Share News

Three ODI series SA vs IND : ఇద్దరే కూల్చేశారు

ABN , Publish Date - Dec 18 , 2023 | 04:08 AM

ఆడిన గత మూడు వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్ట లేకపోయిన అర్ష్‌దీప్‌.. ఏకంగా ఐదు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టడంతో.. సౌతాఫ్రికాతో వన్డే సిరీ్‌సను భారత్‌ ఘన విజయంతో ఆరంభించింది. జట్టులో రాహుల్‌, శ్రేయాస్‌,

Three ODI series SA vs IND : ఇద్దరే కూల్చేశారు

116 పరుగులకే కుప్పకూలిన సఫారీలు

సుదర్శన్‌, అయ్యర్‌ అర్ధ శతకాలు

తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం

అర్ష్‌దీప్‌కు 5 వికెట్లు

అవేశ్‌కు 4 వికెట్లు

ఆడిన గత మూడు వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్ట లేకపోయిన అర్ష్‌దీప్‌.. ఏకంగా ఐదు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టడంతో.. సౌతాఫ్రికాతో వన్డే సిరీ్‌సను భారత్‌ ఘన విజయంతో ఆరంభించింది. జట్టులో రాహుల్‌, శ్రేయాస్‌, కుల్దీ్‌పలు మాత్రమే వరల్డ్‌కప్‌ ఆడిన ఆటగాళ్లు. కానీ, టచ్‌లో లేని వాళ్లు కూడా అద్భుతంగా రాణించడంతో సిరీ్‌సలో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట అర్ష్‌దీప్‌, అవేశ్‌ ఖాన్‌ సఫారీల పనిపట్టగా.. ఛేదనలో సుదర్శన్‌, అయ్యర్‌ అర్ధ శతకాలతో జట్టుకు భారీ గెలుపును అందించారు.

జొహాన్నె్‌సబర్గ్‌: అర్ష్‌దీప్‌ సింగ్‌ (5/37) ఐదు వికెట్ల సంచలన ప్రదర్శనకు అవేశ్‌ ఖాన్‌ (4/27) సహకారం అందడంతో.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీ్‌సలో భారత్‌ ఘనంగా బోణీ చేసింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తొలుత సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. స్వదేశంలో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. పెలూక్వాయో (33), టోనీ డి జోర్జి (28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కుల్దీప్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఛేదనలో భారత్‌ 16.4 ఓవర్లలో 117/2 స్కోరు చేసి గెలిచింది. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌ (43 బం తుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్‌), శ్రేయాస్‌ అయ్యర్‌ (45 బం తుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) అర్ధ శతకాలతో జట్టును అలవోకగా గెలిపించారు. అర్ష్‌దీప్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

అలవోకగా..: లక్ష్యం స్వల్పం కావడంతో టీమిండియా బ్యాటర్లు వీలైనంత వేగంగా మ్యాచ్‌ను ముగిద్దామనే ప్రయత్నం చేశారు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (5)ను ముల్డర్‌ ఎల్బీ చేసి ఆరంభంలోనే ఝలక్‌ ఇచ్చాడు. కానీ, కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న మరో ఓపెనర్‌ సుదర్శన్‌తో కలసి శ్రేయాస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించడంతో టీమిండియా సులువుగా నెగ్గింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అయ్యర్‌ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడగా, మరోవైపు సుదర్శన్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 61/1తో బలమైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత పెలూక్వాయో వేసిన 16వ ఓవర్‌లో సింగిల్‌తో సాయి అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. 4,6తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న అయ్యర్‌ అదే ఓవర్‌లో మరో భారీ షాట్‌ ఆడే క్రమంలో అవుటయ్యాడు. అప్పటికి భారత్‌ విజయానికి 6 పరుగులు కావాలి. ఆ తర్వాతి ఓవర్‌లో సుదర్శన్‌ ఫోర్‌ బాదగా.. తిలక్‌ వర్మ (1 నాటౌట్‌) మరో 200 బంతులు మిగిలుండగానే జట్టును గెలుపు గీత దాటించాడు.

బెంబేలెత్తించిన పేసర్లు: స్వింగ్‌తోపాటు అసమగ్రమైన బౌన్స్‌ లభిస్తున్న వికెట్‌పై భారత పేసర్లు విజృంభించడంతో.. సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టక తప్పలేదు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌ పవర్‌ప్లేలోనే సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టగా.. అవేశ్‌ మరో ఎండ్‌ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించాడు. టీ20 మ్యాచ్‌ ఆడిన పిచ్‌ కావడంతో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ మార్‌క్రమ్‌ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. కానీ, ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (0)ను బౌల్డ్‌ చేసిన అర్ష్‌దీప్‌.. తర్వాతి బంతికి డుస్సెన్‌ (0)ను ఎల్బీ చేయడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ వడిదొడుకులకు లోనైంది. అయితే, జోర్జి, మార్‌క్రమ్‌ (12) మూడో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, 52 పరుగుల స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దూకుడుగా ఆడుతున్న జోర్జితోపాటు క్లాసెన్‌ (6)ను అర్ష్‌దీప్‌ వెనక్కిపంపగా.. మార్‌క్రమ్‌, ముల్డర్‌ (0)ను అవేశ్‌ అవుట్‌ చేశాడు. ఆదుకొంటాడని భావించిన మిల్లర్‌ (2)ను అవేశ్‌ క్యాచవుట్‌ చేయడంతో 13 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 58/7. దీంతో జట్టు కనీసం మూడంకెల స్కోరైనా చేస్తుందా? అని అనిపించింది. ఈ దశలో పెలూక్వా యో.. లోయరార్డర్‌ అండతో టీమ్‌ స్కోరును కష్టమ్మీద సెంచరీ మార్క్‌ దాటించాడు. అయితే, పెలూక్వాయోను ఎల్బీ చేసిన అర్ష్‌దీప్‌ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. కేశవ్‌ మహారాజ్‌ (4)ను అవేశ్‌ క్యాచవుట్‌ చేయగా.. బర్గర్‌ (7)ను బౌల్డ్‌ చేసిన కుల్దీప్‌ సఫారీల ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ఫీట్‌ చేసిన తొలి భారత పేసర్‌గా అర్ష్‌దీప్‌. ఇక, సఫారీలపై ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌ అర్ష్‌దీప్‌. సునీల్‌ జోషి (5/6), చాహల్‌ (5/22), రవీంద్ర జడేజా (5/33) ముందున్నారు.

ఒక మ్యాచ్‌లో భారత పేసర్లు 9 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

స్కోరు బోర్డు

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, జోర్జి (సి) రాహుల్‌ (బి) అర్ష్‌దీప్‌ 28, డుస్సెన్‌ (ఎల్బీ) అర్ష్‌దీప్‌ 0, మార్‌క్రమ్‌ (బి) అవేశ్‌ 12, క్లాసెన్‌ (బి) అర్ష్‌దీప్‌ 6, మిల్లర్‌ (సి) రాహుల్‌ (బి) అవేశ్‌ 2, ముల్డర్‌ (ఎల్బీ) అవేశ్‌ 0, పెలూక్వాయో (ఎల్బీ) అర్ష్‌దీప్‌ 33, కేశవ్‌ (సి) రుతురాజ్‌ (బి) అవేశ్‌ 4, బర్గర్‌ (బి) కుల్దీప్‌ 7, షంసీ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 27.3 ఓవర్లలో 116 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-3, 2-3, 3-42, 4-52, 5-52, 6-52, 7-58, 8-73, 9-101, 10-116; బౌలింగ్‌: ముకేష్‌ 7-0-46-0, అర్ష్‌దీప్‌ 10-0-37-5, అవేశ్‌ ఖాన్‌ 8-3-27-4, కుల్దీప్‌ యాదవ్‌ 2.3-0-3-1.

భారత్‌: రుతురాజ్‌ (ఎల్బీ) ముల్డర్‌ 5, సాయి సుదర్శన్‌ (నాటౌట్‌) 55; అయ్యర్‌ (సి) మిల్లర్‌ (బి) పెలూక్వాయో 52, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16.4 ఓవర్లలో 117/2; వికెట్ల పతనం: 1-23, 2-111; బౌలింగ్‌: బర్గర్‌ 5.4-1-35-0, ముల్డర్‌ 4-0-26-1, కేశవ్‌ 3-0-19-0, షంసీ 3-0-22-0, పెలూక్వాయో 1-0-15-1.

బంతుల పరంగా (200) భారత్‌కిది నాలుగో అతి పెద్ద గెలుపు. గతంలో శ్రీలంక (263 బంతులు), కెన్యా (231), వెస్టిండీస్‌ (211)లపై గెలిచింది.

బంతుల పరంగా (200) దక్షిణాఫ్రికాకిది రెండో అతిపెద్ద ఓటమి. 2008లో ఇంగ్లండ్‌ చేతిలో 215 బంతులు మిగిలుండగానే ఓటమిపాలైంది.

అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేసిన 17వ భారత ఆటగాడిగా సుదర్శన్‌.

Updated Date - Dec 18 , 2023 | 04:08 AM