Sunrisers: వావ్‌.. రైజర్స్‌

ABN , First Publish Date - 2023-05-08T03:27:55+05:30 IST

వాట్‌ ఎ మ్యాచ్‌.. చివరి మూడు ఓవర్లలో ఎన్ని మలుపులో.. అప్పటి వరకు మ్యాచ్‌ను వీక్షిస్తున్న అభిమానులకే కాదు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిబిరంలోనూ గెలుపుపై నమ్మకం లేదేమో.

Sunrisers: వావ్‌.. రైజర్స్‌

మలుపు తిప్పిన ఫిలిప్స్‌

బట్లర్‌ ప్రదర్శన వృధా

ఆఖరి బంతికి రాజస్థాన్‌పై విజయం

జైపూర్‌: వాట్‌ ఎ మ్యాచ్‌.. చివరి మూడు ఓవర్లలో ఎన్ని మలుపులో.. అప్పటి వరకు మ్యాచ్‌ను వీక్షిస్తున్న అభిమానులకే కాదు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిబిరంలోనూ గెలుపుపై నమ్మకం లేదేమో. ఎందుకంటే.. 12 బంతుల్లో 41 పరుగులు కావాల్సిన వేళ.. 19వ ఓవర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (7 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 25) 6,6,6,4 కొట్టడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. అదే ఓవర్‌లో గ్లెన్‌ అవుటైనా ఆఖరి ఓవర్‌ మరింత రంజుగా మారింది. ఆఖరి బంతికి ఐదు రన్స్‌ రావాల్సి ఉండగా మొదట సమద్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. కానీ ఆ బంతి నోబ్‌గా తేలడంతో 4 పరుగులే అవసరమయ్యాయి. ఇక, ఆఖర్లో పేసర్‌ సందీప్‌ యార్కర్‌కు ప్రయత్నించినా సమద్‌ (17 నాటౌట్‌) ఆ బంతిని సిక్సర్‌గా మలిచి రైజర్స్‌కు అనూహ్య విజయం అందించాడు.

ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో గెలుపు ఖాయమనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో ఓడింది. ముందుగా రాజస్థాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. బట్లర్‌ (59 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 95) తృటిలో శతకం కోల్పోగా.. సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 నాటౌట్‌), యశస్వీ జైస్వాల్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35) వేగంగా ఆడారు. ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్‌ శర్మ (55), రాహుల్‌ త్రిపాఠి (47) రాణించారు. చాహల్‌కు 4 వికెట్లు దక్కాయి. ఈ వేదికపై ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు, ఛేదన. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫిలిప్స్‌ నిలిచాడు.

ఆఖర్లో అదుర్స్‌:

భారీ ఛేదనను రైజర్స్‌ ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించింది. కానీ మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ ఛేదనలో వెనుకబడి పోయింది. అయితే 19వ ఓవర్‌లో ఫిలిప్స్‌ మ్యాచ్‌ను టర్న్‌ చేయడం కలిసివచ్చింది. ఆరంభంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అన్మోల్‌ప్రీత్‌ (33), అభిషేక్‌ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించగా, పవర్‌ప్లే అనంతరం ఆటలో వేగం తగ్గింది. మధ్య ఓవర్లలో ఆర్‌ఆర్‌ స్పిన్నర్టు కట్టుదిట్టం చేశారు. ఈ దశలో త్రిపాఠితో కలిసి అభిషేక్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. పదో ఓవర్‌లో త్రిపాఠి సిక్స్‌, అభిషేక్‌ 4తో 14 రన్స్‌ వచ్చాయి. సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్‌ మరుసటి బంతికే అశ్విన్‌ చేతిలో అవుటయ్యాడు. అయితే 14వ ఓవర్‌లో త్రిపాఠి 6,4.. క్లాసెన్‌ (26) 6తో 19 రన్స్‌ రాబట్టి విజయంపై ఆశలు రేపారు. కానీ చాహల్‌ 16వ ఓవర్‌లో క్లాసెన్‌ను.. 18వ ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి త్రిపాఠి, కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (6)లను పెవిలియన్‌కు చేర్చడంతో రైజర్స్‌కు షాక్‌ తగిలింది.

అయితే రెండు ఓవర్లలో 41 పరుగులు కావాల్సి ఉండగా ఫిలిప్స్‌ రాయల్స్‌ వెన్నులో వణుకు పుట్టించాడు. పేసర్‌ కుల్దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వరుసగా 6,6,6,4 బాదిన అతను మ్యాచ్‌ను త్వరగానే ముగిస్తాడనిపించింది. అయితే ఐదో బంతిని హెట్‌మయెర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకోవడంతో ఆర్‌ఆర్‌ ఊపిరిపీల్చుకుంది. అయితే ఈ ఓవర్‌లో 24 పరుగులు రాగా, గెలుపు సమీకరణం 17కి మారింది. తొలి బంతికే సమద్‌ ఇచ్చిన క్యాచ్‌ను మెకాయ్‌ వదిలేయగా.. రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతి నోబ్‌గా మారడం రైజర్స్‌కు వరమైంది. ఇదే అదనుగా సమద్‌ సిక్స్‌ బాది గెలుపందించాడు.

సెంచరీ భాగస్వామ్యం:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. టాపార్డర్‌ అదరగొట్టడంతో భారీస్కోరు సాధించింది. ఆరంభంలో ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ తన సహజశైలిలో చెలరేగగా.. ఆ తర్వాత బట్లర్‌-శాంసన్‌ జోడీ శతక భాగస్వామ్యం అందించింది. తొలి బంతినే ఫోర్‌గా మలిచిన యశస్వీ.. నాలుగో ఓవర్‌లో 4,6తో జోరు చూపాడు. తర్వాతి ఓవర్‌లోనూ 2 వరుస ఫోర్లు బాదిన జైస్వాల్‌ను జాన్సెన్‌ అవుట్‌ చేశాడు. తర్వాత శాంసన్‌ వచ్చీ రాగానే బాదుడు ఆరంభించి బట్లర్‌పై ఒత్తిడి తగ్గించాడు. దీంతో ట్రాక్‌లోకి వచ్చిన బట్లర్‌ ఇక వెనుదిరిగి చూడలేదు. పవర్‌ప్లేలో 61 రన్స్‌ సాధించిన ఆర్‌ఆర్‌ స్కోరుబోర్డులో బట్లర్‌ జోరుతో మరింత వేగం పెరిగింది. తొమ్మిదో ఓవర్‌లో సంజూ రెండు సిక్సర్లు, బట్లర్‌ మరో సిక్సర్‌తో జట్టు 21 పరుగులు రాబట్టింది. పదో ఓవర్‌లో బట్లర్‌ 6,4తో 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ 18వ ఓవర్‌లో నటరాజన్‌ 5 పరుగులే ఇవ్వగా.. అదే ఓవర్‌లో శాంసన్‌ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక లీగ్‌లో ఆరో సెంచరీకి కేవలం ఐదు పరుగుల దూరంలో భువీ సూపర్‌ యార్కర్‌కు బట్లర్‌ ఎల్బీ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్‌లో శాంసన్‌ 4,6,4తో చెలరేగడంతో 17 రన్స్‌ రాగా రాజస్థాన్‌ స్కోరు 200 దాటేసింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌ రాయల్స్‌:

జైస్వాల్‌ (సి) నటరాజన్‌ (బి) జాన్సెన్‌ 35, బట్లర్‌ (ఎల్బీ) భువనేశ్వర్‌ 95, శాంసన్‌ (నాటౌట్‌) 66, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 214/2; వికెట్ల పతనం: 1-54, 2-192; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-44-1, జాన్సెన్‌ 4-0-44-1, నటరాజన్‌ 4-0-36-0, మార్కండే 4-0-51-0, అభిషేక్‌ శర్మ 2-0-15-0, వివ్రాంత్‌ వర్మ 2-0-18-0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

అన్మోల్‌ప్రీత్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) చాహల్‌ 33, అభిషేక్‌ (సి) చాహల్‌ (బి) రవిచంద్రన్‌ అశ్విన్‌ 55, త్రిపాఠి (సి) జైస్వాల్‌ (బి) చాహల్‌ 47, క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) చాహల్‌ 26, మార్‌క్రమ్‌ (ఎల్బీ) చాహల్‌ 6, గ్లెన్‌ ఫిలిప్స్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) కుల్దీప్‌ 25, అబ్దుల్‌ సమద్‌ (నాటౌట్‌) 17, జాన్సెన్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 217/6; వికెట్ల పతనం: 1-51, 2-116, 3-157, 4-171, 5-174, 6-196; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-48-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-50-1, రవిచంద్రన్‌ అశ్విన్‌ 4-0-35-1, చాహల్‌ 4-0-29-4, మురుగన్‌ అశ్విన్‌ 3-0-42-0, మెకాయ్‌ 1-0-13-0.

Updated Date - 2023-05-08T03:27:55+05:30 IST