IndiaVsNewZealand: న్యూజిలాండ్‌కు మూడో పంచ్.. ఇండోర్‌లో ఘనవిజయం

ABN , First Publish Date - 2023-01-24T21:29:35+05:30 IST

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) వన్డే సిరీస్‌లో మూడో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 386 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్..

IndiaVsNewZealand: న్యూజిలాండ్‌కు మూడో పంచ్.. ఇండోర్‌లో ఘనవిజయం

ఇండోర్: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) వన్డే సిరీస్‌లో మూడో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 386 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. 41.2 ఓవర్లలో 295 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో 90 పరుగుల తేడాతో భారత్ విజయం తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డెవోన్ కాన్వే (Devon Conway) అత్యధికంగా 138 పరులు చేశాడు. ఏకంగా 8 సిక్సర్లు, 12 ఫోర్లు బాది జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. అయితే కాన్వేకు మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ సహకారం అందించలేదు. హెన్రీ నికోలస్ 42 పరుగులు, డారిల్ మిచెల్ 24, మిచెల్ బ్రేస్‌వెల్ 26, మిచెల్ సాంట్నర్ 34, లూకీ ఫెర్గుసన్ 7 పరుగులు చొప్పున చేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ సహా టామ్ లాథమ్, జాకబ్ డఫ్ఫీ ఈ ముగ్గురూ డకౌట్ అయ్యారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.

భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఇక యజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు, హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ చొప్పున న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు.

భారత్ బ్యాటింగ్..

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ మరోసారి చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో సెంచరీ బాదేశాడు. అయితే సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. జట్టు స్కోరు 212 పరుగుల వద్ద మిచెల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (101) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక వ్యక్తిగత స్కోరు 112 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 36 పరుగులు వద్ద ఔటయ్యి కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 17 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే చివరిలో హార్ధిక పాండ్యా(54), శార్ధూల్ ఠాకూర్ (25) చెలరేగి ఆడి జట్టు స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరూ ఔటయ్యాక చివరి రెండు ఓవర్లలో తక్కువ పరుగులే వచ్చాయి. వాషింగ్టన్ సుందర్(9), కుల్దీప్ యాదవ్(2,రనౌట్), ఉమ్రాన్ మాలిక్ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, బ్లయిర్ టిక్నర్ చెరో 3 వికెట్లు తీయగా.. మిచెల్ బ్రేస్‌వెల్ 1 వికెట్ తీశాడు. మిగతా 2 వికెట్ల రనౌట్ రూపంలో దక్కాయి. కివీస్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్ మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

Updated Date - 2023-01-24T21:34:23+05:30 IST