World Boxing Championship : డబుల్‌ ధమాకా

ABN , First Publish Date - 2023-03-26T01:46:36+05:30 IST

స్వదేశంలో జరుగుతున్న మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయిలు నీతు ఘాంఘాస్‌, స్వీటీ బూర స్వర్ణ చరిత్రను లిఖించారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన టైటిల్‌..

World Boxing Championship : డబుల్‌ ధమాకా

వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో నీతు, స్వీటీకి స్వర్ణ పతకాలు

ఒకే రోజు భారత్‌కు రెండు టైటిళ్లు

నేటి ఫైనల్స్‌ బరిలో నిఖత్‌, లవ్లీనా

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత అమ్మాయిలు నీతు ఘాంఘాస్‌, స్వీటీ బూర స్వర్ణ చరిత్రను లిఖించారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన టైటిల్‌ ఫైట్‌లో ఈ ఇరువురు పసిడి పతకాలను కొల్లగొట్టి శభాష్‌ అనిపించారు. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌ టైటిళ్లను ముద్దాడి దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ సరసన నిలిచారు. తొలుత మహిళల 48 కిలోల ఫైనల్‌ బౌట్‌లో నీతు 5-0తో ప్రత్యర్థి లుత్సాయిఖాన్‌ (మంగోలియా)ను చిత్తు చేసి, కెరీర్‌లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌ హోదాను అందుకుంది. బౌట్‌ తొలి రౌండ్‌ నుంచే దూకుడు ప్రదర్శించిన నీతు.. అన్ని రౌండ్లలోనూ అదే జోరు కొనసాగించింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వకుండా బౌట్‌ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన నీతు, ఈ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు తొలి స్వర్ణం అందించి మురిపించింది. ఇక, గత ఏడాది బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోనూ స్వర్ణ పతకంతో మెరిసిన 22 ఏళ్ల నీతు మరోసారి తన సత్తాను చాటింది.

స్వీటీ గోల్డెన్‌ పంచ్‌: నీతు స్వర్ణ పతక విజయోత్సవాలు ముగిసిన కొద్దిసేపటికే సీనియర్‌ బాక్సర్‌ స్వీటీ బూర మరో పసిడి పతకాన్ని భారత్‌కు అందించి సంబరాలను రెట్టింపు చేసింది. మహిళల 81 కిలోల స్వర్ణ పోరులో స్వీటీ 4-3తో వాంగ్‌ లైనా (చైనా)పై నెగ్గి కెరీర్‌లో మొట్టమొదటి సారిగా వరల్డ్‌ చాంపియన్‌గా ఆవిర్భవించింది. తొలి రౌండ్‌లో స్వీటీ పూర్తి ఆధిపత్యం కనబర్చగా రెండో రౌండ్‌ నుంచి ఒకింత రక్షణాత్మకంగా ఆడింది. ప్రత్యర్థిని నిశితంగా అంచనా వేస్తూ సమయం చూసి పంచ్‌లు కురిపించింది. ప్రత్యర్థి వాంగ్‌ మాజీ వరల్డ్‌ చాంపియన్‌ (2018) కావడంతో స్వీటీకి విజయం సులభంగా లభించలేదు. వాంగ్‌ నుంచి తీవ్రమైన పోటీ ఎదురు కావడంతో స్వీటీ తుది వరకు పోరాడి విజయం సాధించింది. స్వీటీ భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ దీపక్‌ హూడా భార్య కావడం విశేషం.

Nitu-Ghanghas-poses11.jpg

నేటి స్వర్ణ పోరులో నిఖత్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ తన రెండో వరల్డ్‌ టైటిల్‌పై గురి పెట్టింది. నిరుడు కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించిన నిఖత్‌, ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉంది. 50 కిలోల విభాగంలో తలపడుతున్న నిఖత్‌ ఆదివారం జరగనున్న ఫైనల్‌లో రెండుసార్లు ఆసియా చాంపియన్‌ గాయెన్‌ థి టామ్‌ (వియత్నాం)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, 75 కిలోల ఫైనల్‌లో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తుదిపోరులో ఆస్ట్రేలియా బాక్సర్‌ కైట్లిన్‌ పార్కర్‌తో లవ్లీనా తలపడనుంది.

Updated Date - 2023-03-26T01:46:36+05:30 IST