SRH vs LSG : రైజర్స్‌.. అదే తీరు

ABN , First Publish Date - 2023-04-08T03:30:05+05:30 IST

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలం కావడంతో వరుసగా రెండో పరాజయం ఎదుర్కొంది. అటు లఖ్‌నవూ సూపర్‌

SRH vs LSG : రైజర్స్‌.. అదే తీరు
lsgs

రెండో మ్యాచ్‌లోనూ ఓటమి

5 వికెట్లతో లఖ్‌నవూ విజయం

క్రునాల్‌ ఆల్‌రౌండ్‌ షో

లఖ్‌నవూ: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలం కావడంతో వరుసగా రెండో పరాజయం ఎదుర్కొంది. అటు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మాత్రం అదరగొడుతూ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. క్రునాల్‌ పాండ్యా (3/18; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (31 బంతుల్లో 4 ఫోర్లతో 35) రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఎల్‌ఎ్‌సజీకిది రెండో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (34), అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (31) మాత్రమే రాణించారు. క్రునాల్‌కు 3, అమిత్‌ మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 16 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా క్రునాల్‌ పాండ్యా నిలిచాడు.

సునాయాసంగా..: స్వల్ప ఛేదనను లఖ్‌నవూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (13) ఈసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. కెప్టెన్‌ రాహుల్‌ ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. దీపక్‌ హుడా (7)ను భువనేశ్వర్‌ సూపర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 45/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత రాహుల్‌కు జతగా క్రునాల్‌ బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇద్దరూ అలవోకగా షాట్లు ఆడేస్తూ ఓవర్‌కు 8 పరుగుల రన్‌రేట్‌తో స్కోరును పెంచారు. విజయానికి మరో 22 పరుగుల దూరంలో క్రునాల్‌ను 13వ ఓవర్‌లో ఉమ్రాన్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే అదే ఓవర్‌లో ఉమ్రాన్‌ రెండు ఫోర్లతో 13 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 15వ ఓవర్‌లో రషీద్‌ వరుస బంతుల్లో రాహుల్‌, షెఫర్డ్‌ (0)లను అవుట్‌ చేసినా ఫలితం లేకపోయింది. స్టొయినిస్‌ (10 నాటౌట్‌), నికోలస్‌ పూరన్‌(11 నాటౌట్‌) మరో 24 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.

స్పిన్నర్ల హవా..: టాస్‌ గెలిచిన వెంటనే బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు పరుగులు తీయడం కష్టంగా మారింది. 18వ ఓవర్‌లో వంద పరుగులు పూర్తి చేసిందంటే వీరి ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వికెట్‌పై ఎలాంటి పేస్‌ లేకపోవడంతో స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. ఆరంభంలో క్రునాల్‌ పాండ్యా.. ఆఖర్లో అమిత్‌ మిశ్రా గట్టి దెబ్బ తీశారు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (8) వెనుదిరగగా.. కొత్త కెప్టెన్‌ మార్‌క్రమ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఇక కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్‌ 3 పరుగులకే నిష్క్రమించడంతో 55/4 స్కోరుతో రైజర్స్‌ ఇబ్బందుల్లో పడింది. రైజర్స్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన మరో ఓపెనర్‌ అన్‌మోల్‌ప్రీత్‌ మాత్రం క్రీజులో ఉన్నంత సేపు ధాటిని కనబరిచాడు. 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఎనిమిదో ఓవర్‌లో అవుటయ్యాడు. బ్రూక్‌ను బిష్ణోయ్‌ దెబ్బతీయగా.. మిగిలిన మూడు వికెట్లను క్రునాలే పడగొట్టాడు. ఈ దశలో త్రిపాఠి, వాషింగ్టన్‌ సుందర్‌ (16) వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నంలో నిదానంగా ఆడడంతో 11-14 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. డెత్‌ ఓవర్లలోనూ రైజర్స్‌ ఆటతీరు మారలేదు. 18వ ఓవర్‌లో త్రిపాఠికి యష్‌.. 19వ ఓవర్‌లో సుందర్‌, ఆదిల్‌ రషీద్‌ (4)లకు అమిత్‌ మిశ్రా షాకిచ్చారు. చివరి ఓవర్‌లో అబ్దుల్‌ సమద్‌ (21 నాటౌట్‌) రెండు సిక్సర్లతో 13 రన్స్‌ అందించగా, జట్టు స్కోరు అతికష్టంగా 120కి చేరగలిగింది.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ (ఎల్బీ) క్రునాల్‌ 31, మయాంక్‌ అగర్వాల్‌ (సి) స్టొయినిస్‌ (బి) క్రునాల్‌ 8, త్రిపాఠి (సి) అమిత్‌ (బి) యశ్‌ 34, మార్‌క్రమ్‌ (బి) క్రునాల్‌ 0, హ్యారీ బ్రూక్‌ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 3, వాషింగ్టన్‌ సుందర్‌ (సి) హుడా (బి) అమిత్‌ 16, సమద్‌ (నాటౌట్‌) 21, ఆదిల్‌ రషీద్‌ (సి) హుడా (బి) అమిత్‌ 4, ఉమ్రాన్‌ (రనౌట్‌) 0, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 121/8; వికెట్ల పతనం: 1-21, 2-50, 3-50, 4-55, 5-94, 6-104, 7-108, 8-109; బౌలింగ్‌: మేయర్స్‌ 1-0-5-0, ఉనాద్కట్‌ 3-0-26-0, క్రునాల్‌ 4-0-18-3, యశ్‌ ఠాకూర్‌ 3-0-23-1, రవి బిష్ణోయ్‌ 4-0-16-1, దీపక్‌ హుడా 1-0-8-0, అమిత్‌ మిశ్రా 4-0-23-2.

లఖ్‌నవూ: కైల్‌ మేయర్స్‌ (సి) అగర్వాల్‌ (బి) ఫరూఖి 13, కేఎల్‌ రాహుల్‌ (ఎల్బీ) రషీద్‌ 35, దీపక్‌ హుడా (సి అండ్‌ బి) భువనేశ్వర్‌ 7, క్రునాల్‌ పాండ్యా (సి) అన్‌మోల్‌ప్రీత్‌ (బి) ఉమ్రాన్‌ 34, స్టొయినిస్‌ (నాటౌట్‌) 10, షెఫర్డ్‌ (ఎల్బీ) రషీద్‌ 0, పూరన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 16 ఓవర్లలో 127/5; వికెట్ల పతనం: 1-35, 2-45, 3-100, 4-114, 5-114; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-19-1, వాషింగ్టన్‌ 1-0-11-0, ఫరూఖి 3-0-13-1, మార్‌క్రమ్‌ 2-0-14-0, రషీద్‌ 3-0-23-2, నటరాజన్‌ 3-0-23-0, ఉమ్రాన్‌ 2-0-22-1.

Updated Date - 2023-04-08T03:30:05+05:30 IST