సాయం అందింది.. పతకం కొట్టింది
ABN , First Publish Date - 2023-11-21T02:34:16+05:30 IST
‘అంతర్జాతీయ టోర్నీలో పోటీపడేందుకు సాయమందిస్తే.. పతకంతో తిరిగొస్తా’ అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది తెలుగమ్మాయి...

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
అనంతపురం (ఆంధ్రజ్యోతి): ‘అంతర్జాతీయ టోర్నీలో పోటీపడేందుకు సాయమందిస్తే.. పతకంతో తిరిగొస్తా’ అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది తెలుగమ్మాయి, యువ రెజ్లర్ ఉమాదేవి. రష్యా రాజధాని మాస్కోలో రెండ్రోజుల క్రితం ముగిసిన ప్రపంచ రెజ్లింగ్ జూనియర్ చాంపియన్‌షి్‌పలో ఉమాదేవి 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంగాల గ్రామానికి చెందిన ఉమాదేవిది నిరుపేద కుటుంబం. దీంతో ఆ టోర్నీలో పాల్గొనేందుకు ఉమాదేవికి ఆర్ధిక కష్టాలు ఎదురవడంతో.. ‘ప్రపంచ పోటీలకు ఎంపిక... ఆర్థిక సాయానికి ఎదురుచూపు’ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి గతనెల 29న కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు.. ప్రయాణ ఖర్చుల కోసం రూ. 2 లక్షలతో పాటు క్రీడాసామగ్రిని అందజేశారు. అనుకున్నట్టే ఉమాదేవి ఆ టోర్నీకి వెళ్లి ఏకంగా పతకంతో తిరిగొచ్చింది. దీంతో ఉమాదేవిని సత్యనారాయణ రాజు అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఉమాదేవి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.