Future stars : భవిష్యత్‌ తారలు

ABN , First Publish Date - 2023-01-31T00:53:53+05:30 IST

అనామకులుగా వెళ్లారు.. విజేతలుగా తిరిగివచ్చారు. అండర్‌-19 మహిళల వరల్డ్‌కప్‌లో పాల్గొన్న భారత జట్టు గురించి ఇలాగే చెప్పాల్సి ఉంటుందేమో. సీనియర్‌ జట్టులో ఆడే షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను మినహాయిస్తే

 Future stars : భవిష్యత్‌ తారలు

అనామకులుగా వెళ్లారు.. విజేతలుగా తిరిగివచ్చారు. అండర్‌-19 మహిళల వరల్డ్‌కప్‌లో పాల్గొన్న భారత జట్టు గురించి ఇలాగే చెప్పాల్సి ఉంటుందేమో. సీనియర్‌ జట్టులో ఆడే షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను మినహాయిస్తే మిగతా ప్లేయర్స్‌ గురించి ఎవరికీ తెలీదు. కానీ అంచనాలకు మించి ఆట తీరుతో ఒక్కో ప్రత్యర్థిని మట్టి కరిపిస్తూ ఆరంభ టీ20 ప్రపంచక్‌పను వశం చేసుకున్నారు. తద్వారా దేశ క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మహిళల క్రికెట్‌ భవిష్యత్‌కు ఢోకా లేదనే భరోసాను కల్పించారు. వారిలో ఇద్దరు తెలుగమ్మాయిలు త్రిష, షబ్నమ్‌ ఉన్నారు. అసలింతకీ ఈ క్రీడాకారిణులు ఎక్కడి నుంచి వచ్చారు..తదితర వివరాలను ఓసారి పరిశీలిస్తే..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

షఫాలీ వర్మ (కెప్టెన్‌)

హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన 19 ఏళ్ల షఫాలీ భారత మహిళల క్రికెట్‌ను ఫాలోఅయ్యే అభిమానులకు తెలిసిన పేరే. విధ్వంసకర ఓపెనర్‌గా ఇప్పటికే మూడు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆడిన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపిన్న వయస్సు (15 ఏళ్ల 285 రోజులు)లోనే అర్ధసెంచరీ చేసి సచిన్‌ రికార్డును అధిగమించింది.

సౌమ్య తివారీ (వైస్‌ కెప్టెన్‌)

చిన్నతనంలో తన తల్లి దుస్తులు ఉతకడానికి ఉపయోగించే చెక్క తెడ్డుతో సౌమ్య క్రికెట్‌ ఆడడం ఆరంభించింది. మొదట కోచ్‌ సురేశ్‌ చియానాని ఆమెకు క్రికెట్‌ను నేర్పించేందుకు నిరాకరించాడట. ఆ తర్వాత సౌమ్య పట్టుదలను గమనించి మెళకువలు నేర్పి రాటుదేల్చాడు. సౌమ్య ఫైనల్లో ఇంగ్లండ్‌పై బాధ్యతాయుతంగా ఆడి త్రిషతో కలిసి జట్టును గెలిపించింది. సౌమ్యది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌.

శ్వేత సెహ్రావత్‌ (ఓపెనర్‌)

దక్షిణ ఢిల్లీకి చెందిన శ్వేత తొలి ప్రాధాన్యం క్రికెట్‌ కాదు. మొదట వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, స్కేటింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాకే క్రికెట్‌ వైపు మరలింది. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో 297 పరుగులతో టాపర్‌గా నిలిచి జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది.

గొంగడి త్రిష (ఓపెనర్‌)

తెలంగాణకు చెందిన గొంగడి త్రిషది భద్రాచలం. ఆమె తండ్రి రామిరెడ్డి అండర్‌-16 జాతీయ హాకీ మాజీ ఆటగాడు. కూతురిని గొప్ప క్రికెటర్‌ను చేయాలనేది అతడి కల. త్రిష క్రికెట్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తన పూర్వీకుల నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సైతం అమ్మేశాడు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఓ అర్ధసెంచరీతో పాటు ఫైనల్లో 24 పరుగులు సాధించింది.

రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌)

ఎంఎస్‌ ధోనీని అమితంగా ఆరాధించే బెంగాలీ రిచా ఘోష్‌ ఇప్పటికే జాతీయ జట్టులో సభ్యురాలు. గత నెలలో ఆసీ్‌సతో జరిగిన సిరీ్‌సలో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, వరల్డ్‌క్‌పలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 93 పరుగులు సాధించింది.

అర్చనా దేవి (ఆఫ్‌ స్పిన్నర్‌)

యూపీకి చెందిన అర్చన పేదరికంలో పుట్టి పెరిగింది. ఆమెకు నాలుగేళ్ల వయస్సులో తండ్రి క్యాన్సర్‌తో మరణించాడు. ఆ తర్వాత అర్చన కొట్టిన బంతిని వెదికే క్రమంలో సోదరుడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఈ విషాదాలను అధిగమిస్తూ తన టీచర్‌ ప్రోత్సాహంతో క్రికెటర్‌గా రాణించాలనుకుంది. కాన్పూర్‌లోని కోచ్‌ కపిల్‌ పాండే అకాడమీలో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సలహాలు కూడా ఆమెను రాటుదేల్చాయి. ఫైనల్లో అద్భుత క్యాచ్‌తో పాటు రెండు వికెట్లను పడగొట్టింది. ఓవరాల్‌గా ఎనిమిది వికెట్లు తీసి టైటిల్‌ వేటలో కీలక పాత్ర పోషించింది.

ఎండీ షబ్నమ్‌ (మీడియం పేసర్‌)

విశాఖపట్నానికి చెందిన షబ్నమ్‌కు ఈ మెగా టోర్నీలో ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ వికెట్‌ తీసింది. తండ్రి నేవీలో పనిచేస్తుంటాడు.

టిటాస్‌ సాధు (పేసర్‌)

చక్కటి బౌన్స్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే సామర్థ్యం బెంగాల్‌కు చెందిన టిటాస్‌ సొంతం. తన కుటుంబానికి సొంతంగా క్రికెట్‌ క్లబ్‌ ఉంది. తండ్రిలాగా స్ర్పింటర్‌గా మారాలనుకున్న సాధు.. టెన్త్‌ క్లాస్‌లో 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయ్యింది. అయితే క్రికెట్‌ కోసం చదువును పక్కనబెట్టింది.

పర్షవీ చోప్రా (లెగ్‌ స్పిన్నర్‌)

యూపీలోని బులంద్‌షహర్‌కు చెందిన 16 ఏళ్ల పర్షవీ ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తా చూపగలిగింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లను వణికిస్తూ అత్యధికంగా 11 వికెట్లను తీసింది. ఇదే రీతిన రాణిస్తే కచ్చితంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోగలుగుతుంది.

మన్నత్‌ కశ్యప్‌

(లెఫ్టామ్‌ స్పిన్నర్‌)

పటియాలకు చెందిన మన్నత్‌ చిన్నతనంలో గల్లీ క్రికెట్‌ ఆడేది. సోదరుడి సూచనతో ఆటను సీరియస్‌గా తీసుకుని భారత జట్టుకు ఆడగలిగింది. అంతేకాదు చక్కటి వేగం ఉండడంతో పాటు కచ్చితత్వంతో బంతులు విసిరి ఆరు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీయగలిగింది.

సోనమ్‌ యాదవ్‌

(లెఫ్టామ్‌ స్పిన్నర్‌)

యూపీకి చెందిన 15 ఏళ్ల సోనమ్‌ తండ్రి గ్లాస్‌ ఫ్యాక్టరీ కార్మికుడు. చిన్నతనంలో బాలురతో కలిసి క్రికెట్‌ ఆడుతున్న కూతురు ఆసక్తిని గమనించి అకాడమీలో చేర్చాడు. కోచ్‌ సూచన మేరకు బ్యాటర్‌ నుంచి స్పిన్నర్‌గా మారిన సోనమ్‌.. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకుంది.

Updated Date - 2023-01-31T00:53:54+05:30 IST