Sharjah Masters Chess Tournament: ‘షార్జా’ సుల్తాన్‌..అర్జున్‌

ABN , First Publish Date - 2023-05-26T04:46:10+05:30 IST

ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తులతో మరోసారి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌ మాయ చేశాడు. షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభంలో వెనుకంజలో నిలిచిన ఈ వరంగల్‌ కుర్రాడు..

Sharjah Masters Chess Tournament: ‘షార్జా’ సుల్తాన్‌..అర్జున్‌

షార్జా: ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తులతో మరోసారి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌ మాయ చేశాడు. షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభంలో వెనుకంజలో నిలిచిన ఈ వరంగల్‌ కుర్రాడు.. ఆ తర్వాత ఒక్కొక్క ఎత్తు వేసుకుంటూ టైటిల్‌కు చేరవయ్యాడు. మొత్తానికి గురువారం ముగిసిన ఆఖరి రౌండ్‌లో అర్జున్‌ ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ యాకుబ్బోవ్‌ నోడిర్బెక్‌తో తలపడిన అర్జున్‌ 27 ఎత్తుల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి గెలుపొందాడు.

ఈ విజయంతో ఓవరాల్‌గా అర్జున్‌ 6.5 పాయింట్లు సాధించి టోర్నీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక, ముందురోజు వరకు ఆధిక్యంలో కొనసాగిన తమిళనాడు జీఎం గుకేష్‌, అర్జున్‌ దెబ్బకి ఆరు పాయింట్లతో ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. మరో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరత్‌కోటి 3.5 పాయింట్లతో 65వ స్థానంలో నిలిచి నిరాశపర్చాడు. గతంలో త్రుటిలో షార్జా మాస్టర్స్‌ టైటిల్‌ను చేజార్చుకున్న అర్జున్‌.. ఈసారి లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. ఇక, అర్జున్‌ శనివారం నుంచి జరిగే దుబాయ్‌ చాంపియన్‌షిప్‌లో పోటీ పడనున్నాడు.

Updated Date - 2023-05-26T04:46:16+05:30 IST