పెగులాకు షాక్‌

ABN , First Publish Date - 2023-06-03T01:09:35+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మరో సీడెడ్‌ తిరుగుముఖం పట్టింది.

పెగులాకు షాక్‌

ప్రీక్వార్టర్స్‌లో జొకో, సబలెంక

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మరో సీడెడ్‌ తిరుగుముఖం పట్టింది. ఈసారి మూడో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా) వంతైంది. అలాగే పురుషుల ఏడో సీడ్‌ రుబ్లేవ్‌ కూడా నిష్క్రమించాడు. టైటిల్‌ ఫేవరెట్‌ జొకోవిచ్‌, మహిళల రెండో సీడ్‌ సబలెంకా ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో 28వ సీడ్‌ ఎలైస్‌ మెర్టెన్స్‌ (బెల్జియం) 6-1, 6-3 స్కోరుతో వరుస సెట్లలో పెగులాను కంగుతినిపించింది. టోర్నీలో ఇప్పటికే మహిళల ఐదో సీడ్‌ కరోలిన్‌ గార్సియా, ఎనిమిదో సీడ్‌ సకారి, 10వ సీడ్‌ పెట్రా క్విటోవా పరాజయం పాలైన సంగతి తెలిసింది. మరో మూడో రౌండ్‌లో పవ్ల్యుచెన్కోవా 4-6, 6-3, 6-0తో రష్యాకే చెందిన అనస్టాసియా పొటపోవాపై నెగ్గింది. అలాగే రెండో సీడ్‌ అర్యానా సబలెంకా (బెలారస్‌), 9వ సీడ్‌ డారియా (రష్యా), స్టోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), స్విటోలినా (ఉక్రెయిన్‌) ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జొకోవిచ్‌ 7-6 (4), 7-6 (5), 6-2 స్కోరుతో ఫోకినా (స్పెయిన్‌)పై విజయంతో ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో 11వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)..కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేశాడు.

సాకేత్‌ జోడీ ఓటమి : డబుల్స్‌ రెండో రౌండ్‌లో సాకేత్‌ మైనేని/యుకీ భాంబ్రీ జోడీ 4--6, 5-7 స్కోరుతో మెక్సికో, ఫ్రాన్స్‌ ద్వయం గొంజాలెజ్‌/ రోజర్‌ వాసిలిన్‌ చేతిలో పరాజయం పాలైంది.

Updated Date - 2023-06-03T01:09:35+05:30 IST