అక్షర్‌ను భువీ బౌల్డ్‌ చేయడం, తర్వాతి ఓవర్‌లో పాండే రనౌట్‌ కావడంతో ఆరో వికెట్‌కు 69 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్‌లో భువనే

స్కోరుబోర్డు

ఢిల్లీ: వార్నర్‌ (సి) బ్రూక్‌ (బి) వాషింగ్టన్‌ 21, సాల్ట్‌ (సి) క్లాసెన్‌ (బి) భువనేశ్వర్‌ 0, మార్ష్‌ (ఎల్బీ) నటరాజన్‌ 25, సర్ఫరాజ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) వాషింగ్టన్‌ 10, పాండే (రనౌట్‌) 34, హకీమ్‌ (సి) అభిషేక్‌ (బి) వాషింగ్టన్‌ 4, అక్షర్‌ (బి) భువనేశ్వర్‌ 34, రిపల్‌ (రనౌట్‌) 5, నోకియా (రనౌట్‌) 2, కుల్దీప్‌ (నాటౌట్‌) 4, ఇషాంత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 144/9; వికెట్ల పతనం: 1-1, 2-39, 3-57, 4-58, 5-62, 6-131, 7-134, 8-139, 9-139; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-11-2, జాన్సెన్‌ 2-0-27-0, వాషింగ్టన్‌ 4-0-28-3, నటరాజన్‌ 3-0-21-1, మార్కండే 4-0-34-0, ఉమ్రాన్‌ 2-0-14-0, మార్‌క్రమ్‌ 1-0-7-0.

హైదరాబాద్‌: బ్రూక్‌ (బి) నోకియా 7, మయాంక్‌ (సి) అమన్‌ (బి) అక్షర్‌ 49, త్రిపాఠి (సి) సాల్ట్‌ (బి) ఇషాంత్‌ 15, అభిషేక్‌ (సి అండ్‌ బి) కుల్దీప్‌ 5, మార్‌క్రమ్‌ (బి) అక్షర్‌ 3, క్లాసెన్‌ (సి) అమన్‌ (బి) నోకియా 31, వాషింగ్టన్‌ (నాటౌట్‌) 24, జాన్సెన్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 137/6; వికెట్ల పతనం: 1-31, 2-69, 3-75, 4-79, 5-85, 6-126; బౌలింగ్‌: ఇషాంత్‌ 3-0-18-1, నోకియా 4-0-33-2, ముకేశ్‌ 3-0-27-0, అక్షర్‌ పటేల్‌ 4-0-21-2, కుల్దీప్‌ 4-0-22-1, మిచెల్‌ మార్ష్‌ 2-0-16-0.

Updated Date - 2023-04-25T00:56:45+05:30 IST