Rahul: రాహుల్‌పై అంత ప్రేమేల?

ABN , First Publish Date - 2023-02-28T03:16:25+05:30 IST

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు అద్భుతంగానే సాగింది. ఆడిన రెండు టెస్టులనూ కైవసం చేసుకుని 2-0తో ఆధిక్యంలో ఉంది.

 Rahul: రాహుల్‌పై అంత ప్రేమేల?

మూడో టెస్టులో ఓపెనర్‌ ఎవరో?

రేసులో గిల్‌

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు అద్భుతంగానే సాగింది. ఆడిన రెండు టెస్టులనూ కైవసం చేసుకుని 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ ప్రదర్శన కన్నా.. స్పిన్నర్ల హవానే సాగింది. అయితే మిగిలిన రెండు టెస్టులనూ దక్కించుకోవాలంటే బ్యాటర్లు కూడా భాగస్వామ్యం కావాల్సిందే. అలాగే ఇండోర్‌ టెస్టులో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేది ఎవరనే విషయం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఎన్ని అవకాశాలు లభిస్తున్నా రాహుల్‌ తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాడు. కెరీర్‌లో ఆడిన 47 టెస్టుల్లో 33.44 సగటు మాత్రమే కలిగిన అతనికి ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారనేది సగటు అభిమానికి అర్థం కాని విషయం. టెస్టుల్లో తానాడిన చివరి 10 ఇన్నింగ్స్‌లో వరుసగా 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17, 1 పరుగులు మాత్రమే చేశాడు.

13.jpg

గమనిస్తే ఇందులో ఒక్కసారి కూడా కనీసం 25 పరుగులు సాధించలేక పోయాడు. ఇక తాజా సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 2017 నుంచి చూసుకుంటే 48 ఇన్నింగ్స్‌లో చేసింది 1204 పరుగులే. అదీ 26 సగటుతో. ఇంత పేలవ రికార్డు మరే ఆటగాడికి ఉన్నా తను టీమిండియాకు దూరమై ఎంతో కాలమయ్యేది. దేశవాళీల్లో సెంచరీల వరద పారిస్తున్న యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, అభిమన్యు ఈశ్వరన్‌లను పట్టించుకునే వారే కరువయ్యారు. సర్ఫరాజ్‌ ఇటీవలి రంజీల్లోనూ మూడు శతకాలు బాదాడు.

గిల్‌కు చోటిస్తారా?

ఇతర ఆటగాళ్లను పక్కనబెడితే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం జట్టుతో పాటే ఉంటున్న మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇంతవరకు సిరీస్‌లో ఆడలేకపోయాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌, కోచ్‌ ద్రవిడ్‌ రాహుల్‌ వైపే మొగ్గు చూపుతుండడంతో అతడికి నిరాశే ఎదురవుతోంది. గిల్‌ ఇటీవలి టీ20, వన్డేల్లోనూ శతకాలు సాధించి పూర్తి ఫామ్‌లో ఉన్నాడు. అయినా అతణ్ణి బెంచీకే పరిమితం చేస్తూ రాహుల్‌కే అవకాశం కల్పించడం గమనార్హం. 13 టెస్టులు ఆడిన గిల్‌ 32 సగటుతో 736 పరుగులు సాధించాడు.

పక్క పక్కనే ప్రాక్టీస్‌

ఇండోర్‌: సోమవారం జరిగిన నెట్‌ సెషన్‌లో రాహుల్‌, గిల్‌ చెమటోడ్చారు. కోచ్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో ఇద్దరూ పక్క పక్కనే ఉన్న నెట్స్‌లో అర్ధగంట పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లీ స్పిన్‌ బౌలింగ్‌లో దూకుడుగా ఆడారు. లెఫ్టామ్‌ స్పిన్‌లో కోహ్లీ స్ట్రెయిట్‌ బౌండరీలను లక్ష్యం చేయగా.. రోహిత్‌ పుల్‌, స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లను ఆడాడు.

ఆడకపోతే విమర్శలు తప్పవు: గంగూలీ

సొంత గడ్డపై జరిగే మ్యాచ్‌ల్లో పరుగులు సాధించని భారత బ్యాటర్లు విమర్శలకు కూడా సిద్ధంగా ఉండాలని మాజీ కెప్టెన్‌ గంగూలీ చెప్పాడు. ఇలాంటి స్థితి కేవలం కేఎల్‌ రాహుల్‌కే కాకుండా గతంలోనూ చాలామంది ఎదుర్కొన్నారని తెలిపాడు. ఇప్పుడు రాహుల్‌పై అందరి దృష్టి ఉండడంతో అతడు ఒత్తిడి ఎదుర్కొంటున్నాడన్నాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనని ముఖ్యమైన ఆటగాడిగా పరిగణిస్తోందని, అతడికి మరిన్ని అవకాశాలు లభిస్తే పరుగులు సాధించవచ్చని గంగూలీ సూచించాడు.

డిఫెన్స్‌ను నమ్ముకోవాలి: భరత్‌

భారత్‌-ఆసీ్‌స మధ్య జరిగిన రెండు టెస్టులూ మూడు రోజుల్లోపే ముగియడం చర్చనీయాంశమైంది. అయితే బ్యాటర్లు తమ డిఫెన్స్‌పై నమ్మకముంచితే పరుగులు వస్తాయని వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ తెలిపాడు. రెండో టెస్టు ఛేదనలో భరత్‌ 22 బంతుల్లో 23 రన్స్‌ చేసి రాణించాడు. ‘వికెట్లు బ్యాటింగ్‌ చేసేందుకు సహకరించకపోతే డిఫెన్స్‌ను నమ్ముకోవడమే మేలు. పరుగులు వాటంతటవే వస్తాయి. షాట్ల ఎంపిక కూడా అన్నింటికంటే ముఖ్యం’ అని భరత్‌ తెలిపాడు.

Updated Date - 2023-02-28T03:16:25+05:30 IST