Mumbai VS Gujarat Titans: ఆఖరి అవకాశం

ABN , First Publish Date - 2023-05-26T04:44:23+05:30 IST

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అదిరే విజయంతో ముంబై ఇండియన్స్‌ దూకుడు మీదుంటే.. లీగ్‌లో తొలిసారి గుజరాత్‌ టైటాన్స్‌ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Mumbai VS Gujarat Titans: ఆఖరి అవకాశం

జోష్‌లో ముంబై.. ఒత్తిడిలో గుజరాత్‌

రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో..

1-1

చెన్నైతో ఫైనల్‌ ఆడేదెవరో?

నేడు క్వాలిఫయర్‌–2

లీగ్‌ దశలో ముంబై, గుజరాత్‌ రెండు మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరొకసారి నెగ్గాయి.

అహ్మదాబాద్‌: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అదిరే విజయంతో ముంబై ఇండియన్స్‌ దూకుడు మీదుంటే.. లీగ్‌లో తొలిసారి గుజరాత్‌ టైటాన్స్‌ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌–2లో డిఫెండింగ్‌ చాంప్‌ గుజరాత్‌తో ఐదుసార్లు విజేత ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్లో తలపడనుండగా.. ఓడిన టీమ్‌ ఇంటిముఖం పట్టనుంది. సరైన సమయంలో టాప్‌ గేర్‌ వేసిన ముంబై ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కష్టంగా నాకౌట్‌కు చేరినా.. ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. లీగ్‌ సాగేకొద్దీ ముంబై బ్యాటర్లు గాడినపడడంతో ఆ జట్టు భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తోంది. టాపార్డర్‌లో రోహిత్‌, ఇషాన్‌ అంతగా ప్రభావం చూపలేకపోయినా.. మిడిలార్డర్‌లో గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నారు. నేహల్‌ వధేరా కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక, బౌలింగ్‌ విషయానికొస్తే బ్రుమా, ఆర్చర్‌ లేకపోయినా.. ఆకాష్‌ మధ్వాల్‌ ఆ లోటు తీరుస్తున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్‌ కూడా అతడికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా లఖ్‌నవూతో ఎలిమినేటర్‌లో మధ్వాల్‌ 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఆకాష్‌ నుంచి టీమ్‌ అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది.

గిల్‌పైనే భారం..:

లీగ్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలతో టాప్‌లో నిలిచిన గుజరాత్‌.. క్వాలిఫయర్‌–1లో చెన్నై చేతిలో తగిలిన షాక్‌తో ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. ఛేజింగ్‌లో బలమైన గుజరాత్‌ను చెన్నై చాకచక్యంగా నిలువరించింది. అయితే, హైవోల్టేజ్‌ మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడుతుండడం టైటాన్స్‌కు కొంత లాభించేదే..! బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగి పోతున్నాడు. మరోసారి జట్టు అతడిపైనే ఎక్కువ భారాన్ని వేయనుంది. ఈ నేపథ్యంలో ముంబై తురుపుముక్క ఆకాష్‌, గిల్‌ మధ్య పోరు రసవత్తరం కానుంది. విజయ్‌ శంకర్‌ రాణిస్తున్నా.. హార్దిక్‌ పాండ్యా, మిల్లర్‌, తెవాటియా లాంటి హిట్టర్లు ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరాలంటే మాత్రం వీరి నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. బౌలింగ్‌లో షమి, రషీద్‌ రాణిస్తున్నా.. ముంబై బ్యాటర్లు నుంచి వీరికి విషమ పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఎలా నెగ్గాలో తెలిసిన ముంబైతో తలపడడం గుజరాత్‌కు సవాలే..!

ముంబై:

ఇషాన్‌, రోహిత్‌, గ్రీన్‌, సూర్య, తిలక్‌ వర్మ, డేవిడ్‌, జోర్డాన్‌, చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్‌, కుమార్‌ కార్తికేయ ఆకాష్‌ మధ్వాల్‌.

గుజరాత్‌:

గిల్‌, సాహా, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), విజయ్‌ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, లిటిల్‌/యష్‌ దయాళ్‌, మోహిత్‌ శర్మ, షమి.

పిచ్‌/వాతావరణం

మొతేరా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున పిచ్‌ బీటలు వారకుండా కవర్లు కప్పి ఉంచారు. వికెట్‌లో తేమ ఉండడానికి నీటిని చల్లుతున్నారు. మంచు ప్రభావం అంతంత మాత్రమే.

Updated Date - 2023-05-26T04:44:23+05:30 IST