Suyash : సుయాశ్‌ ‘ఇంపాక్ట్‌’!

ABN , First Publish Date - 2023-04-08T03:20:27+05:30 IST

ఈసారి ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. అయితే గురువారం కోల్‌కతా-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ముందు వరకు పలువురు ఆటగాళ్లు ‘ఇంపాక్ట్‌’ రూపంలో బరిలో దిగారు. వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ కోల్‌కతా తరపున మైదానంలోకి వచ్చిన..

Suyash : సుయాశ్‌ ‘ఇంపాక్ట్‌’!

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈసారి ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. అయితే గురువారం కోల్‌కతా-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ముందు వరకు పలువురు ఆటగాళ్లు ‘ఇంపాక్ట్‌’ రూపంలో బరిలో దిగారు. వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ కోల్‌కతా తరపున మైదానంలోకి వచ్చిన 19 ఏళ్ల లెగ్‌స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ మాత్రం తనదైన ‘ఇంపాక్ట్‌’ వేశాడు. కీలకమైన దినేశ్‌ కార్తీక్‌తోపాటు అనూజ్‌ రావత్‌, ఆల్‌రౌండర్‌ కర్ణ్‌ శర్మ వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ ‘తొలి’ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. దాంతో సుయాశ్‌పై ఒక్కసారి అందరి దృష్టి నిలిచింది. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న యువ క్రికెటర్లలో దాదాపు అంతా రంజీలు, హజారే, ముస్తాక్‌ అలీ టోర్నీలలో సత్తా చాటిన వారే. కానీ ఒక్కటంటే ఒక్క దేశవాళీ పోటీ ఆడకుండా ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడం సుయాశ్‌ ప్రతిభకు తార్కా ణం. ఢిల్లీలోని భజన్‌పురాకు చెందిన సుయాశ్‌ది సామాన్య కుటుంబం. సాధారణంగా ఢిల్లీ క్రికెట్‌లో ఏదేని క్రికెట్‌ క్లబ్‌ల ప్రముఖుల అండ లేకుండా ఆయా వయస్సు గ్రూపుల జట్లలో స్థానం లభించడం దుర్లభం. అలాంటిది సుయాశ్‌ ఏకంగా ఐపీఎల్‌ స్థాయికి ఎదగడం అతడి సత్తాకు నిదర్శనం. ఢిల్లీ మాజీ స్పిన్నర్‌ సురేశ్‌ బాత్రా వద్ద బౌలింగ్‌ ఓనమాలు నేర్చుకున్న సుయాశ్‌..ఆయన క్లబ్‌కే తొలుత ఆడాడు. కొవిడ్‌తో సురేశ్‌ మరణించడంతో సుయాశ్‌ కెరీర్‌ అయోమయంలో పడింది. అప్పుడు కోచ్‌ రణ్‌ధీర్‌ సింగ్‌ మద్రాస్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున డీడీసీఏ లీగ్‌ల్లో సుయాశ్‌కు ఆడే అవకాశాలు కల్పించాడు. మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌, ప్రస్తుత స్టార్‌ స్పిన్నర్‌ చాహల్‌ మద్రాస్‌ క్లబ్‌ తురుపు ముక్కలే కావడం విశేషం.

తండ్రికి క్యాన్సర్‌ సోకడంతో..: గతేడాది సుయాశ్‌కు పరీక్షగా నిలిచింది. తండ్రి క్యాన్సర్‌ బారినపడ్డాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రం కావడంతో తండ్రికి మెరుగైన చికిత్స అందించడం సుయాశ్‌కు తలకు మించిన భారమైంది. దాంతో సుయాశ్‌ పడిన వేదన అంతా ఇంతా కాదు. కానీ ఢిల్లీ మాజీ స్పిన్నర్‌, ప్రస్తుత ముంబై ఇండియన్స్‌ ప్రతిభాన్వేషణ మేనేజర్‌ రాహుల్‌ సంఘ్వీ.. సుయాశ్‌కు అండగా నిలిచాడు. అతడి తండ్రికి ముంబైలో క్యాన్సర్‌ చికిత్సకు తోడ్పడడంతోపాటు ముంబై ఇండియన్స్‌ ట్రయల్స్‌లో సుయాశ్‌కు చాన్సిచ్చాడు. మరోవైపు డీడీసీఏ టోర్నీల్లో సత్తా చాటిన సుయాశ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సెలెక్షన్స్‌కు పిలుపొచ్చింది. బౌలింగ్‌ యాక్షన్‌లో ఎలాంటి మార్పు లేకుండా వేగంగా లెగ్‌బ్రేక్‌లను, గూగ్లీలను సంధించే సుయాశ్‌ నైపుణ్యానికి కోల్‌కతా కోచింగ్‌ సిబ్బందిలో ప్రముఖుడు అభిషేక్‌ నాయర్‌ ఫిదా అయ్యాడు. అలా.. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టులోకి అడుగుపెట్టిన సుయాశ్‌.. తొలి మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. ఇక, అతను టోర్నీలో మరెన్ని మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.

Updated Date - 2023-04-08T03:20:27+05:30 IST