Gongadi Trisha : ‘పరీక్ష’లకు తట్టుకొని..

ABN , First Publish Date - 2023-01-31T00:42:25+05:30 IST

గొంగడి త్రిష..తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ సర్కిళ్లలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు. గత నవంబరులో అండర్‌-19 జాతీయ జట్టుకు ఎంపికైన ఆమె..న్యూజిలాండ్‌తో

Gongadi Trisha : ‘పరీక్ష’లకు తట్టుకొని..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

గొంగడి త్రిష..తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ సర్కిళ్లలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు. గత నవంబరులో అండర్‌-19 జాతీయ జట్టుకు ఎంపికైన ఆమె..న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీ్‌సలో ప్రాతినిధ్యం వహించింది. జాతీయ జట్టుకు ఆడిన తొలిసారే 17 ఏళ్ల ఈ భద్రాచలం అమ్మాయి తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఆ సిరీ్‌సలో నాలుగు మ్యాచ్‌లలో ఆమెకు ఆడే అవకాశం లభించింది. అండర్‌-19 వరల్డ్‌ కప్‌నకు సన్నాహకంగా ఆ సిరీ్‌సను భారత్‌ ఉపయోగించుకుంది. అందుకు కివీస్‌పై మ్యాచ్‌ల్లో జట్టు మేనేజ్‌మెంట్‌ అనేక ప్రయోగాలు చేసింది. ఆ క్రమంలో త్రిష మూడు టీ20లలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగింది. రెండో మ్యాచ్‌లో 36, మూడో టీ20లో 32 రన్స్‌ చేసిన ఆమె మేనేజ్‌మెంట్‌ను ఆకర్షించింది. దాంతో నాలుగో మ్యాచ్‌లో త్రిషను ఓపెనర్‌గా దించారు. అందులో 39 పరుగులు చేసిన త్రిష.. జట్టు తనను వివిధ బ్యాటింగ్‌ స్థానాల్లో దించుతూ చేసిన పరీక్షలను తట్టుకొని తానేంటో నిరూపించుకుంది. మొత్తంగా మొదటి సిరీ్‌సలో బ్యాటర్‌గా ఆమె తన సత్తా నిరూపించుకుంది. ఫలితంగా సౌతాఫ్రికాలో జరిగిన తొలి అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌నకు టీమిండియాలో త్రిష స్థానం దక్కించుకుంది. బలమైన న్యూజిలాండ్‌పై పలు స్థానాలలో బ్యాటింగ్‌ చేసి ప్రశంసనీయ రీతిలో పరుగులు సాధించి ఉండడంతో జట్టు యాజమాన్యం ప్రపంచ కప్‌లోనూ త్రిషను వివిఽధ స్థానాల్లో బ్యాటింగ్‌కు దించేందుకు వెనుకాడలేదు.

సాధారణంగా సీనియర్‌ మహిళలు, పురుషుల విభాగాల్లో ఓ క్రికెటర్‌కు ఎంత అనుభవమున్నా విభిన్న స్థానాల్లో ఆడాలంటే కాస్త సంకోచిస్తాడు. కానీ మెగా టోర్నీలో గ్రూపు దశనుంచి సూపర్‌ సిక్స్‌ వరకు త్రిష నాలుగు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిందంటే టీమ్‌కు ఆమె సత్తాపై ఎంత నమ్మకముందో తెలుస్తుంది. స్కాట్లాండ్‌పై గ్రూప్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేయడం ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఇంగ్లండ్‌తో ఫైనల్లో స్వల్ప లక్ష్య ఛేదనలో త్రిష క్రీజులోకి వచ్చినప్పుడు జట్టు రెండు వికెట్లు కోల్పోయి పరిస్థితి ఉత్కంఠగా ఉంది. అయితే తెలుగు క్రికెటర్‌ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. వరుసగా రెండు ఫోర్లు కొట్టి జట్టులో టెన్షన్‌ తగ్గించింది. ఆపై మరో బౌండరీ కూడా బాది అవుటైనా అప్పటికే జట్టు గెలుపు దిశగా దూసుకొచ్చింది. మొత్తంగా..జట్టులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వివిఽధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేయడాన్ని త్రిష సవాలుగా తీసుకుంది. జంకూ..గొంకూలేని తన బ్యాటింగ్‌తోపాటు లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థుల పనిపట్టే త్రిష జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనే స్థితికి చేరుకుంది. త్వరలో మహిళల ఐపీఎల్‌ జట్ల క్రికెటర్ల వేలం జరగనుంది. ఇందులో ఆయా ఫ్రాంచైజీలు త్రిషను తీసుకొనేందుకు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపిస్తే సీనియర్‌ జట్టులో అడుగుపెట్టేందుకు ఈ భద్రాద్రి అమ్మాయికి ఎంతో సమయం పట్టదు.

Updated Date - 2023-01-31T00:42:26+05:30 IST