SRH vs DC: రైజర్స్‌ ఆల్‌రౌండ్‌షో

ABN , First Publish Date - 2023-04-30T02:21:03+05:30 IST

వరుసగా మూడు ఓటములతో డీలాపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం రుచి చూసింది.

SRH vs DC: రైజర్స్‌ ఆల్‌రౌండ్‌షో

ఢిల్లీపై విజయం

రాణించిన అభిషేక్‌

మార్ష్‌ పోరాటం వృథా

అభిషేక్‌ (36 బంతుల్లో 67)

న్యూఢిల్లీ: వరుసగా మూడు ఓటములతో డీలాపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం రుచి చూసింది. బ్యాటింగ్‌లో అభిషేక్‌ శర్మ (36 బంతుల్లో 12 ఫోర్లతో 1 సిక్స్‌తో 67), క్లాసెన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత ఛేదనలో విజయం వైపు సాగుతున్న ప్రత్యర్థిని బౌలర్లు సమష్ఠిగా రాణిస్తూ ముకుతాడు వేశారు. దీంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులతో సన్‌రైజర్స్‌ గెలిచింది. ముందుగా రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌కు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసి ఓడింది. మిచెల్‌ మార్ష్‌ (39 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్సర్లతో 63), సాల్ట్‌ (35 బంతుల్లో 9 ఫోర్లతో 59) పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మార్ష్‌ నిలిచాడు.

శతక భాగస్వామ్యం: ఛేదనలో ఢిల్లీ తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ వార్నర్‌ (0) వికెట్‌ కోల్పోయింది. కానీ మరో ఓపెనర్‌ సాల్ట్‌, మార్ష్‌ జోడీ బౌలర్లను ఆడుకుంటూ రెండో వికెట్‌కు 112 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నంత సేపు ఢిల్లీ విజయం ఖాయమేననిపించింది. కానీ 12వ ఓవర్‌ నుంచి జట్టు ఒక్కసారిగా తడబడి మ్యాచ్‌ను చేజార్చుకుంది. అంతకుముందు చకచకా బౌండరీలతో ఓవర్‌కు పది రన్‌రేట్‌తో మార్ష్‌–సాల్ట్‌ ద్వయం స్కోరును పెంచింది. దీంతో పవర్‌ప్లేలో 57/1 స్కోరుతో జట్టు పటిష్ఠంగా కనిపించింది. ఇక ఏడో ఓవర్‌లో మార్ష్‌ 2 సిక్సర్లు, సాల్ట్‌ 2 ఫోర్లతో 22 రన్స్‌ వచ్చాయి. తొమ్మిదో ఓవర్‌లోనూ మార్ష్‌ 4,6 బాది 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే అప్పటికే హాఫ్‌ సెంచరీతో జోరు మీదున్న సాల్ట్‌ను మార్కండే రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయడంతో ఢిల్లీ తడబాటు మొదలైంది. ఆ తర్వాత వరుస రెండు ఓవర్లలో మనీశ్‌ పాండే (1), మార్ష్‌ కూడా వెనుదిరగడంతో స్కోరు నెమ్మదించింది. అటు వికెట్లు కూడా కోల్పోవడంతో క్రీజులో అక్షర్‌ (29 నాటౌట్‌) ఉన్నా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో 26 పరుగులు కావాల్సిన వేళ 15 రన్స్‌ మాత్రమే సాధించి ఢిల్లీ ఓటమిపాలైంది.

అభిషేక్‌, క్లాసెన్‌ జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ఆరంభించిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఓపెనర్‌ అభిషేక్‌, మధ్య ఓవర్లలో క్లాసెన్‌ ఆటతీరే హైలైట్‌గా నిలిచింది. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన చోట వీరు భారీషాట్లతో చెలరేగారు. తొలి ఓవర్‌లోనే రెండు వరుస ఫోర్లతో ధాటిని కనబర్చిన అభిషేక్‌ ఆరో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 62/2 పరుగులు సాధించింది. ఇందులో అభిషేక్‌వే 43 పరుగులుండడం విశేషం. అప్పటికే మయాంక్‌ అగర్వాల్‌ (5), రాహుల్‌ త్రిపాఠి (10) వికెట్లను సన్‌రైజర్స్‌ కోల్పోయింది. ఆ తర్వాత పదో ఓవర్‌లో మిచెల్‌ మార్ష్‌ ఒక్క పరుగు ఇవ్వకుండా మార్‌క్రమ్‌ (8), బ్రూక్‌ (0)ల వికెట్లు తీయడంతో రైజర్స్‌ షాక్‌కు గురైంది. 11వ ఓవర్‌లో అభిషేక్‌ రెండు ఫోర్లు, క్లాసెన్‌ 4,6తో 24 పరుగులు రాబట్టడంతో జట్టు స్కోరు వంద దాటింది. 25 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి ఊపుమీదున్న అభిషేక్‌ను అక్షర్‌ అవుట్‌ చేయగా.. అనంతరం క్లాసెన్‌ ఇన్నింగ్స్‌ బాధ్యతను తీసుకున్నాడు. అబ్దుల్‌ సమద్‌ (28)తో కలిసి ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో స్కోరును 150 దాటించిన క్లాసెన్‌ 25 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి అర్ధశతకం పూర్తి చేసుకొని జట్టుకు భారీస్కోరుఅందించాడు.

స్కోరు బోర్డు

హైదరాబాద్‌: అభిషేక్‌ (సి) వార్నర్‌ (బి) అక్షర్‌ 67, మయాంక్‌ అగర్వాల్‌ (సి) సాల్ట్‌ (బి) ఇషాంత్‌ 5, త్రిపాఠి (సి) పాండే (బి) మార్ష్‌ 10, మార్‌క్రమ్‌ (సి) అక్షర్‌ (బి) మార్ష్‌ 8, హ్యారీ బ్రూక్‌ (సి) అక్షర్‌ (బి) మార్ష్‌ 0, క్లాసెన్‌ (నాటౌట్‌) 53, అబ్దుల్‌ సమద్‌ (సి) సాల్ట్‌ (బి) మార్ష్‌ 28, అకీల్‌ హుస్సేన్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 197/6; వికెట్ల పతనం: 1–21, 2–44, 3–83, 4–83, 5–109, 6–162; బౌలింగ్‌: ఇషాంత్‌ 3–0–31–1, నోకియా 4–0–44–0, ముకేశ్‌ 2–0–38–0, మార్ష్‌ 4–1–27–4, కుల్దీప్‌ యాదవ్‌ 3–0–27–0, అక్షర్‌ 4–0–29–1.

ఢిల్లీ: వార్నర్‌ (బి) భువనేశ్వర్‌ 0, సాల్ట్‌ (సి అండ్‌ బి) మార్కండే 59, మార్ష్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) హుస్సేన్‌ 63, మనీష్‌ పాండే (స్టంప్‌) క్లాసెన్‌ (బి) అభిషేక్‌ 1, గార్గ్‌ (బి) మార్కండే 12, సర్ఫరాజ్‌ (బి) నటరాజన్‌ 9, అక్షర్‌ (నాటౌట్‌) 29, రిపల్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 188/6; వికెట్ల పతనం: 1–0, 2–112, 3–115, 4–125, 5–140, 6–148; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–45–1, అకీల్‌ హుస్సేన్‌ 4–0–40–1, నటరాజన్‌ 4–0–34–1, ఉమ్రాన్‌ 1–0–22–0, మార్కండే 4–0–20–2, అభిషేక్‌ 3–0–26–1.

Updated Date - 2023-04-30T02:47:18+05:30 IST