బౌలర్ల వర్క్‌లోడ్‌పై దృష్టి

ABN , First Publish Date - 2023-06-01T00:24:17+05:30 IST

మరో వారంలో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో..

బౌలర్ల వర్క్‌లోడ్‌పై దృష్టి

పోర్ట్స్‌మౌత్‌ (ఇంగ్లండ్‌): మరో వారంలో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో.. సుదీర్ఘకాలం ఐపీఎల్‌ ఆడివుండడంతో బౌలర్ల వర్క్‌లోడ్‌పై టీమిండియా ప్రధానంగా దృష్టి సారించింది. ఈనెల ఏడున ఓవల్‌లో మొదలయ్యే తుది పోరులో తలపడే భారత జట్టు బౌలర్లు సిరాజ్‌, శార్దూల్‌, అక్షర్‌, ఉనాద్కట్‌, ఉమేశ్‌ తొలుత ఇక్కడకు చేరుకున్నారు. అయితే ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఆడాల్సి రావడంతో పేస్‌ బౌలింగ్‌ దళపతి షమి మాత్రం ఆలస్యంగా జట్టుతో చేరాడు. మరోవైపు కౌంటీల్లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మిడిలార్డర్‌ బ్యాటర్‌ పుజార ఎప్పటినుంచే ఇక్కడే ఉన్నాడు. మొత్తంగా..డబ్ల్యూటీసీ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా అరుండెల్‌ క్యాసిల్‌ క్రికెట్‌ క్లబ్‌లో సోమవారంనాడు ప్రాక్టీస్‌ షురూ చేసింది. ఇక్కడే మనోళ్లు మరికొన్ని రోజులు సాధన చేయనున్నారు. ‘జట్టు సన్నాహకాలు చక్కగా సాగుతున్నాయి. టెస్ట్‌ మోడ్‌లోకి వచ్చేలా మొదటి ప్రాక్టీస్‌ సాగింది. గత రెండు సెషన్లలో తీవ్రంగా సాధన చేశారు. ముఖ్యంగా బౌలర్లు టెస్ట్‌ల్లో బౌలింగ్‌ చేసే మాదిరి కాస్త ఎక్కువగా శ్రమించారు’ అని బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే తెలిపాడు. ఫైనల్‌కు ముందు కొద్దిరోజులు బౌలర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు అతడు వెల్లడించాడు. ‘మరో రెండు సెషన్లు ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంది. ఫైనల్‌కు ముందు బౌలర్లకు రెస్ట్‌ ఇస్తాం. దాంతో వారితో ఈ రెండు సెషన్లలో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయిస్తాం’ అని వివరించాడు. ఐపీఎల్‌లో ఆడి ఉన్నందున గ్రౌండ్‌ ఫీల్డింగ్‌కు సంబంధించి ప్రాక్టీస్‌ అవసరంలేదని, అందువల్ల స్లిప్పులలో క్యాచ్‌లపై సాధన చేస్తున్నట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ వెల్లడించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడేలా బ్యాటర్లను సిద్ధం చేస్తున్నట్టు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చెప్పాడు. ‘

పుజార సలహాలు అమూల్యం: గవాస్కర్‌

సుదీర్ఘకాలం ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడి ఉండడంవల్ల ఫైనల్‌కు ముందు పుజార సలహాలు టీమిండియాకు ఎంతో ఉపకరిస్తాయని దిగ్గజ బ్యాటర్‌ గవాస్కర్‌ అన్నాడు. ‘చాలాకాలంగా పుజార ఇక్కడ ఆడుతున్నాడు. దాంతో ఓవల్‌ పిచ్‌పై అతడికి అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాటర్లకు పుజార ఇచ్చే సలహాలు ఎంతో అమూల్యం’ అని గవాస్కర్‌ చెప్పాడు.

కీపర్‌గా భరతే..!

ఫైనల్‌కు తుది జట్టులో కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌కు బదులు కేఎస్‌ భరత్‌ను ఎంపిక చేయడంలో రెండో ఆలోచనే ఉండబోదని జాతీయ మాజీ సెలెక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ అన్నాడు. ‘భరత్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కీపర్‌. స్వదేశంలో ఆస్ర్టేలియాపై చక్కగా కీపింగ్‌ చేశాడు. ఉపయుక్తమైన బ్యాటర్‌ కూడా. అందువల్ల తుది 11మందిలో అతడికి చోటు కల్పించడంపై రెండో ఆలోచన ఉండబోదు’ అని అభిప్రాయపడ్డాడు. షమి, సిరాజ్‌కు తోడు మూడో పేసర్‌గా ఉమేష్‌ యాదవే బెటరని శరణ్‌దీప్‌ పేర్కొన్నాడు. ‘పాత బంతితో ఉమేష్‌ సమర్థంగా రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగలడు. అందువల్ల ఓవల్‌ వికెట్‌పై అతడిని ఆడించడమే ఉత్తమం’ అని వివరించాడు. ఆసీస్‌ పేసర్లు బంతిని స్వింగ్‌ చేయలేరని, అందువల్ల తుది పోరు ఫలితం భారత్‌కే అనుకూలంగా ఉంటుందని అన్నాడు.

Updated Date - 2023-06-01T00:24:17+05:30 IST