Delhi Capitals: ఢిల్లీ.. జోరందుకుంది

ABN , First Publish Date - 2023-05-07T02:12:46+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టు వదలడం లేదు. ఆలస్యంగానైనా.. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో రేసులో తామూ ఉన్నామంటూ ఉనికి చాటుకుంటోంది.

Delhi Capitals: ఢిల్లీ.. జోరందుకుంది

చెలరేగిన ఫిల్‌ సాల్ట్‌

బెంగళూరుపై 7 వికెట్లతో విజయం

ఫిల్‌ సాల్ట్‌ (45 బంతుల్లో 87)

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టు వదలడం లేదు. ఆలస్యంగానైనా.. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో రేసులో తామూ ఉన్నామంటూ ఉనికి చాటుకుంటోంది. ఫిల్‌ సాల్ట్‌ (45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 87) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మురిపించాడు. దీంతో శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డీసీ 7 వికెట్లతో నెగ్గింది. ముందుగా ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (46 బంతుల్లో 5 ఫోర్లతో 55), మహిపాల్‌ లొమ్రోర్‌ (29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్‌), డుప్లెసి (32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించారు. మార్ష్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో డీసీ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసి నెగ్గింది. రొసో (22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 35 నాటౌట్‌) వేగంగా ఆడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సాల్ట్‌ నిలిచాడు.

దూకుడుగా..:

తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లతో ఢిల్లీ తమ చేధన ఎలా ఉండబోతోందో స్పష్టం చేసింది. టాప్‌–4 విదేశీ ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించడంతో డీసీ సునాయాస విజయం అందుకుంది. ఆరంభంలో వార్నర్‌ (22).. సాల్ట్‌ దెబ్బకు ఆర్‌సీబీ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. షార్ట్‌ పిచ్‌ బంతులను సాల్ట్‌ ఓ ఆటాడుకున్నాడు. సిరాజ్‌ ఓవర్‌లోనైతే అతను వరుసగా 6,6,4 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 70 పరుగులతో నిలిచింది. వార్నర్‌ ఆరో ఓవర్‌లో అవుటైనా.. సాల్ట్‌కు మిచెల్‌ మార్ష్‌ (26) కలువడంతో స్కోరు ఏమాత్రం తగ్గలేదు. తొమ్మిదో ఓవర్‌లో సాల్ట్‌ 3 ఫోర్లతో 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మార్ష్‌ను హర్షల్‌ అవుట్‌ చేయడంతో క్రీజులోకి వచ్చిన రొసో మరింత వేగంగా చెలరేగాడు. 13వ ఓవర్‌లో అతను 6,6,4 సాధించగా.. సాల్ట్‌ మరో సిక్సర్‌తో జట్టు 24 రన్స్‌ రాబట్టింది. సెంచరీ దిశగా సాగుతున్న సాల్ట్‌ను కరణ్‌ శర్మ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి ఢిల్లీ విజయానికి 27 బంతుల్లో 11 రన్స్‌ మాత్రమే అవసరమవగా.. అక్షర్‌ (8 నాటౌట్‌) తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. రొసో మరో సిక్సర్‌తో ఢిల్లీ సంబరాల్లో మునిగింది.

SIRAJ.gif

విరాట్‌, లొమ్రోర్‌ అండగా..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసి తొలి వికెట్‌కు 82 పరుగులతో శుభారంభాన్ని అందించారు. అలాగే లొమ్రోర్‌ ధాటిగా ఆడడంతో ఆర్‌సీబీ సవాల్‌ విసిరే స్కోరును అందుకుంది. ఆరంభంలో వికెట్‌పై బౌన్స్‌ లేకపోవడంతో పరుగులు తీయడం కష్టంగా మారింది. దీంతో ఓపెనర్లు ఆచితూచి ఆడాల్సి వచ్చింది. ఐదో ఓవర్‌లో డుప్లెసి మూడు ఫోర్లు, ఆరో ఓవర్‌లో 6,4తో స్కోరు వేగం అందుకుని పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులతో నిలిచింది. అటు కోహ్లీ స్ట్రయిక్‌ను రొటేట్‌ చేస్తూ అతడికి సహకారం అందించాడు. సజావుగా సాగుతున్న వీరి ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో పేసర్‌ మార్ష్‌.. డుప్లెసి, మ్యాక్స్‌వెల్‌ (0)ల వికెట్లు తీసి డబుల్‌ ఝలక్‌ ఇచ్చాడు. కానీ వచ్చీ రాగానే బ్యాట్‌ను ఝళిపించిన లొమ్రోర్‌ 14వ ఓవర్‌లో 4,6.. తర్వాతి ఓవర్‌లో సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. ఇక 42 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన కోహ్లీని ముకేశ్‌ కుమార్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం అదే జోరును సాగించిన లొమ్రోర్‌ 26 బంతుల్లోనే కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే చివరి రెండు ఓవర్లలో ఆర్‌సీబీ 15 పరుగులే చేసి దినేశ్‌ కార్తీక్‌ (11) వికెట్‌ కోల్పోయింది.

సిరాజ్‌ X సాల్ట్‌

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సాల్ట్‌, వార్నర్‌లతో పేసర్‌ సిరాజ్‌ వాగ్వాదం చర్చనీయాంశమైంది. ఐదో ఓవర్‌లో సాల్ట్‌ వరుసగా 6,6,4 బాదగా నాలుగో బంతిని సిరాజ్‌ కాస్త ప్రమాదకరంగా సాల్ట్‌ తలపై నుంచి వేయడంతో అంపైర్‌ వైడ్‌గా ప్రకటించాడు. అటు సాల్ట్‌ ఈ విషయమై అడగడంతో సిరాజ్‌ అతడి పైకి దూసుకెళ్లాడు. మధ్యలో వార్నర్‌ కలుగజేసుకోగా అతడితోనూ వేలు చూపిస్తూ మాట్లాడాడు. ఇక వెళ్లిపో అంటూ సాల్ట్‌ సైగ చేయగా.. ష్‌ మాట్లాడకంటూ సిరాజ్‌ కూడా సైగ చేయడం కనిపించింది.

6.gif

స్కోరుబోర్డు

బెంగళూరు:

కోహ్లీ (సి) ఖలీల్‌ (బి) ముకేశ్‌ 55, డుప్లెసి (సి) అక్షర్‌ (బి) మార్ష్‌ 45, మ్యాక్స్‌వెల్‌ (సి) సాల్ట్‌ (బి) మార్ష్‌ 0, మహిపాల్‌ లొమ్రోర్‌ (నాటౌట్‌) 54, దినేశ్‌ కార్తీక్‌ (సి) వార్నర్‌ (బి) ఖలీల్‌ 11, అనూజ్‌ రావత్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 181/4; వికెట్ల పతనం: 1–82, 2–82, 3–137, 4–172; బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–45–1, అక్షర్‌ 3–0–17–0, ఇషాంత్‌ 3–0–29–0, ముకేశ్‌ 3–0–30–1, మార్ష్‌ 3–0–21–2, కుల్దీప్‌ 4–0–37–0.

ఢిల్లీ:

వార్నర్‌ (సి) డుప్లెసి (బి) హాజెల్‌వుడ్‌ 22, ఫిల్‌ సాల్ట్‌ (బి) కరణ్‌ శర్మ 87, మార్ష్‌ (సి) మహిపాల్‌ (బి) హర్షల్‌ 26, రొసో (నాటౌట్‌) 35, అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 16.4 ఓవర్లలో 187/3; వికెట్ల పతనం: 1–60, 2–119, 3–171; బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–28–0, మ్యాక్స్‌వెల్‌ 1.4–0–14–0, హాజెల్‌వుడ్‌ 3–0–29–1, హసరంగ 4–0–32–0, కరణ్‌ శర్మ 3–0–33–1, మహిపాల్‌ లొమ్రోర్‌ 1–0–13–0, హర్షల్‌ 2–0–32–1.

Updated Date - 2023-05-07T02:12:46+05:30 IST