Share News

Test challenge : అమ్మాయిలకిక టెస్ట్‌ సవాల్‌

ABN , Publish Date - Dec 14 , 2023 | 06:04 AM

మూడు టీ20ల సిరీ్‌సలో తేలిపోయిన భారత మహిళలు ఇంగ్లండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్‌కు సిద్ధమయ్యారు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రత్యర్థిపై హర్మన్‌ప్రీత్‌ సేనకు మెరుగైన రికార్డు ఉండడం విశేషం. ఈనేపథ్యంలో నాలుగు రోజుల టెస్ట్‌లో స్పిన్‌ ప్రధాన

Test challenge :  అమ్మాయిలకిక టెస్ట్‌ సవాల్‌

ఇంగ్లండ్‌తో భారత్‌ ఏకైక టెస్ట్‌

నేటినుంచి ఉదయం 9.30 నుంచి

స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో..

నవీ ముంబై: మూడు టీ20ల సిరీ్‌సలో తేలిపోయిన భారత మహిళలు ఇంగ్లండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్‌కు సిద్ధమయ్యారు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రత్యర్థిపై హర్మన్‌ప్రీత్‌ సేనకు మెరుగైన రికార్డు ఉండడం విశేషం. ఈనేపథ్యంలో నాలుగు రోజుల టెస్ట్‌లో స్పిన్‌ ప్రధాన ఆయుధంగా ప్రత్యర్థిపై తన ఆధిక్యాన్ని కొనసాగించాలని భారత్‌ భావిస్తోంది. 1986లో ఇరు జట్ల మధ్య టెస్ట్‌లు మొదలయ్యాక..భారత్‌-ఇంగ్లండ్‌ 14 మ్యాచ్‌లు ఆడాయి. వీటిల్లో రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించిన టీమిండియా 11 డ్రా చేసుకొని, ఒక్క మ్యాచ్‌ ఓడింది. టెస్ట్‌ల్లో జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హర్మన్‌కు ప్రత్యర్థిపై గత రికార్డు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే. ఇక..చివరిసారి ఇరు జట్లు 2021 జూన్‌లో బ్రిస్టల్‌ వేదికగా టెస్ట్‌లో తలపడ్డాయి. డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్‌లో మంధాన మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేయగా, షఫాలీ వర్మ వరుసగా 96, 63 రన్స్‌తో సత్తా చాటింది. కాగా..టీమిండియా ఆఖరి టెస్ట్‌ను 2021 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో ఆడింది. ఆ మ్యాచ్‌ను భారత్‌ డ్రా చేసుకుంది. మరోవైపు గత జూన్‌లోనే టెస్ట్‌ మ్యాచ్‌ ఆడి ఉండడం ఇంగ్లండ్‌కు సానుకూలాంశం. బెంగాల్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సైకా ఇషాక్‌ రాకతో జట్టు స్పిన్‌ విభాగం బలోపేతమైంది. అయితే సీనియర్లు స్నేహ్‌ రాణా, దీప్తీ శర్మ ఉండడంతో..సైకాకు తుది 11 మందిలో చాన్స్‌ దక్కడం కష్టమే. బ్యాటర్లలో జెమీమా, హర్లీన్‌ డియోల్‌ టెస్ట్‌ అరంగేట్రం చేయాల్సి ఉంది. రిచా ఘోష్‌కు బదులు ఒక్క టెస్ట్‌ ఆడిన కీపర్‌ యాస్తికా భాటియాపై జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశముంది. టీ20 సిరీ్‌సలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన రేణుకా సింగ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఇకపోతే సీనియర్‌ నాట్‌ స్కివర్‌ బ్రంట్‌, నైట్‌, డానీ వయట్‌, కేట్‌ క్రాస్‌, ఎకెల్‌స్టోన్‌పై ఇంగ్లండ్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

జట్లు

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌కెప్టెన్‌), జెమీమా, షఫాలీ, దీప్త్తీశర్మ, యాస్తిక/రిచా (కీపర్‌), స్నేహ్‌ రాణా, సుభా సతీష్‌, హర్లీన్‌, ఇషాక్‌, రేణుకా సింగ్‌, టిటాస్‌ సాధు, మేఘనా సింగ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూజా వస్త్రాకర్‌

ఇంగ్లండ్‌: హీథర్‌ నైట్‌ (కెప్టెన్‌), బ్యూమాంట్‌, లారెన్‌ బెల్‌, అలైస్‌ క్యాప్సీ, కేటె క్రాస్‌, చార్లీ డీన్‌, సోఫియా డంక్లీ, ఎకెల్‌స్టోన్‌, లారెన్‌ ఫిలెర్‌, బెస్‌ హీత్‌/అమీ జోన్స్‌ (కీపర్‌), బ్రంట్‌, వయట్‌.

Updated Date - Dec 14 , 2023 | 06:04 AM