ఎవరిని ఆడిస్తారో..?

ABN , First Publish Date - 2023-06-03T01:18:29+05:30 IST

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత బౌలింగ్‌ కూర్పు ఎలా ఉండనుందనే విషయమై ఆస్ట్రేలియా శిబిరంలో చర్చ జరుగుతోంది.

ఎవరిని ఆడిస్తారో..?

అశ్విన్‌కు బెర్త్‌ కష్టమే !

భారత బౌలింగ్‌ కూర్పుపై ఆసీస్‌ చర్చ

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత బౌలింగ్‌ కూర్పు ఎలా ఉండనుందనే విషయమై ఆస్ట్రేలియా శిబిరంలో చర్చ జరుగుతోంది. ఓవల్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుంది కాబట్టి టీమిండియా తుది జట్టులో ఒక్క స్పిన్నర్‌కే అవకాశం దక్కుతుందన్న అభిప్రాయంతో ఆసీస్‌ ఉంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో బహుశా అశ్విన్‌కు చోటు దక్కకపోవచ్చని ఆ జట్టు సహాయక కోచ్‌ డానియెల్‌ వెటోరి అభిప్రాయపడ్డాడు. ‘ఫైనల్లో మా జట్టును భారత్‌ ఎలాంటి బౌలింగ్‌ దళంతో ఎదుర్కొంటుందనే విషయమై మేం చర్చిస్తున్నాం. దీంట్లో భాగంగా స్పిన్నర్‌ జడేజా కచ్చితంగా జట్టులో ఉంటాడని భావిస్తున్నాం. ఎందుకంటే తను ఆరో నెంబర్‌ బ్యాటర్‌గానూ కీలకమవుతాడు. అయితే నాలుగో సీమర్‌గా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఆడిస్తారా? లేక రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌కు అవకాశమిస్తారో.. చూడాల్సిందే. ఏ జట్టయినా కూడా అశ్విన్‌లాంటి బౌలర్‌ను ఆడించాలనే అనుకుంటుంది. కానీ వారి కాంబినేషన్‌ ప్రకారం తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చు. ఓవల్‌ పిచ్‌ మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరు స్పిన్నర్లను ఆడించే చాన్స్‌ తక్కువే’ అని వెటోరి వివరించాడు. మరోవైపు కామెరూన్‌ గ్రీన్‌ తమ జట్టు తరఫున కీలకమవుతాడని వెటోరి భావిస్తున్నాడు.

భరత్‌ కాదు.. సాహాను ఆడించాలి: భజ్జీ

ఆసీ్‌సతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహాను ఆడించాలని హర్భజన్‌ సింగ్‌ కోరాడు. ‘ఎంతో అనుభవం కలిగిన సాహాను ఎంపిక చేస్తే బాగుండేది. దేశవాళీల్లోనూ కొన్ని సీజన్లుగా తను రాణిస్తున్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ ఆకట్టుకున్నాడు’ అని భజ్జీ తెలిపాడు.

ఆ పొరపాటు మళ్లీ చేయొద్దు: ఎమ్మెస్కే

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత జట్టు ఎంపిక సమయంలో చేసిన పొరపాట్లను పునరావృతం చేయరాదని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సూచించాడు. ‘ఆసీ్‌సతో ఆడడానికి ముందు పిచ్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకుని తుది జట్టును ఎంపిక చేసుకోవాలి. పంత్‌ లేని లోటును భర్తీ చేయలేకపోయినా, ఇషాన్‌కన్నా భరత్‌ బెస్ట్‌ చాయిస్‌. అశ్విన్‌, జడేజాలలో ఎవరిని ఎంపిక చేయాలనే నిర్ణయం కష్టమే’ అని ఎమ్మెస్కే తెలిపాడు.

Updated Date - 2023-06-03T01:18:57+05:30 IST