సర్ఫరాజ్‌కు మొండిచేయి.. అందుకేనా?

ABN , First Publish Date - 2023-06-26T00:37:43+05:30 IST

వెస్టిండీస్‌ టూర్‌కు చటేశ్వర్‌ పుజార, ఉమేష్‌ యాదవ్‌లపై వేటువేసిన సెలెక్టర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వీ జైస్వాల్‌కు భారత జట్టులో చోటుకల్పించారు. అయితే, గత కొంత కాలంగా రంజీ క్రికెట్‌లో అదరగొడుతూ జాతీయ జట్టులో చోటు కోసం

సర్ఫరాజ్‌కు మొండిచేయి.. అందుకేనా?

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ టూర్‌కు చటేశ్వర్‌ పుజార, ఉమేష్‌ యాదవ్‌లపై వేటువేసిన సెలెక్టర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వీ జైస్వాల్‌కు భారత జట్టులో చోటుకల్పించారు. అయితే, గత కొంత కాలంగా రంజీ క్రికెట్‌లో అదరగొడుతూ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (25)కు సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. దీంతో మాజీ బ్యాటర్‌ సునీల్‌ గవాస్కర్‌ జట్టు ఎంపిక తీరును ఘాటుగానే విమర్శించాడు. అయితే, సర్ఫరాజ్‌ను పక్కనపెట్టడానికి కారణాలు వేరే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేంత ఫిట్‌నె్‌సతోపాటు మైదానం వెలుపల సర్ఫరాజ్‌ నడత అతడి ఎంపికపై ప్రభావం చూపించి ఉంటుందని బోర్డు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గత మూడు రంజీ సీజన్లలో ముంబై తరఫున సర్ఫరాజ్‌ 2566 పరుగులు సాధించాడు. కెరీర్‌లో 37 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 79.65 సగటు నమోదు చేశాడు. కానీ, రెండుసార్లు అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆడిన అతడిని పక్కనపెట్టి.. కెరీర్‌లో 42.19 సగటు కలిగిన రుతురాజ్‌ను టీమిండియాకు ఎంపిక చేయడం కొందరికి మింగుడుపడడం లేదు. ‘విమర్శలను అర్థం చేసుకోగలం. కానీ, సర్ఫరాజ్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనేదానికి కారణాలున్నాయి. అయితే, అవి అతడిని ఆటతో సంబంధం లేనివి. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరదపారిస్తున్న ఆటగాడిని విస్మరించడానికి సెలెక్టర్లు ఏమైనా తెలివి తక్కువవారా?’ అని ఆ అధికారి ప్రశ్నించారు. అతడి ఫిట్‌నెస్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేస్థాయిలో లేదదన్నది ప్రధాన కారణమని తెలిపారు. ‘ఫిట్‌నె్‌సపై అతడు ఎంతో శ్రమించాలి. బరువు తగ్గి.. అథ్లెట్‌ తరహాలో కనిపించాలి. బ్యాటింగ్‌ ఫిట్‌నెస్‌ ఒక్కటే ఎంపికకు ప్రమాణం కాదు. అంతేకాకుండా అతడి నడత.. మైదానం లోపల, బయట హుందాగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. కొన్ని సమయాల్లో అతడు చేసిన సంజ్ఞలు, హావభావాలను కచ్చితంగా గమనించారని చెప్పారు. సర్ఫరాజ్‌కు క్రమశిక్షణ తక్కువనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాలపై సర్ఫరాజ్‌, అతడి తండ్రి, కోచ్‌ నౌషాద్‌ ఖాన్‌ దృష్టిసారించాలని సూచించారు. ఈ ఏడాది ఢిల్లీతో రంజీ మ్యాచ్‌లో శతకం బాదిన అనంతరం అతడు సంబరాలు చేసుకొన్న తీరు మ్యాచ్‌ చూస్తున్న సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మకు అతిగా అనిపించిందని సమాచారం. 2022 రంజీ ఫైనల్లో అతడి ప్రవర్తన ప్రముఖ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ను సైతం చికాకుపరిచిందట. అలాగే ఐపీఎల్‌ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకొని ఉంటే మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారికి అసలు అవకాశాలు దక్కి ఉండేవా? అని ఎదురు ప్రశ్నించారు. మొత్తంగా మిడిలార్డర్‌లో రహానె విఫలమైతే గైక్వాడ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంతో కాలం జట్టుకు దూరంగా ఉంచలేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకొని శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టులోకి పునరాగమనం చేస్తే.. సర్ఫరాజ్‌కు జట్టులో చోటు లభించడం కష్టమే..! కాగా, సర్ఫరాజ్‌ గురించి తెలిసిన వారు మాత్రం అధికారి చెప్పిన దానితో విభేదిస్తున్నారు. ఎన్‌సీఏలో ఇటీవలే నిర్వహించిన యో-యో టెస్ట్‌లో అతడు 16.5 స్కోరు చేశాడని తెలిపారు. చిన్ననాటి నుంచి చంద్రకాంత్‌ అతడిని చూస్తూనే ఉన్నాడని.. ఆయన ఏదో అసహనం వ్యక్తం చేశారనడం కట్టుకేథనని చెప్పారు.

సెలెక్టర్లకు కౌంటర్‌?

టీమిండియాకు తనను ఎంపిక చేయక పోవడంపై సర్ఫరాజ్‌ మౌనం వీడాడు. తన ప్రదర్శనకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్టు చేసి సెలెక్టర్లకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తన కెరీర్‌లో 37 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 79.65 సగటుతో 3505 పరుగులు స్కోరు చేశాడు. వాటిల్లో 13 శతకాలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 301 పరుగులు సాధించాడు.

Updated Date - 2023-06-26T00:37:43+05:30 IST