IPL GT vs SRH : టైటాన్స్‌దే తొలి అడుగు

ABN , First Publish Date - 2023-05-16T01:03:19+05:30 IST

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) లీగ్‌లో తొలి శతకంతో రెచ్చిపోయాడు.

IPL GT vs SRH : టైటాన్స్‌దే తొలి అడుగు

ప్లేఆఫ్స్‌ నుంచి రైజర్స్‌ అవుట్‌

34 రన్స్‌ తేడాతో చిత్తు

శుభ్‌మన్‌ గిల్‌ శతకంగిల్‌ (58 బంతుల్లో 101)

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) లీగ్‌లో తొలి శతకంతో రెచ్చిపోయాడు. అనంతరం పేసర్లు షమి (4/21), మోహిత్‌ శర్మ (4/28) తడాఖా చూపడంతో సన్‌రైజర్స్‌ తొలి ఏడు ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి చివరకు 34 పరుగుల తేడాతో చిత్తయింది. అలాగే ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ నుంచి అధికారికంగా వైదొలిగినట్టయ్యింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు సాధించింది. సాయి సుదర్శన్‌ (47) ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్‌ ఐదు వికెట్లతో మెరిశాడు. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), భువనేశ్వర్‌ (27) మాత్రమే రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.

క్లాసెన్‌ ఒక్కడే..: భారీ ఛేదనలో రైజర్స్‌ తొలి ఓవర్‌ నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ పరాజయం వైపు సాగింది. ఆరంభంలోనే అన్‌మోల్‌ (5), త్రిపాఠి (1), మార్‌క్రమ్‌ (10)లను పేసర్‌ మహ్మద్‌ షమి అవుట్‌ చేయగా.. అభిషేక్‌ (5)ను దయాళ్‌ దెబ్బతీశాడు. దీంతో తొలి ఐదు ఓవర్లలోనే 29/4 స్కోరుతో దయనీయంగా కనిపించింది. ఆ తర్వాత మోహిత్‌ ఏడో ఓవర్‌లో సన్వీర్‌ (7), సమద్‌ (4)ల పనిబట్టడంతో పాటు తన తర్వాతి ఓవర్‌లో జాన్సెన్‌ (3)ను కూడా అవుట్‌ చేయడంతో రైజర్స్‌ 59/7 స్కోరుతో విలవిల్లాడింది. మరోవైపు క్లాసెన్‌ మాత్రం అదరగొట్టాడు. 17వ ఓవర్‌లో క్లాసెన్‌ పోరాటానికి షమి బ్రేక్‌ వేయగా.. భువీని మోహిత్‌ అవుట్‌ చేశాడు.

ఆరంభంలో గిల్‌.. చివర్లో భువీ జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టులో గిల్‌–సుదర్శన్‌ జోడీ చెలరేగింది. కానీ డెత్‌ ఓవర్లలో భువీ ధాటికి అనూహ్యంగా తడబాటుకు గురై పేకమేడలా వికెట్లను కోల్పోయింది. చివరి ఓవర్‌లోనైతే రెండు పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. అయితే గిల్‌ సెంచరీ పుణ్యమా అని పటిష్ఠమైన స్కోరునే సాధించగలిగింది. ఓపెనర్‌ సాహాను తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్‌ డకౌట్‌ చేశాడు. అయితే సజావుగా సాగుతున్న జట్టు ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ నుంచి పూర్తిగా గతి తప్పింది. హాఫ్‌ సెంచరీకి చేరువలో ఉన్న సుదర్శన్‌.. నటరాజన్‌ అద్భుత క్యాచ్‌తో వెనుదిరగ్గా.. ఆ వెంటనే హార్దిక్‌ (8), మిల్లర్‌ (7), తెవాటియా (3) వరుస ఓవర్లలో అవుటయ్యారు. మరో ఎండ్‌లో గిల్‌ 56 బంతుల్లో తొలి ఐపీఎల్‌ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌లో భువీ మేజిక్‌ చేశాడు. తొలి రెండు బంతుల్లో గిల్‌, రషీద్‌ (0) వికెట్లు తీయగా.. మూడో బంతికి నూర్‌ (0)ను రనౌట్‌ చేశాడు. అలాగే ఐదో బంతికి షమి (0) వికెట్‌ కూడా తీయడంతో అతడి ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి.

ఐపీఎల్‌ మ్యాచ్‌లో పేసర్లు 17 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

ఐపీఎల్‌లో రెండుసార్లు 5 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా భువనేశ్వర్‌. గతంలో ఫాల్క్‌నర్‌, జయ్‌దేవ్‌ ఉనాద్కట్‌ ఉన్నారు.

స్కోరుబోర్డు

గుజరాత్‌ : సాహా (సి) అభిషేక్‌ (బి) భువనేశ్వర్‌ 0, గిల్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 101, సాయి సుదర్శన్‌ (సి) నటరాజన్‌ (బి) జాన్సన్‌ 47, హార్దిక్‌ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్‌ 8, మిల్లర్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 7, తెవాటియా (సి) జాన్సన్‌ (బి) ఫారూఖీ 3, షణక (నాటౌట్‌) 9, రషీద్‌ (సి) క్లాసెన్‌ (బి) భువనేశ్వర్‌ 0, నూర్‌ అహ్మద్‌ (రనౌట్‌) 0, షమి (సి) జాన్సన్‌ (బి) భువనేశ్వర్‌ 0, మోహిత్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 13; మొత్తం 20 ఓవర్లలో 188/9 ; వికెట్లపతనం : 1/0, 2/147, 3/156, 4/169, 5/175, 6/186, 7/186, 8/186, 9/187; బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 4–0–30–5, జాన్సన్‌ 4–0–39–1, ఫారూఖీ 3–0–31–1, నటరాజన్‌ 4–0–34–1, మార్‌క్రమ్‌ 1–0–13–0, మార్కండే 3–0–27–0, అభిషేక్‌ 1–0–13–0

హైదరాబాద్‌ : అన్‌మోల్‌ (సి) రషీద్‌ (బి) షమి 5, అభిషేక్‌ (సి) సాహా (బి) యశ్‌ 5, మార్‌క్రమ్‌ (సి) షనక (బి) షమి 10, త్రిపాఠి (సి) తెవాటియా (బి) షమి 1, క్లాసెన్‌ (సి) మిల్లర్‌ (బి) షమి 64, సన్వీర్‌(సి) సాయి (బి) మోహిత్‌ 7, సమద్‌ (సి–సబ్‌) మావి (బి) మోహిత్‌ 4, జాన్సన్‌ (సి) హార్దిక్‌ (బి) మోహిత్‌ 3, భువనేశ్వర్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 27, మార్కండే (నాటౌట్‌) 18, ఫారూఖీ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 9; మొత్తం 20 ఓవర్లలో 154/9 ; వికెట్లపతనం : 1/6, 2/11, 3/12, 4/29, 5/45, 6/49, 7/59, 8/127, 9/147 ; బౌలింగ్‌: షమి 4–0–21–4, యశ్‌ 4–0–31–1, రషీద్‌ 4–0–28–0, మోహిత్‌ 4–0–28–4, నూర్‌ 2.5–0–35–0, తెవాటియా 1.1–0–0–0.

Updated Date - 2023-05-16T01:03:19+05:30 IST