Hockey World Cup Winner Germany : జగజ్జేత జర్మనీ

ABN , First Publish Date - 2023-01-30T01:22:00+05:30 IST

ప్రపంచ కప్‌ హాకీ టోర్నీకి అద్భుత ముగింపు.. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం, పట్టువదలని పోరాటానికి మారుపేరైన జర్మనీ హోరాహోరీగా తలపడడంతో ఆదివారంనాటి ఫైనల్‌ హాకీ ఫ్యాన్స్‌కు పసందైన విందు పంచింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరు సడన్‌ డెత్‌లో

Hockey World Cup Winner Germany : జగజ్జేత జర్మనీ

సడన్‌ డెత్‌లో బెల్జియం చిత్తు

హాకీ ప్రపంచ కప్‌

భువనేశ్వర్‌: ప్రపంచ కప్‌ హాకీ టోర్నీకి అద్భుత ముగింపు.. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం, పట్టువదలని పోరాటానికి మారుపేరైన జర్మనీ హోరాహోరీగా తలపడడంతో ఆదివారంనాటి ఫైనల్‌ హాకీ ఫ్యాన్స్‌కు పసందైన విందు పంచింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరు సడన్‌ డెత్‌లో జర్మనీ 5-4తో బెల్జియంపై గెలుపొందింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 3-3తో సమంగా నిలవగా..మ్యాచ్‌ షూటౌట్‌కు దారి తీసింది. అందులోనూ ఇరు జట్లు నువ్వా..నేనా అనేలా పోటీ పడడంతో పోరు సడన్‌ డెత్‌కు దారి తీసింది. ఇందులో బెల్జియానికి జర్మనీ షాకిచ్చింది. నిక్లాస్‌ (29), గొంజాలో (41), మ్యాట్స్‌ (48) జర్మనీకి గోల్స్‌ అందించారు. ఫోర్లెంట్‌ (10), టాంగ్వీ (11), టామ్‌ (59) బెల్జియం తరుపున గోల్స్‌ చేశారు. జర్మనీకిది మూడో వరల్డ్‌ కప్‌. తద్వారా ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ సరసన జర్మనీ చేరింది.

ఆధిక్యం బెల్జియందే అయినా..: పదో నిమిషంలో ఫ్లోరెంట్‌ చేసిన అమోఘమైన ఫీల్డ్‌ గోల్‌తో బెల్జియం ఖాతా తెరిచింది. మరో నిమిషానికే జర్మనీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ టాంగ్వీ రెండో ఫీల్డ్‌ గోల్‌ కొట్టి బెల్జియం ఆధిక్యాన్ని డబుల్‌ చేశాడు. దాంతో మొదటి క్వార్టర్‌ ముగిసే సరికి బెల్జియం తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

పట్టువదలని జర్మనీ..: క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్లో వెనుకంజలో నిలిచి కూడా..వెరవని జర్మనీ ఆపై బలంగా పుంజుకొని ప్రత్యర్థులను చిత్తుచేసి విజయాలు సాధించింది. కానీ ఇది ఫైనల్‌..అందునా 0-2తో వెనుకంజ. ఇక జర్మనీ కోలుకోగలదా అన్న సందేహాలు చాలామందిలో. అయితే అనుభవజ్ఞులతో నిండిన జర్మనీ ఆ అంచనాలను పటాపంచలు చేసింది. మ్యాచ్‌ ఏదైనా తాను పట్టువదలనని నిరూపించింది. రెండో క్వార్టర్‌లో నిక్లాస్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో జర్మనీ బోణీ చేసింది. దాంతో ప్రథమార్థానికి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. 41వ నిమిషంలో గొంజాలో పెనాల్టీ కార్నర్‌తో స్కోరు సమం చేసిన జర్మనీ..48వ నిమిషంలో కెప్టెన్‌ మ్యాట్స్‌ ఫీల్డ్‌ గోల్‌తో 3-2తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. అదే జోరులో టైటిల్‌ దక్కించుకొనేందుకు చేరువైంది. కానీ మ్యాచ్‌ ముగిసే క్షణాల్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను బెల్జియం ఆటగాడు టామ్‌ విజయవంతంగా గోల్‌పోస్టులోకి పంపడంతో మ్యాచ్‌ 3-3తో సమమైంది. దాంతో షూటౌట్‌ అనివార్యంకాగా..ఇందులో ఇరు జట్లు చెరో మూడు గోల్స్‌ కొట్టడంతో సడన్‌ డెత్‌కు మళ్లింది. ‘డెత్‌’లో జర్మనీ రెండు గోల్స్‌ చేయగా, బెల్జియం ఒకటే సాధించింది.

Updated Date - 2023-01-30T01:22:01+05:30 IST