Share News

Khel Ratna : ‘ఖేల్‌రత్న’కు సాత్విక్‌!

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:55 AM

ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌

Khel Ratna : ‘ఖేల్‌రత్న’కు సాత్విక్‌!

చిరాగ్‌ జోడీగా అత్యుత్తమ క్రీడా పురస్కారానికి నామినేట్‌

‘అర్జున’ జాబితాలో తెలుగు ఆటగాళ్లు హుస్సామ్‌, అజయ్‌

క్రికెటర్‌ షమి కూడా..

న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నకు ఎంపికైనట్టు తెలిసింది. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం ఖేల్‌రత్నకు తెలుగు కుర్రాడు సాత్విక్‌, ముంబై షట్లర్‌ చిరాగ్‌ పేర్లను క్రీడా అవార్డుల కమిటీ ప్రతిపాదించింది. కాగా నిజామాబాద్‌ బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, భారత అంధుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, గుంటూరు జిల్లాకు చెందిన అజయ్‌ కుమార్‌ రెడ్డి రెండో అత్యున్నత క్రీడా అవార్డు అర్జునకు ఎంపికయ్యారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచక్‌పలో అమోఘమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమిని కూడా అర్జునకు నామినేట్‌ చేసినట్టు సమాచారం. వాస్తవానికి అర్జున జాబితాలో ముందుగా షమి పేరు లేకున్నా.. బీసీసీఐ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పేసర్‌ను పరిగణనలోకి తీసుకున్నారట. చెస్‌ క్రీడాకారిణి ఆర్‌. వైశాలి, పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి, ఆర్చర్‌ అదితీ గోపీచంద్‌ సహా మొత్తం 18 మంది క్రీడాకారులను అర్జున పురస్కారానికి నామినేట్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. అవార్డులకు ఎంపికైన వారి జాబితాను కేంద్ర క్రీడాశాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Updated Date - Dec 14 , 2023 | 05:55 AM