WTC Final : బ్యాటింగ్‌లోనూ అదే తీరు..

ABN , First Publish Date - 2023-06-09T03:57:11+05:30 IST

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం భారత్‌కు ఇక కష్టమే. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు కట్టడి చేయలేకపోయిన బౌలర్లకు తోడు బ్యాటర్లు కూడా తేలిపోయారు. కంగారూల పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక టపటపా వికెట్లను కోల్పోవడంతో ఇక

WTC Final : బ్యాటింగ్‌లోనూ అదే తీరు..
విరాట్‌(14)ను అవుట్‌ చేసిన ఆనందంలో స్టార్క్‌

ఆధిక్యంలో ఆసీస్‌.. మొదటి ఇన్నింగ్స్‌ 469

స్టీవ్‌ స్మిత్‌ శతకం

సిరాజ్‌కు 4 వికెట్లు

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 151/5

రెండో రోజు ఆటలో భారత బౌలర్లు వ్యూహం మార్చారు. ఫలితం సాధించారు. పేసర్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కానీ అప్పటికే మాథ్యూ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ శతకాల పుణ్యమా ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది. ఇక మన బ్యాటర్లు ఇంకా ఐపీఎల్‌ మూడ్‌లోనే ఉండిపోయారేమో.. రోహిత్‌, గిల్‌, పుజార, కోహ్లీ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. అయితే జడేజా దూకుడు కారణంగా స్కోరు 150 అయినా దాటగలిగింది. ఇక ఆటలో ఆశలన్నీ రహనెపైనే ఉన్నాయి. ఇంకా 318 పరుగుల వెనుకంజలో ఉన్న టీమిండియా శుక్రవారం ఏ మేరకు పోరాడగలదో చూడాలి!

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం భారత్‌కు ఇక కష్టమే. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు కట్టడి చేయలేకపోయిన బౌలర్లకు తోడు బ్యాటర్లు కూడా తేలిపోయారు. కంగారూల పదునైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక టపటపా వికెట్లను కోల్పోవడంతో ఇక టీమిండియా పోరాటం డ్రా కోసమే అన్నట్టు పరిస్థితి మారింది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 151/5 స్కోరుతో నిలిచింది. క్రీజులో రహానె (29 బ్యాటింగ్‌), భరత్‌ (5 బ్యాటింగ్‌) ఉన్నారు. భారత్‌ ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉండడం ఆందోళన కలిగించే విషయం. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 121.3 ఓవర్లలో 469 రన్స్‌ చేసింది. హెడ్‌ (163), స్మిత్‌ (121) శతకాలతో ఆదుకున్నారు. క్యారీ (48) రాణించాడు. సిరాజ్‌కు 4, షమి.. ఠాకూర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

నాలుగు వికెట్లు తీసినా..: తొలి సెషన్‌లో భారత బౌలర్లు పుంజుకుని నాలుగు వికెట్లు తీయగలిగారు. కానీ అటు ఆసీస్‌ బ్యాటర్లేమీ వెనుకబడిపోలేదు. 95 పరుగులు సాధించడంతో టీమ్‌ స్కోరు సైతం 400 దాటి అప్పటికే పటిష్ఠ స్థితిలో నిలిచింది. 327/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో కంగారూలు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా.. తొలి ఓవర్‌లో సిరాజ్‌ వేసిన రెండు హాఫ్‌ వాలీ బంతులను స్మిత్‌ వరుస ఫోర్లుగా మలిచాడు. దీంతో తను కెరీర్‌లో 31వ సెంచరీని పూర్తి చేశాడు. అటు షమి ఓవర్‌లో హెడ్‌ చక్కటి ఫోర్‌తో 150కి చేరాడు. అయితే ఈ జోడీని విడదీసేందుకు పేసర్లు సిరాజ్‌, షమి బౌన్సర్లను ప్రయోగించారు. మొదటి రోజు అమలు చేయలేకపోయిన ఈ వూహ్యంతో చక్కటి ఫలితమే వచ్చింది. స్మిత్‌ స్వేచ్ఛగా ఆడినా.. సిరాజ్‌ బౌన్సర్లకు హెడ్‌ మాత్రం ఇబ్బందిపడ్డాడు. చివరకు పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో అతడు కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. అయితే నాలుగో వికెట్‌కు 285 పరుగుల భారీ భాగస్వామ్యం సమకూరడం విశేషం. ఈ దశలో ఆసీస్‌ వేగంగా వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. షమి ఓవర్‌లో గ్రీన్‌ (6) క్యాచ్‌ను గిల్‌ వేగంగా స్పందించి పట్టేశాడు. ఇక కాసేపటికే అత్యంత విలువైన స్మిత్‌ వికెట్‌ను శార్దూల్‌ తన తొలి బంతికే తీశాడు. చక్కటి లెంగ్త్‌తో విసిరిన అవుట్‌ స్వింగర్‌ను స్మిత్‌ వికెట్ల మీదకు ఆడడంతో బౌల్డ్‌ అయ్యాడు. దీనికి తోడు సబ్‌స్టిట్యూట్‌ అక్షర్‌ నేరుగా విసిరిన బంతికి స్టార్క్‌ (5) రనౌట్‌ అయ్యాడు. 12 ఓవర్ల వ్వవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ 422/7 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది.

si.jpg

సిరాజ్‌ (4/108)

క్యారీ పోరాటంతో..: విరామం తర్వాత ఆసీస్‌ను త్వరగానే అవుట్‌ చేద్దామనుకున్న భారత్‌ ఆశలపై అలెక్స్‌ క్యారీ నీళ్లుజల్లాడు. టెయిలెండర్లను అండగా చేసుకుని తను దూకుడుగా ఆడడంతో జట్టు స్కోరు 450 దాటేసింది. చివరి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా క్యారీ ఒక్కడే 48 పరుగులు సాధించాడు. షమి ఓవర్‌లో తను మూడు ఫోర్లతో పాటు జడేజా ఓవర్‌లో సిక్సర్‌ బాదాడు. అలాగే రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నంలో జడ్డూకే ఎల్బీగా చిక్కాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకు వెళ్లిన భారత్‌ సఫలమైంది. ఆ తర్వాత లియోన్‌ (9), కమిన్స్‌ (9) వికెట్లను సిరాజ్‌ వరుస ఓవర్లలో తీసి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

భారత్‌ తడ‘బ్యాటు’:టీబ్రేక్‌కు ముందు పది ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఓపెనర్లు రోహిత్‌ (15), గిల్‌ (13) వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. పిచ్‌ బ్యాటింగ్‌కు సులువుగానే ఉండడంతో ఈ ఇద్దరూ ఆత్మవిశ్వాసంతోనే కనిపించారు. కానీ కమిన్స్‌ గుడ్‌ లెంగ్త్‌ బంతికి రోహిత్‌ ఎల్బీ అయ్యాడు. ఇక మరో పేసర్‌ బోలాండ్‌ వరుసగా తొమ్మిది డాట్‌ బంతులు విసిరి గిల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అవుడ్‌సైడ్‌ ఆవలకు వెళుతుందనుకున్న ఆ బంతి టర్న్‌ తీసుకుని ఆఫ్‌ స్టంప్‌ను తాకడంతో గిల్‌ షాకయ్యాడు. 37/2తో టీ విరామానికి వెళ్లిన భారత్‌.. ఆఖరి సెషన్‌లో మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఆరంభంలోనే పుజార (14) వికెట్‌ను కోల్పోవడం దెబ్బతీసింది. అచ్చం గిల్‌ తరహాలోనే గ్రీన్‌ ఓవర్‌లో పుజార బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికే కోహ్లీ (14)ని స్టార్క్‌ అవుట్‌ చేయడంతో 71/4 స్కోరుతో కష్టాల్లో పడింది. కానీ రహానెతో జత కట్టిన జడేజా దూకుడుగా ఆడాడు. వన్డే తరహాలో ఎదురుదాడికి దిగి స్కోరును పెంచాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 71 పరుగులు జోడించింది. అర్ధసెంచరీకి చేరువలో జడ్డూను లియోన్‌ అవుట్‌ చేశాడు. అటు రహానె బొటన వేలికి బంతి బలంగా తాకినా బ్యాటింగ్‌ కొనసాగించాడు. తను 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్బీ అయినా.. కమిన్స్‌ నోబ్‌ వేయడంతో బతికిపోయాడు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) భరత్‌ (బి) శార్దూల్‌ 43; ఖవాజా (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 0; లబుషేన్‌ (బి) షమి 26; స్మిత్‌ (బి) శార్దూల్‌ 121; ట్రావిస్‌ హెడ్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 163; గ్రీన్‌ (సి) గిల్‌ (బి) షమి 6; క్యారీ (ఎల్బీ) జడేజా 48; స్టార్క్‌ (రనౌట్‌) 5; కమిన్స్‌ (సి) రహానె (బి) సిరాజ్‌ 9; లియోన్‌ (బి) సిరాజ్‌ 9; బోలాండ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 38; మొత్తం: 121.3 ఓవర్లలో 469 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76, 4–361, 5–376, 6–387, 7–402, 8–453, 9–468, 10–469. బౌలింగ్‌: షమి 29–4–122–2, సిరాజ్‌ 28.3–4–108–4, ఉమేశ్‌ 23–5–77–0, శార్దూల్‌ 23–4–83–2, జడేజా 18–2–56–1.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) కమిన్స్‌ 15; గిల్‌ (బి) బోలాండ్‌ 13; పుజార (బి) గ్రీన్‌ 14; కోహ్లీ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 14; రహానె (బ్యాటింగ్‌) 29; జడేజా (సి) స్మిత్‌ (బి) లియోన్‌ 48; భరత్‌ (బ్యాటింగ్‌) 5; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 38 ఓవర్లలో 151/5. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–50, 4–71, 5–142. బౌలింగ్‌: స్టార్క్‌ 9–0–52–1; కమిన్స్‌ 9–2–36–1; బోలాండ్‌ 11–4–29–1; గ్రీన్‌ 7–1–22–1; లియోన్‌ 2–0–4–1.

Updated Date - 2023-06-09T03:57:11+05:30 IST