శ్రేయాంక, ఇషాక్ తిప్పేశారు
ABN , First Publish Date - 2023-12-11T04:45:18+05:30 IST
ఇంగ్లండ్ మహిళలతో ఆఖరి టీ20లో భారత్ సమష్టి ప్రదర్శన చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో ప్రత్యర్థిని ఓడించి ఊరట విజయం దక్కించుకుంది...
ఆఖరి టీ20లో భారత్ విజయం
మెరిసిన మంధాన
5 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
ముంబై: ఇంగ్లండ్ మహిళలతో ఆఖరి టీ20లో భారత్ సమష్టి ప్రదర్శన చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో ప్రత్యర్థిని ఓడించి ఊరట విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. హెథర్ నైట్ (52) హాఫ్ సెంచరీ చేయగా, అమీ జోన్స్ (25), చార్లీ డీన్ (16 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (4-0-19-3), సైకా ఇషాక్ (4-0-22-3) చెరో మూడు వికెట్లు, రేణుకా సింగ్ (2/23), అమన్ జోత్ కౌర్ (2/25) రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 130/5 స్కోరు చేసి గెలిచింది. స్మృతి మంధాన (48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) ధాటిగా ఆడగా, జెమీమా రోడ్రిగ్స్ (29) పర్లేదనిపించింది. చివర్లో అమన్‌జోత్ కౌర్ (4 బంతుల్లో 3 ఫోర్లతో 13 నాటౌట్) మెరిసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శ్రేయాంక, ప్లేయర్ ఆఫ్ ది సిరీ్‌సగా బ్రంట్ నిలిచారు. తొలి రెండు టీ20ల్లో నెగ్గిన ఇంగ్లండ్ ఇంతకుముందే సిరీ్‌సను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తడబాటుకు లోనైనా..: మోస్తరు లక్ష్య ఛేదనలో షఫాలీ (6) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా..జెమీమా, మంధాన దూకుడుగా ఆడారు. దీంతో పవర్ ప్లేను భారత్ 31/1తో ముగించింది. ఇక, 55 బంతుల్లోనే 57 పరుగులు జోడించి పురోగమిస్తున్న ఈ జోడీని 12వ ఓవర్లో రోడ్రిగ్స్‌ను ఎల్బీచేయడం ద్వారా డీన్ విడదీసింది. ఆపై దీప్తి శర్మ (12), అర్ధ శతకానికి చేరువైన మంధాన, రిచా ఘోష్ (2) వెంటవెంటనే నిష్క్రమించడంతో భారత్ ఒత్తిడిలో పడింది. కానీ ఎకిల్‌స్టోన్ వేసిన 19వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అమన్‌జోత్ జట్టును విజయ తీరాలకు చేర్చింది.
నైట్ కెప్టెన్ ఇన్నింగ్స్: టాస్ కోల్పోయి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ మూడో బంతికే బోల్తా కొట్టిస్తూ మయా బౌచియర్ (0)ను రేణుక క్లీన్‌బౌల్డ్ చేసింది. మరో ఓపెనర్ డంక్లీ.. సాధు ఓవర్లో 6,4తో కదం తొక్కి 16 రన్స్ రాబట్టింది. అయితే తన రెండో ఓవర్లో డంక్లీ (11)ని రేణుక, ఆరో ఓవర్లో క్యాప్సీ(7)ని స్పిన్నర్ సైకా ఇషాక్ పెవిలియన్ చేర్చింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 26/3. ఈ దశలో కెప్టెన్ నైట్, అమీ జోన్స్ నాలుగో వికెట్‌కు 41 రన్స్‌తో జట్టును ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీలో..జోన్స్‌ను అవుట్ చేసి ఇషాక్ మరోసారి భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. తదుపరి బంతికే గిబ్సన్ (0)నూ క్లీన్‌బౌల్డ్ చేసింది. 13వ ఓవర్లో హీత్ (1), కెంప్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసిన స్పిన్నర్ శ్రేయాంక..15వ ఓవర్లో ఎకిల్‌స్టోన్ (2)ను బౌల్డ్ చేయడంతో 76/8తో ఇంగ్లండ్ మరింత ఇక్కట్లలో పడింది. ఈ దశలో నైట్, చార్లీ డీన్ కలిసి స్కోరుబోర్డును నడిపించారు. అమన్‌జోత్ వేసిన చివరి ఓవర్లో నైట్ 6,6తో బ్యాట్ ఝళిపించడంతోపాటు హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసింది. ఐదో బంతికి నైట్ అవుటవడంతో 50 పరుగుల తొమ్మిదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి బంతికి మహికా గౌర్‌ను కూడా పెవిలియన్ చేర్చడం ద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు అమన్‌జోత్ తెరదించింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 126 ఆలౌట్ (హెథర్ నైట్ 52, అమీ జోన్స్ 25, శ్రేయాంక 3/19, సైకా ఇషాక్ 3/22, రేణుక 2/23, అమన్‌జోత్ కౌర్ 2/25); భారత్: 19 ఓవర్లలో 130/5 (స్మృతీ మంధాన 48, జెమీమా 29, అమన్‌జోత్ 13 నాటౌట్, కెంప్ 2/24, ఎకెల్‌స్టోన్ 2/43).