Share News

TEST IND vs SA : గతితప్పిన బౌలింగ్‌

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:59 AM

కేఎల్‌ రాహుల్‌ (137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) అత్యుత్తమ శతకం నమోదు చేసినా.. బౌలర్ల వైఫల్యం దెబ్బకొట్టింది. కెరీర్‌లో చివరి సిరీస్‌ ఆడుతున్న డీన్‌ ఎల్గర్‌ (211 బంతుల్లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్‌)

TEST IND vs SA : గతితప్పిన బౌలింగ్‌

దక్షిణాఫ్రికా 256/5

ఎల్గర్‌ శతక జోరు

భారత్‌ 245 ఆలౌట్‌

రాహుల్‌ సూపర్‌ సెంచరీ

సెంచూరియన్‌: కేఎల్‌ రాహుల్‌ (137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) అత్యుత్తమ శతకం నమోదు చేసినా.. బౌలర్ల వైఫల్యం దెబ్బకొట్టింది. కెరీర్‌లో చివరి సిరీస్‌ ఆడుతున్న డీన్‌ ఎల్గర్‌ (211 బంతుల్లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్‌) సొంతగడ్డపై సెంచరీతో చెలరేగడంతో బుధవారం ఆటలో దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. తొలి టెస్ట్‌ రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సౌతాఫ్రికా 66 ఓవర్లలో 256/5 స్కోరు చేసింది. మొత్తంగా 11 పరుగుల ఆధిక్యం సాధించింది. వెలుతురు మందగించడంతో 21 ఓవర్లు ముందుగానే ఆటను నిలిపివేశారు. ఎల్గర్‌తోపాటు జెన్సన్‌ (3) క్రీజులో ఉన్నాడు. ఎల్గర్‌, బెడింగ్‌హామ్‌ (56) నాలుగో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. బుమ్రా, సిరాజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

37 పరుగులు జోడించి..: తొలి సెషన్‌లో 8.4 ఓవర్లు ఆడిన భారత్‌ 37 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు చేజార్చుకొంది. ఓవర్‌నైట్‌ స్కోరు 70 పరుగుల వ్యక్తిగత స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన రాహుల్‌ తానే ఎక్కువగా స్ట్రయిక్‌ తీసుకొన్నా.. సిరాజ్‌ (5) కూడా సహకారం అందించాడు. రబాడ బౌలింగ్‌లో 4,6తో సెంచరీకి చేరువయ్యాడు. అయితే, 65వ ఓవర్‌ తొలి బంతికి సిరాజ్‌ (5)ను కొట్జీ క్యాచవుట్‌ చేయడంతో 9వ వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సఫారీ కీపర్‌ వెరీనె తప్పిదంతో అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకొన్న రాహుల్‌ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేశాడు. కానీ, ఆ వెంటన్‌ బర్గర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

తేలిపోయిన శార్దూల్‌, ప్రసిద్ధ్‌: బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై భారత పేసర్లు చెలరేగుతారనుకొంటే.. అంతా రివర్స్‌ అయింది. ఎల్గర్‌ ఎదురుదాడితో.. మన బౌలింగ్‌ గతితప్పింది. బుమ్రా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా.. శార్దూల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ ప్రభావం చూపలేక పోవడం పెద్దగా లోటుగా పరిణమించింది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (5)ను సిరాజ్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. కానీ, ఎల్గర్‌, జోర్జి (28) రెండో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. అయితే, జోర్జిని క్యాచవుట్‌ చేసిన బుమ్రా జట్టుకు అవసరమైన బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కీగన్‌ పీటర్సన్‌ (2)ను అద్భుతమైన బంతితో బౌల్డ్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 113/3తో నిలిచింది. ఈ దశలో ఎల్గర్‌కు అరంగేట్రం ఆటగాడు బెడింగ్‌హామ్‌ జత కలవడంతో స్కోరు వేగం మరింతగా పెరిగింది. మరోవైపు ఎల్గర్‌ కెరీర్‌లో 14వ శతకం పూర్తి చేసుకోవడంతో.. టీ సమయానికి సౌతాఫ్రికా 194/3తో మెరుగైన స్థితిలో నిలిచింది.

షార్ట్‌లెగ్‌లో రోహిత్‌..

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సహజంగా కొత్తగా వచ్చిన క్రికెటర్లను ఈ స్థానంలో ఎక్కువగా మోహరిస్తుంటారు. గిల్‌ లేదా జైస్వాల్‌కు ఆ స్థానం తగినది. కానీ, హిట్‌మ్యాన్‌ అక్కడ నిలబడడం మాత్రం కొత్తగా అనిపించింది.

వెల్‌డన్‌ రాహుల్‌..

కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి శతకం బాదిన రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘అద్భుతంగా ఆడావు. ఆలోచనల్లో స్పష్టత నన్ను ఎంతో ఆకట్టుకొంది. చక్కని ఫుట్‌వర్క్‌ కనబరిచావు. ఈ మ్యాచ్‌లో నీ శతకం కీలకంగా మారుతుంద’ని సచిన్‌ టెండూల్కర్‌ పోస్టు చేశాడు. సునీల్‌ గవాస్కర్‌ కూడా రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. భారత టెస్టు చరిత్రలో అత్యుత్తమ శతకాల్లో ఇది టాప్‌-10లో ఉంటుందన్నాడు. సెంచరీ చేరుకోవడానికి అతడు కొట్టిన భారీషాట్‌ను ఎంత పొగిడినా తక్కువేనని గవాస్కర్‌ ప్రశంసించాడు.

ఈ మైదానంలో రెండు టెస్ట్‌ శతకాలు బాదిన తొలి విదేశీ ఆటగాడిగా రాహుల్‌.

అన్ని ఫార్మాట్లలో వికెట్‌ కీపర్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీకిపైగా స్కోరు చేసిన తొలి క్రికెటర్‌గా రాహుల్‌. ఆసీ్‌సపై వన్డేల్లో 80 పరుగులు, టీ20ల్లో న్యూజిలాండ్‌పై 56 పరుగులు సాధించాడు.

సిరాజ్‌ బ్రేక్‌..: ఆఖరి సెషన్‌లో బెండింగ్‌హామ్‌ను సిరాజ్‌ బౌల్డ్‌ చేయడంతో.. సఫారీల జోరుకు టీమిండియా కొంత కళ్లెం వేసింది. బంతి మరింతగా పాతబడడంతో ఎల్గర్‌, డేవిడ్‌ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. అయితే, 5 పరుగుల తేడాతో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. బెడింగ్‌హామ్‌ను సిరాజ్‌ బౌల్డ్‌ చేయగా.. వెరీనె (4)ను ప్రసిద్ధ్‌ క్యాచవుట్‌ చేశాడు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 67.4 ఓవర్లలో 245 ఆలౌట్‌.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 5, ఎల్గర్‌ (బ్యాటింగ్‌) 140, జోర్జి (సి) జైస్వాల్‌ (బి) బుమ్రా 28, పీటర్సన్‌ (బి) బుమ్రా 2, బెడింగ్‌హామ్‌ (బి) సిరాజ్‌ 56, వెరీనె (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 4, జెన్సన్‌ (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 66 ఓవర్లలో 256/5; వికెట్ల పతనం: 1-11, 2-104, 3-113, 4-244, 5-249; బౌలింగ్‌: బుమ్రా 16-3-48-2, సిరాజ్‌ 15-0-63-2, శార్దూల్‌ 12-2-57-0, ప్రసిద్ధ్‌ 15-2-61-1, అశ్విన్‌ 8-3-19-0.

Updated Date - Dec 28 , 2023 | 03:59 AM