శాంసన్ మెరిసెన్
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:31 AM
జాతీయ జట్టులో నిలకడగా చోటు దక్కించుకోలేకపోతున్న సంజూ శాంసన్ (114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108) ఎట్టకేలకు తన సత్తా చాటుకున్నాడు. పరుగులు కష్టంగా మారిన పిచ్‌పై...
కెరీర్‌లో తొలి శతకం
2-1తో భారత్‌దే సిరీస్
అర్ష్‌దీప్ సింగ్‌కు నాలుగు వికెట్లు
ఆఖరి వన్డేలో సఫారీలు చిత్తు
పార్ల్: జాతీయ జట్టులో నిలకడగా చోటు దక్కించుకోలేకపోతున్న సంజూ శాంసన్ (114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108) ఎట్టకేలకు తన సత్తా చాటుకున్నాడు. పరుగులు కష్టంగా మారిన పిచ్‌పై అసాధారణ ఆటతీరుతో కెరీర్‌లో తొలి శతకం అందుకున్నాడు. అటు పేసర్లు, స్పిన్నర్లు కూడా కదం తొక్కడంతో గురువారం జరిగిన సిరీస్ నిర్ణాయక మూడో వన్డేలో టీమిండియా 78 రన్స్‌తో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీ్‌సను 2-1తో నెగ్గింది. సౌతాఫ్రికాలో భారత్‌కిది రెండో సిరీస్ మాత్రమే. ముందుగా భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. తిలక్ వర్మ (77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. డెత్ ఓవర్లలో రింకూ సింగ్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) చెలరేగాడు. బ్యూరన్ హెన్‌డ్రిక్స్‌కు 3, బర్గర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో అర్ష్‌దీప్ (4/30) ధాటికి దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ టోనీ డి జోర్జి (81), మార్‌క్రమ్ (36) మాత్రమే ఆకట్టుకున్నారు. అవేశ్, సుందర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శాంసన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా అర్ష్‌దీప్ నిలిచారు.
బౌలర్ల హవా: భారీ ఛేదనలో సఫారీలు తడబడ్డారు. ఓపెనర్ జోర్జి, కెప్టెన్ మార్‌క్రమ్ క్రీజులో ఉన్నంత సేపు ఆతిథ్య జట్టు ఛేదన వైపు సాగుతున్నట్టే కనిపించింది. కానీ పేస్, స్పిన్ బంతులకు మధ్య ఓవర్లలో ఆతిథ్య జట్టు బ్యాటర్లు బ్యాట్లెత్తేశారు. ఆరంభంలో మరో ఓపెనర్ రీజా హెన్‌డ్రిక్స్ (19)తో జోర్జి తొలి వికెట్‌కు 59 పరుగులు అందించాడు. డుస్సెన్ (2) అవుటయ్యాక జోర్జికి మార్‌క్రమ్ సహకారం అందించాడు. దీంతో ఈ జోడీ అడపాదడపా బౌండరీలతో జోరు ప్రదర్శించింది. కానీ 26వ ఓవర్‌లో సుందర్ బంతిని స్వీప్‌షాట్ ఆడేందుకు చూసిన మార్‌క్రమ్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 65 రన్స్ భాగస్వామ్యం ముగియడంతో పాటు జట్టు లయ దెబ్బతింది. సెంచరీ ఖాయమనుకున్న జోర్జి కాసేపటికే అవుటవడంతో మిగిలిన వికెట్లు కూడా టపటపా నేలకూలాయి.
ఆదుకున్న శాంసన్, తిలక్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి 30 ఓవర్లలో ఆడిన తీరుకు కనీసం 250 పరుగులైనా సాధించగలదా? అనిపించింది. కానీ శాంసన్, తిలక్ నిలకడైన భాగస్వామ్యానికి రింకూ సింగ్ జోరు తోడవడంతో చివరి 14 ఓవర్లలో 141 పరుగులు సాధించగలిగింది. అరంగేట్ర ఓపెనర్ రజత్ పటీదార్ (22) ఉన్నంతసేపు అదరగొట్టాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (10) ఈ మ్యాచ్‌లో విఫలం కాగా.. అటు కెప్టెన్ రాహుల్ (21) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 102/3. ఈ దశలో పాత బంతితోనూ సఫారీ పేసర్లు ప్రభావం చూపడంతో పరుగులు రావడం మరింత కష్టమైంది. అటు తిలక్ తానెదుర్కొన్న తొలి 38 బంతుల్లో కేవలం 9 పరుగులే సాధించాడు. శాంసన్‌తో కలిసి తను అత్యంత జాగ్రత్త కనబర్చడంతో 20-32 ఓవర్ల మధ్య 37 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ చివర్లో ఈ ద్వయం పుంజుకుంది. శాంసన్, తిలక్ సహజశైలిలో బ్యాట్లు ఝుళిపించారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదేయడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే తొలి అర్ధసెంచరీ సాధించిన వెంటనే తిలక్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం శాంసన్ 110 బంతుల్లో కెరీర్‌లో మొదటి శతకం పూర్తి చేసుకుని నిష్క్రమించాడు. చివర్లో వేగంగా వికెట్లు కోల్పోయినా రింకూ సింగ్ ఆటతీరుతో జట్టు 300 దరిదాపులోకి రాగలిగింది.
భారత్: రజత్ (బి) బర్గర్ 22, సుదర్శన్ (ఎల్బీ) హెన్‌డ్రిక్స్ 10, సంజూ శాంసన్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) విలియమ్స్ 108, రాహుల్ (సి) క్లాసెన్ (బి) ముల్డర్ 21, తిలక్ (సి) ముల్డర్ (బి) కేశవ్ 52, రింకూ (సి) హెన్‌డ్రిక్స్ (బి) బర్గర్ 38, అక్షర్ (సి) ముల్డర్ (బి) హెన్‌డ్రిక్స్ 1, వాషింగ్టన్ (సి) మార్‌క్రమ్ (బి) హెన్‌డ్రిక్స్ 14, అర్ష్‌దీప్ (నాటౌట్) 7, అవేశ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 50 ఓవర్లలో 296/8; వికెట్ల పతనం: 1-34, 2-49, 3-101, 4-217, 5-246, 6-255, 7-277, 8-293; బౌలింగ్: బర్గర్ 9-0-64-2, లిజాద్ విలియమ్స్ 10-0-71-1, బ్యూరన్ 9-0-63-3, ముల్డర్ 7-0-36-1, కేశవ్ మహారాజ్ 10-2-37-1, మార్‌క్రమ్ 5-0-19-0.
దక్షిణాఫ్రికా: రీజా హెన్‌డ్రిక్స్ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 19, జోర్జి (ఎల్బీ) అర్ష్‌దీప్ 81, డుస్సెన్ (బి) అక్షర్ 2, మార్‌క్రమ్ (సి) రాహుల్ (బి) వాషింగ్టన్ 36, క్లాసెన్ (సి) సుదర్శన్ (బి) అవేశ్ 21, మిల్లర్ (సి) రాహుల్ (బి) ముకేశ్ 10, ముల్డర్ (సి) రాహుల్ (బి) వాషింగ్టన్ 1, కేశవ్ (సి) రింకూ (బి) అర్ష్‌దీప్ 14, బ్యూరన్ (సి) సంజూ (బి) అవేశ్ 18, విలియమ్స్ (ఎల్బీ) అర్ష్‌దీప్ 2, బర్గర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 45.5 ఓవర్లలో 218 ఆలౌట్; వికెట్ల పతనం: 1-59, 2-76, 3-141, 4-161, 5-174, 6-177, 7-192, 8-210, 9-216, 10-218; బౌలింగ్: ముకేశ్ 9-0-56-1, అర్ష్‌దీప్ 9-1-30-4, అవేశ్ 7.5-0-45-2, వాషింగ్టన్ 10-0-38-2, అక్షర్ 10-0-48-1.