గాయత్రి జోడీ ముందంజ
ABN , First Publish Date - 2023-08-02T04:53:04+05:30 IST
భారత డబుల్స్ జంట పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.
సిడ్నీ: భారత డబుల్స్ జంట పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో గాయత్రి-ట్రీసా ద్వయం 21-16, 21-17తో కెనడా జోడీ కాథరిన్-జోసెఫిన్‌ను ఓడించింది. మరో డబుల్స్ పోరులో అశ్వినీ పొన్నప్ప-తనీషా క్రాస్టో ద్వయం 11-21, 21-14, 17-21తో ఫెబ్రియానా-అమేలియా (ఇండోనేసియా) చేతిలో, సిక్కిరెడ్డి-ఆరతి సారా జోడీ 14-21, 17-21తో సూ యిన్-లీ చి చెన్ (తైవాన్) జంట చేతిలో ఓటమిపాలయ్యారు.
ప్రణయ్‌కు 9, సేన్‌కు 11: హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశారు. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఓ స్థానం మెరుగై 9వ ర్యాంకు, సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచాడు. కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్‌కు పడిపోగా, సింధు 17వ ర్యాంకులో మార్పులేదు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది. గాయత్రి-ట్రీసా జాలీ జంట 17వ ర్యాంక్‌కు చేరుకుంది.
సిఫ్త్‌కౌర్ ‘డబుల్ గోల్డ్’
చెంగ్డూ (చైనా): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత యువ షూటర్ సిఫ్త్‌కౌర్ రెండు స్వర్ణాలు సాధించింది. మహిళల 50 మీటర్ల వ్యక్తిగత రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన సిఫ్త్‌కౌర్.. మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఆషి చౌక్సీ, మానినితో కలిసి మరో పసిడి అందుకుంది. 50 మీటర్ల వ్యక్తిగత రైఫిల్‌లో భారత్‌కే చెందిన ఆషి రజతం గెలిచింది. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు కాంస్యం నెగ్గింది.