Share News

మానవ హక్కులా.. 2 పాయింట్లా?

ABN , First Publish Date - 2023-11-06T01:31:22+05:30 IST

ఈ ప్రపంచక్‌పలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న అఫ్ఘానిస్థాన్‌ తన తదుపరి మ్యాచ్‌ను మంగళవారం ఆస్ట్రేలియాతో ఆడనుంది...

మానవ హక్కులా.. 2 పాయింట్లా?

ఆసీస్‌ జట్టుపై అఫ్ఘాన్‌ బౌలర్‌ వ్యంగ్యాస్త్రం

న్యూఢిల్లీ: ఈ ప్రపంచక్‌పలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న అఫ్ఘానిస్థాన్‌ తన తదుపరి మ్యాచ్‌ను మంగళవారం ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ నేపథ్యంలో కంగారూలపై ఆ జట్టు బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ చేసిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో యూఏఈ వేదికగా అఫ్ఘాన్‌తో ఆడాల్సిన 3 వన్డేల సిరీ్‌సను రాజకీయ కారణాల రీత్యా ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. అఫ్ఘాన్‌లో బాలికల విద్య, మహిళల సాధికారిత వంటి అంశాల్లో తాలిబన్లు ఆంక్షలు విధించడంతో అప్పట్లో మానవహక్కుల ఉల్లంఘన కారణంగా తమ టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ఆసీస్‌ తెలిపింది. ఇదే విషయాన్ని మంగళవారం తమతో ఆసీస్‌ ఆడబోయే మ్యాచ్‌కు పరోక్షంగా ముడిపెడుతూ.. ఇప్పటికీఅఫ్ఘాన్‌లో పరిస్థితుల్లో మార్పులేదనీ, ఇప్పుడు ఆసీస్‌ ఎలాం టి నిర్ణయం తీసుకుంటుందోనని నవీన్‌ ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో కామెంట్‌ చేశాడు. ‘మాతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు తిరస్కరించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా వైఖరి ఇప్పుడు వరల్డ్‌క్‌పలో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంది. మానవ హక్కులా..? రెండు పాయింట్లా..?’ అని వ్యంగ్యంగా నవీన్‌ పోస్ట్‌ పెట్టాడు. ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియా 5 విజయాలు 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సెమీస్‌ చేరాలంటే కంగారూలు తర్వాతి రెండు మ్యాచుల్లోనూ నెగ్గాలి. దీంతో 2పాయింట్ల కోసం తమతో ఆసీస్‌ పోరాడుతోందని అర్థం వచ్చేలా నవీన్‌ ఇలా పోస్ట్‌ పెట్టాడు.

Updated Date - 2023-11-06T01:31:26+05:30 IST