స్వియటెక్ సులువుగా..
ABN , First Publish Date - 2023-06-04T02:57:47+05:30 IST
రొలాండ్ గారోస్ పురుషులు, మహిళల బరిలో మిగిలిన సీడెడ్‌లు ముందంజ వేశారు. పురుషుల నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్,
ఫ్రెంచ్ ఓపెన్
● చెమటోడ్చి నెగ్గిన గాఫ్
● అనారోగ్యంతో వైదొలగిన రిబకినా
పారిస్: రొలాండ్ గారోస్ పురుషులు, మహిళల బరిలో మిగిలిన సీడెడ్‌లు ముందంజ వేశారు. పురుషుల నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్, ఆరో సీడ్ రూన్, టాప్ సీడ్ అల్కారజ్, ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగో రౌండ్‌కు చేరారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియటెక్ మూడో రౌండ్‌ను సునాయాసంగా అధిగమించగా, టీనేజర్ కొకా గాఫ్ మాత్రం మూడు సెట్లు పోరాడాల్సి వచ్చింది. ఇక వింబుల్డన్ చాంపియన్ రిబకినా అస్వస్థతతో వైదొలగింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో నిరుటి రన్నరప్ రూడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4 స్కోరుతో జాంగ్ జిజెన్ (చైనా)పై గెలుపొందాడు. ఆరో సీడ్ రూన్ (డెన్మార్క్) 6–4, 6–1, 6–3 స్కోరుతో అల్బెర్టో (అర్జెంటీనా)పై, 27వ సీడ్ నిషియోక (జపాన్) 3–6, 7–6 (8), 2–6, 6–4, 6–0 స్కోరు తో థియాగో వైల్డ్ (బ్రెజిల్)పై గెలుపొంది ప్రీక్వార్టర్‌ఫైనల్ చేరారు. అయితే 15వ సీడ్ కోరిక్ (క్రొయేషియా) 3–6, 6–7 (7), 2–6 స్కోరుతో మార్టిన్ (అర్జెంటీనా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఇద్దరు టీనేజర్లు నడుమ జరిగిన మూడో రౌండ్ పోరులో ఆరో సీడ్ గాఫ్ (అమెరికా) 6–7 (5), 6–1, 6–1 స్కోరుతో 19 ఏళ్ల ఆండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ స్వియటెక్ (పోలెండ్) 6–0, 6–0 స్కోరుతో జిన్యూ (చైనా)ను చిత్తు చేసి ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. నాలుగో సీడ్ రిబకినా (కజకిస్థాన్)..సారా సోరిబ్స్ (స్పెయిన్)తో మూడో రౌండ్ మ్యాచ్‌కు ముందు వైదొలగింది. జ్వరం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిబకినా వివరించింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో రౌండ్‌లో టాప్ సీడ్ అల్కారజ్ (స్పెయిన్) 6–1, 6–4, 6–2 స్కోరుతో షపోవలోవ్ (కెనడా)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–2, 6–2, 6–3 స్కోరుతో ష్వార్జ్‌మన్ (అర్జెంటీనా)పై సునాయాసంగా గెలుపొంది ముందంజ వేశారు.